శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Jun 21, 2020 , 02:01:24

మిడతల దండుపై పోరుకు వాహనాలు సిద్ధం

మిడతల దండుపై పోరుకు వాహనాలు సిద్ధం

  •  రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు 
  •  స్ప్రే చేసేందుకు రసాయనాలు రెడీ 
  •  గ్రామాల్లో రైతులకు అవగాహన

నిజామాబాద్‌ అర్బన్‌ : మిడతల దండును ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవి జిల్లాకు చేరుకుంటే పంటలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు రవాణాశాఖ ఆధ్వర్యంలో వాహనాలను సిద్ధం చేస్తున్నారు. బోధన్‌ మండలానికి రాజీవ్‌, ఆర్మూర్‌కు జయప్రకాశ్‌, వెంకటయ్య, సత్యమూర్తి, నిజామాబాద్‌కు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రవాణాశాఖ అధికారులను నియమించారు. వీరు పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పనిచేస్తారు. జిల్లాలో మిడతలు ప్రవేశించిన ప్రాంతానికి వెంటనే వాహనాల్లో వెళ్లి అక్కడ మందును పిచికారీ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో కోట్లలో వచ్చే మిడతలు ఎకరం పంటను కేవలం మూడు నిమిషాల్లో తింటాయని తెలియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతలకు ఆందోళన అవసరం లేదని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని అధికారులు భరోసా కల్పిస్తున్నారు. ఎక్కడైనా మిడతలు వస్తున్నట్లు తెలిస్తే రైతులు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అక్కడికి వాహనాల్లో చేరుకొని రసాయనాలు పిచికారీ చేయడంతో పాటు వాటి దిశను మార్చేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయాధికారులు మిడతల దండుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 


logo