గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jun 18, 2020 , 01:11:30

ఆహ్లాదం.. ఆరోగ్యం

ఆహ్లాదం.. ఆరోగ్యం

lహరితవర్ణ శోభితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

lపచ్చదనాన్ని పంచుతున్న హన్మాజీపేట్‌ దవాఖాన

lవిరివిగా కాస్తున్న పండ్లు

lరాష్ట్రస్థాయిలో హరితమిత్ర అవార్డు కైవసం

బాన్సువాడ రూరల్‌ : బాన్సువాడ డివిజన్‌ కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ దవాఖానకు వెళ్లగానే రోగులకు ముందుగా దర్శనమిచ్చేవి పచ్చని చెట్లు.. వాటి కింద కూర్చోవడానికి ఏర్పాటు చేసిన సిమెంట్‌ బల్లలు.. ప్రాంగణంలో ఏపుగా పెరిగిన పూలు, పండ్ల మొక్కలు.. ఇలా ఎటు చూసినా పచ్చదనంతో కనువిందు చేస్తుంది. రెండు వేల మొక్కలను నాటగా, ప్రస్తుతం అవి వృక్షాలు అయ్యాయి. హరితహారం పథకాన్ని విజయంతంగా అమలు చేసి రాష్ట్రస్థాయిలో హరితమిత్ర పురస్కారాన్ని సైతం కైవసం చేసుకున్నది. రివార్డు కింద అందజేసిన రూ.2 లక్షలతో దవాఖానలో మౌలిక సదుపాయాలు కల్పించారు. 

మొదటి విడుత నుంచే మొక్కల పెంపకం..

రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్‌లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అప్పటి సర్పంచ్‌ సంగ్రాం నాయక్‌, వైద్యుడు రతన్‌సింగ్‌ దవాఖానలో మొక్కల పెంపకంపై దృష్టి సారించారు. మూడు విడుతల్లో పలు రకాల మొక్కలు నాటారు. ప్రస్తుత సర్పంచ్‌ బోనాల సుభాష్‌, దవాఖాన వైద్యురాలు విజయమహాలక్ష్మి మొక్కల సంరక్షణకు కృషి చేస్తున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంతో 2017 జూన్‌లో రాష్ట్రస్థాయిలో హరితమిత్ర పురస్కారం వరించింది.

రెండు వేలకు పైగా మొక్కలు..

హరితహారం మూడు విడుతల్లోనూ నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 1500 టేకు మొక్కలతోపాటు, నీడనిచ్చే మరో 500 మొక్కలు నాటారు. నిమ్మ, దానిమ్మ, జామ, సపోట, బత్తాయిలాంటి పండ్ల మొక్కలను సైతం నాటారు. ప్రస్తుతం వాటికి పండ్లు కాస్తున్నాయి. వాటి చుట్టూ ఇనుప వైర్లతో ఫెన్సింగ్‌ వేసి గేటును ఏర్పాటు చేశారు.