ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Jun 14, 2020 , 01:42:25

పల్లెటూర్లో సాఫ్ట్‌ వేర్లు

పల్లెటూర్లో సాఫ్ట్‌ వేర్లు

  • lకరోనాతో మారిన గ్రామాలకు టెకీల కళ
  • lవర్క్‌ ఫ్రం హోంతో  ఇంటి నుంచే ఆఫీసు పని
  • lపల్లె వాతావరణంలో ఆహ్లాదంగా..
  •  lవిదేశీ క్లయింట్లతో వీడియో కాలింగ్‌లు, చాటింగ్‌లు, చర్చలు
  • lసిగ్నల్‌ లేక అక్కడక్కడా ఇబ్బందులు
  • ఉదయం లేచింది మొదలు ఆదరబాదరాగా రెడీ అయ్యి.. బస్‌ స్టాప్‌కు చేరుకొని బస్సు ఎక్కితే.. కాలుదూర సందులేని 

బస్సులో గంట, రెండు గంటలు ప్రయాస పడి ప్రయాణిస్తే అప్పుడొస్తుంది ఆఫీసు.. మెట్లు ఎక్కుతూనే నిన్న ఇచ్చిన అసైన్‌మెంట్‌ ఏంటి.. ఈ రోజైనా పూర్తవుతుందా అని హడావుడిగా కంప్యూటర్‌ ఆన్‌ చేయడం.. అంతలోనే ‘మిమ్మల్ని బాస్‌ పిలుస్తున్నారు..’ అని ఆఫీస్‌ బాయ్‌ కబురు మోసుకు రావడం.. బాస్‌ క్యాబిన్‌కు వెళ్లి నాలుగు చివాట్లు తిని బయటకు వస్తూ.. ‘ఇదేం జీవితంరా బాబు..’ అంటూ నీరసపడిపోతూనే చైర్లో కూలబడిపోవడం.. టెన్షన్‌తో జుట్టు పీక్కుంటూ ఏదోలా పని ముగించేసి మళ్లీ ఇంటికి చేరుకునే సరికి ఏ అర్ధరాత్రో అపరాత్రో అవుతుంది. ఇదీ మహానగరాల్లోని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పరిస్థితి. కానీ లాక్‌డౌన్‌ కారణంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. అన్ని సంస్థలూ ఉద్యోగులతో వర్క్‌ఫ్రమ్‌ హోం చేయించుకుంటున్నాయి. దీంతో ఎప్పుడూ ఉరుకులు పరుగుల జీవితంతో బిజీగా ఉండే టెకీలు ప్రస్తుతం సొంత ఊళ్లో ఇంటి వద్ద నుంచే ఆఫీసు పనులు చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో వ్యవసాయ పనులకు వెళ్లడం.. కుటుంబంతో సరదాగా గడుపుతూ.. కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా కారణంగా అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌తో ఐటీ నగరాలు బోసిపోతున్నాయి. వైరస్‌ విస్తృతి పెరుగుతుండడంతో ఐటీ సంస్థలన్నీ తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అప్పగించాయి. ప్రతి ఒక్కరూ సంస్థ అందించిన ల్యాప్‌టాప్‌ ద్వారా తాము నివసిస్తున్న ప్రాంతాల్లో ఉంటూనే పనులు చేసుకునే వెసులుబాటు కల్పించాయి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, యాక్సెంచర్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఐబీఎం, ఏబీపీ, డెల్‌, ఓరాకిల్‌, డెలాయిట్‌, హెచ్‌సీఎల్‌తో పాటు అనేక ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలకు తాళాలు వేసేశాయి. ఉద్యోగులెవ్వరూ ఆఫీసు మెట్లు ఎక్కకుండానే తమ విధులను ఇంటి నుంచే చేసుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్‌, పుణె, బెంగళూర్‌, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల నుంచి అనేక మంది టెక్కీలు తమ సొంతూళ్లకు వచ్చేశారు. లాక్‌డౌన్‌ ప్రారంభ సమయంలోనే కుటుంబంతో కలిసి పల్లెలకు చేరుకుని తమకిచ్చిన ప్రాజెక్టు పనులు ఎంచక్కా చేసేసుకుంటున్నారు. పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తూనే ఐటీ ప్రొడక్ట్స్‌ను డెవలప్‌ చేస్తున్నారు.

