బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Jun 14, 2020 , 01:54:10

‘డబుల్‌'నిర్మాణాల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి

‘డబుల్‌'నిర్మాణాల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి

  • l నిర్మాణంలో ఉన్న ఇండ్ల పనులను     వేగవంతం చేయాలి 
  • l అర్హుల జాబితా పారదర్శకంగా ఉండాలి 
  • l అధికారులతో సమీక్షలో మంత్రి వేముల 

వేల్పూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని రాష్ట్ర హౌసింగ్‌, రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. వేల్పూర్‌లోని మంత్రి నివాసంలో నియోజకవర్గంలోని రెవెన్యూ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలకు సొంతిల్లు ఉండాలని, వారు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్‌ రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. వీటి నిర్మాణం కోసం ప్రభుత్వ భూములు ఉంటే వాటి వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. వివాదాల్లో ఏమైనా భూములు ఉంటే న్యాయస్థానాలకు వెళ్లి వాటిని తిరిగి పొందేలా చూడాలని ఆదేశించారు. ఇంటి స్థలాలు, ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించాలని సూచించారు. అర్హుల జాబితా పారదర్శకంగా ఉండాలని, లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని చెప్పారు. సెగ్మెంట్‌లోని వేల్పూర్‌, మోర్తాడ్‌, బాల్కొండ, పడగల్‌ గ్రామాల్లో చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. భీమ్‌గల్‌, బడా భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, మెండోరాలో పనులను వెంటనే ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్లు అర్చన, బావయ్య, సతీశ్‌రెడ్డి, జనార్దన్‌, సురేశ్‌, రాజేందర్‌, నామ్‌దేవ్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 

భీమ్‌గల్‌ బల్దియా బడ్జెట్‌పై కసరత్తు.. 

భీమ్‌గల్‌ మున్సిపాలిటీ బడ్జెట్‌పై మంత్రి వేముల బల్దియా చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ, కమిషనర్‌ గోపు గంగాధర్‌తో సమీక్ష నిర్వహించారు. భీమ్‌గల్‌ బల్దియాకు రూ.ఐదు కోట్ల వార్షిక ఆదాయం వస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు అవసరమయ్యే పనులకు నిధులు ఏ విధంగా కేటాయించాలనే విషయాలను మంత్రి వారికి సూచించారు. నూతనంగా ఏర్పాటైన బల్దియాలో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని.. పన్ను వసూళ్లలో అందరికీ ఆదర్శంగా నిలువాలని అన్నారు. 


logo