మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Jun 15, 2020 , 02:21:34

జిల్లాలో రోజురోజుకూ వెలుగు చూస్తున్న కేసులు

 జిల్లాలో రోజురోజుకూ వెలుగు చూస్తున్న కేసులు

ఉమ్మడి జిల్లాలో తాజాగా నాలుగు.. 

కామారెడ్డిలో రెండు, మోర్తాడ్‌లో ఒకటి..

రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ‘పాజిటివ్‌' !

చికిత్స కోసం  హైదరాబాద్‌కు.. 

హోంక్వారంటైన్‌లోకి  కుటుంబ సభ్యులు 

కరోనా మళ్లీ కలకలం రేపుతున్నది. మార్చి నెలాఖరు నుంచి ఉమ్మడి జిల్లాలో పెరుగుతూ వచ్చిన కేసులు మే మొదటి వారంలో తగ్గుముఖం పట్టాయి. కేసుల సంఖ్య జీరోకు  రావడంతో రెడ్‌జోన్‌లో ఉన్న జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి మారాయి. దీంతో అధికారులు, ప్రజలు  ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా మళ్లీ కొవిడ్‌-19 కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆదివారం పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు, అనుచరులు, నాయకులు హోంక్వారంటైన్‌లో ఉండిపోయారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయరక్షణ చర్యలు పాటించాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచిస్తున్నా పెడచెవిన పెడుతుండడం కేసులు నమోదు కావడానికి కారణం అవుతున్నది. 

బాన్సువాడ రూరల్‌ / ఖలీల్‌వాడి :  ఉమ్మడి జిల్లాలో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజులుగా కరోనా కేసులు నమోదు కావడం కలవరానికి గురి చేస్తున్నది. ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో కామారెడ్డి జిల్లాలో రెండు కేసులు నమోదు కావడం, బాన్సువాడ మండలంలో ఒక వ్యక్తికి కరోనా సోకిందనే ప్రచారం జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు మోర్తాడ్‌ మండలానికి చెందిన వ్యక్తి కరోనా బారిన పడడం ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. కరోనా వైరస్‌పై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నప్పటికీ తగ్గినట్టే తగ్గి  తిరిగి కేసులు నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది. 

ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, గుంపులు, గుంపులుగా తిరుగుతుండడమే కేసుల నమోదుకు కారణంగా తెలుస్తోంది. పెరుగుతున్న కేసులను బట్టి ప్రజలు అప్రమత్తత పాటించకపోతే మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి, కరోనా వైరస్‌ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

నిజామాబాద్‌లో 79కి చేరిన కేసులు

నిజామాబాద్‌ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నెల క్రితం 61 కేసులు నమోదుకాగా వీరందరికీ గాంధీ దవాఖానలో చికిత్స అందించారు. 61మంది పూర్తిగా కోలుకొని ఇండ్లకు చేరారు. రెడ్‌జోన్‌లో ఉన్న ఇందూరు గ్రీన్‌జోన్‌గా మారింది. వారం రోజులుగా మళ్లీ పాజిటివ్‌ కేసులు వెలుగు చూడడం కలకలం రేపుతున్నది. ఆదివారం తాజాగా రెండు కేసులు నమోదు కాగా జిల్లాలో కేసుల సంఖ్య 79కి చేరింది.  

మోర్తాడ్‌లో 15 మంది హోంక్వారంటైన్‌

మోర్తాడ్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో  చికిత్స పొందుతున్నాడు. ఇతనితో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన 15మందిని క్వారంటైన్‌లో ఉం చామని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రతన్‌సింగ్‌ తెలిపారు. ఇతనితో కాంటాక్ట్‌ అయిన వారెవరైనా ఉంటే స్వయంగా పేరు నమో దు చేసుకుని క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మోర్తాడ్‌లో కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామంలో కలకలం నెలకొంది. 

మోర్తాడ్‌లో ఎప్పుడు ఎవరికి కరోనా లక్షణాలు కనిపిస్తాయో తెలియని పరిస్థితులు నెలకొనడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వ్యాపార సంస్థలను మూసివేయించారు.

కామారెడ్డిలో ఆందోళన..

విద్యానగర్‌: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇటీవల ఓ కిరాణ వ్యాపారితో పాటు ఆయన కుమారుడికి  కరోనా పాజిటివ్‌ వచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం ప్రైమరీ కాంటాక్ట్స్‌ కింద 16 మంది శాంపిళ్లను హైదరాబాద్‌కు పంపించగా ఆదివారం వచ్చిన రిపోర్టులో వ్యాపారి కోడలు, వర్కర్‌కు  కరోనా పాజిటివ్‌ రాగా 14 మందికి నెగిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు.ఆ వ్యాపారి ద్వారా ఇంకా ఎవరికైనా సోకిందేమోనన్న  కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. 

రెండు కేసులు రావడంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. ముందస్తు చర్యల్లో భాగంగా కిరాణా వర్తక సంఘం అసోసియేషన్‌ వారు మరో రెండు రోజు లు దుకాణాలు బంద్‌ పాటిస్తున్నట్లు ప్రకటించారు.  


డిచ్‌పల్లి: రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితమే బాజిరెడ్డి గోవర్ధన్‌ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని హైదరాబాద్‌లో కలిసి కొద్దిసేపు మాట్లాడారు. శనివారం ఉదయం డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌ తండాలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభించేందుకు వచ్చిన బాజిరెడ్డి కార్యక్రమం ముగిసిన తర్వాత నిజామాబాద్‌కు వెళ్లారు. సాయంత్రం వైద్యపరీక్షల కోసం దవాఖానకు వెళ్లగా ఆదివారం ఉదయం కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన ఆదివారం సాయంత్రం స్వయంగా వాహనాన్ని  డ్రైవింగ్‌ చేసుకుంటూ హైదరాబాద్‌కు వెళ్లారు. బాజిరెడ్డి గోవర్ధన్‌ కుటుంబ సభ్యులు అందరూ హోం క్వారంటైన్‌లో ఉండిపోయారు. 


logo