టెకీల సందడి..

సామాన్యంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల వృత్తి అనుక్షణం కత్తిమీద సాములా ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురవుతూ ప్రాజెక్టు వర్క్‌ చేస్తుండడంతో నిత్యం ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఉపశమనం కోసం వారాంతంలో టెకీలు చేసే సందడి అంతా ఇంతా కాదు. రెండు రోజులపాటు కలిసి వచ్చే సెలవు రోజుల్లో ఒత్తిడి నుం చి దూరం అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. రోజూ నాలుగు గోడల మధ్య ల్యాప్‌టాప్‌లపై, డెస్క్‌టాప్‌లపై కోడింగ్‌తో కుస్తీ పట్టే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు కరోనా వైరస్‌ మూలంగా కొంగొత్త అనుభూతి వచ్చింది. ఐటీ ఉద్యోగుల్లో సగానికి ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యం నుంచి మహా నగరాలకు వెళ్లిన వారే ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారంతా లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు చేరుకున్నారు. అందమైన పల్లెల్లో సేదతీరుతూ, హాయిగా ప్రాజెక్టు పనులు చేసుకుంటూ గడుపుతున్నారు. మూడు నెలలుగా సాగుతున్న వర్క్‌ ఫ్రం హోంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒత్తిడి దూరంగా ఉంటూ పని పూర్తి చేసుకుంటున్న అనుభూతి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది. స్వచ్ఛమైన వాతావరణం, హాయిగొల్పే పరిసరాల మధ్య సంతోషంగా తమ పనులు పూర్తి చేస్తున్నారు.

విదేశీ క్లయింట్‌లతో చాటింగ్‌లు

సామాజిక మాధ్యమాలు విస్తృతమయ్యాక వీడియో కాలింగ్‌ సేవలు పెరిగాయి. అయితే పల్లెలకు వచ్చిన టెకీల మూలంగా రాత్రి వేళల్లో వీడియో కాలింగ్‌లు, చాటింగ్‌లు, గ్రూప్‌ డిస్కర్షన్‌లు, చర్చలతో మార్మోగుతున్నాయి. దేశంలో నెలకొల్పబడిన ఐటీ సంస్థలకు విదేశీ క్లయింట్‌లే ఎక్కువగా ఉండడంతో వారితో చర్చోపచర్చలతో పగలు, రాత్రి తేడా లేకుండా టెక్కీలు బిజీగా గడుపుతున్నారు. ప్రాజెక్టు పనితనం, ప్రోగ్రెస్‌ నివేదికలపై జరిగే చర్చలకు పల్లెలు వేదికలుగా మారాయి. విదేశీ ప్రతినిధులతో ఇంగ్లిష్‌లో జరిగే సంభాషణలు కుటుంబీకులను ఆకట్టుకోవడమూ ఇప్పుడు కనిపిస్తోంది.

సకుటుంబ సపరివారంగా...

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే వారు వారంలో ఐదు రోజులు ఇంటోళ్లకు సైతం కనిపించరంటే అతిశయోక్తి కాదు. సిటీల్లోనైతే ఎప్పుడొస్తారో? ఎప్పుడు ఆఫీస్‌కు వెళ్తారో అర్థం కాదు. అలాంటిది కరోనా తెచ్చిన వర్క్‌ ఫ్రం హోం మూలంగా సకుటుంబ సపరివారం ముందే పని పూర్తి చేసుకోవడం, ఇబ్బందికర పరిస్థితిలోనూ కుటుంబంతో గడిపే అవకాశం లభించడం వారికి అనుకూలంగా మారింది. లాక్‌డౌన్‌తో గ్రామాలకు వచ్చిన వారికి నూతనుత్తేజం కలుగుతోంది. అయితే అక్కడక్కడా టెక్కీలకు ఇంటర్నెట్‌ సమస్య తీవ్రంగానే వేధిస్తున్నది. గ్రామాల్లో అంతగా నెట్‌ సౌలభ్యం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెట్‌ వేగాన్ని అందిపుచ్చుకునేందుకు అనేక మంది వ్యవసాయ పొలాలకు, ఇంటి డాబాలపైకి ఎక్కి సిగ్నల్స్‌ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో పలువురు లోకల్‌ డాటా ప్రొవైడర్లు ఇష్టానుసారంగా నెట్‌ చార్జీలను పెంచేశారు.

