శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Jun 20, 2020 , 02:17:57

అభివృది పనులకు ఉపాధి ఊతం

అభివృది పనులకు ఉపాధి ఊతం

n ప్రధాన శాఖల్లో పనులకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌తో అనుసంధానం 

n రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి సీఎం కేసీఆర్‌ కృషి 

nరాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి 

n ఉభయ జిల్లాల్లో వేర్వేరుగా అధికారులతో సమీక్షా సమావేశం

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కామారెడ్డి : రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. ఈనెల 16న జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌ ఆదేశించిన పలు అంశాలపై ఉదయం నిజామాబాద్‌, సా యంత్రం కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్లలో కలెక్టర్లు నారాయణ రెడ్డి, శరత్‌, జడ్పీ చైర్మన్లు దాదాన్నగారి విఠల్‌రా వు, దఫేదార్‌ శోభ, ఎమ్మెల్యేలు సురేందర్‌, హన్మంత్‌షిండే, ఎంపీ బీబీ పాటిల్‌ ఇతర అధికారులతో కలిసి వేర్వేరుగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రధాన శాఖల్లో అనుసంధానం ఏ విధంగా చేసుకోవాలో మంత్రి వేముల వివరించారు. హరితహారం టార్గెట్లు పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్ణయించినట్లు వెల్లడించిన మంత్రి.. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. 

ట్రాక్టర్‌, ట్యాంకర్‌ ఏ రాష్ట్రంలోనూ లేదు.. 

ఊరూరికీ ట్రాక్టర్‌, ట్యాంకర్‌, శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డులు, నర్సరీలు ఏ రాష్ట్రంలోనూ లేవని మంత్రి చెప్పా రు. మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం దేశానికే ఆదర్శం గా నిలుస్తున్నదన్నారు. జీపీలు శుభ్రంగా ఉండేందుకు ప్రత్యేకంగా శానిటేషన్‌ ప్లాన్‌ చేసుకోవాలని డీపీవోలను ఆదేశించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 80 లక్షలు, కామారెడ్డి జిల్లా లో 66 లక్షల మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. ప్రహరీల్లాగా గ్రీన్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని, కచ్చకాయ వంటి మొక్కలు పెంచాలన్నారు. 

‘ఉపాధి’లో మూస పద్ధతికి ఫుల్‌స్టాప్‌.. 

ఉపాధి హామీ పథకం పనుల్లో మూస పద్ధతికి ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. హరితహారంలో గుంత తీయడం, మొక్క నాటడం, ఫెన్సింగ్‌, నీళ్లు పోయడం తదిత ర పనులు చేసుకోవచ్చన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో రూ.140 కోట్లు హరితహారం పథకానికి ఖర్చు చేసే క్రమంలో రూ.120 కోట్లు ఉపాధి హామీ పథకం ద్వారానే వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. రూ.15 కోట్లు గ్రామ పంచాయతీలోని 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌ ద్వారా సమీకరించనుండగా, అటవీ శాఖ నుంచి రూ.ఐదు కోట్లు సేకరించనున్నట్లు చెప్పారు. 

నీటిపారుదల శాఖలో.. 

నీటిపారుదల శాఖలో ఫీడర్‌ ఛానల్స్‌, ఇరిగేషన్‌ ఛానల్స్‌లోనూ ఉపాధి కూలీలను వాడుకోవచ్చని మంత్రి తెలిపారు. గొలుసు చెరువుల పూడికతీతకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. కాలువల్లో ఉండే ముళ్ల పొదలను, మట్టిని తీసేయాలని సూచించారు. లక్ష్మి కెనాల్‌, గుత్ప, అలీ సాగర్‌ కెనాల్స్‌ను బాగు చేయడానికి రూ.10కోట్లు అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఆర్‌అండ్‌బీ శాఖలోనూ రోడ్డుకు ఇరువైపులా చెత్తా చెదారాన్ని తొలగించడం, ముళ్ల పొదలను నిర్మూలించడానికి ఉపాధి కూలీలను వినియోగించుకోవాలన్నారు. 

మిడతలపై యుద్ధమే.. 

మిడతల దండు ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాకు 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్‌ వద్ద ఉన్నదని తెలిపారు. మిడతలపై దండయాత్ర చేసేందుకు ఐదు ఫైర్‌ఇంజిన్లు, ఐదు జెట్‌స్ప్రేలు, స్థానికంగా ట్రాక్టర్లు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రంగు నీళ్లతో త్వరలో మాక్‌ డ్రిల్‌ చేయించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. సోయా విత్తనాల ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తమదేనని మంత్రి హామీ ఇచ్చారు. 

జాబ్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి.. 

ఉపాధి పనులు చేయాలనుకునే వారు సోమవారం నుంచి జాబ్‌కార్డుల కోసం స్థానిక ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు. వారం రోజుల పాటు ఈ డ్రైవ్‌ కొనసాగుతుందన్నారు. రైతులను సంఘటితం చేయడం కోసం నిజామాబాద్‌ జిల్లా లో 106 రైతువేదికలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నాలుగు నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేయాలని, దాతలను ఆహ్వానించాలని సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబోసే పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం గ్రామాల్లో కల్లాలను నిర్మించుకునేందుకు ప్రోత్సహిస్తున్నదని, వీటి కోసం రైతులు స్థానిక ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎరువుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.