మాదాపూర్‌ టు మాదాపూర్‌

మాక్లూర్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలంలోని మాదాపూర్‌ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ మాదాపూర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వారు తమ స్వగ్రామం మాదాపూర్‌ నుంచి ‘వర్క్‌ ఫ్రం హోం’లో భాగంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ  కుటుంబసభ్యులతో ఆనందంగా గడుతుపుతున్నారు.  

బీడీ కార్ఖానాలో నాన్నకు చేదోడువాదోడుగా.. 

గతంలో బెంగళూరులో పని చేశాను. సంవత్సర క్రితం హైదరాబాద్‌కు వచ్చా ను.‘వర్క్‌ ఫ్రం హోం’లో భాగంగా మార్చి 23వ తేదీ నుంచి ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నాను. మా నాన్న బీడీ కార్ఖానా నిర్వహిస్తాడు. నేను కూడా వారాంతంలో రెండు రోజులు నాన్నకు బీడీ కార్ఖానాలో, వ్యవసాయ పనుల్లో  సహాయ పడుతున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం జీవితంలో మరిచిపోలేని రోజులుగా మిగిలిపోతాయి.-సామల సుమన్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, జెన్‌పాక్ట్‌ కంపెనీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌ (మాక్లూర్‌)

కుటుంబం, స్నేహితుల మధ్య ఆనందంగా..

బీబీపేట్‌ : కరోనా కారణంగా ఆఫీసు వారు ఇంటి వద్దే ఉండి పని చేయాలని సూచిస్తున్నారు. గతంలో క్షణం తీరిక లేకుండా రోజు గడిచిపోయేది. ఇప్పుడు ఖాళీ సమయం దొరుకుతున్నది. తీరిక వేళల్లో కుటుంబం, స్నేహితులతో గడుపుతున్నా. రొటీన్‌కు భిన్నంగా రోజులు గడిచిపోతున్నాయి. ఆఫీసు వారు ఇచ్చిన అసైన్‌మెంట్‌ పూర్తి చేసి, పొలం పనులకు వెళ్తున్నా. కుటుంబం, స్నేహితుల మధ్య ఉండడం ఆనందంగా ఉంది. మూణ్నెళ్లుగా ఇంటి వద్దే ఉండి పని చేస్తున్నా. ప్రశాంత వాతావరణంలో పని చేసుకుంటున్నా. -సంతోష్‌రెడ్డి, సీనియర్‌ ఇంజినీర్‌, కాగ్నిజంట్‌, హైదరాబాద్‌ (యాడారం, బీబీపేట మండలం)

ప్రశాంతంగా పని చేసుకుంటున్నా..

ధర్పల్లి: కొవిడ్‌-19 కారణంగా ఆఫీస్‌కు వెళ్లి పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆఫీస్‌ ఆదేశాల మేరకు వారు ఇచ్చిన అసైన్‌మెంట్‌ను ఇంటి నుంచే పూర్తి చేస్తున్నా. ఏడాదిన్నర కాలంగా బెంగళూరులో సీనియర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. ఊళ్లోనే ఉంటూ పొలం పనులు చూసుకుంటున్నా. ఆహ్లాదకర వాతావరణంలో ల్యాప్‌టాప్‌ ద్వారా కంపెనీ పనులు చేస్తున్నా. ఇంటి వద్దే ఉంటుండడంతో మా అమ్మానాన్న ఎంతో సంతోషపడుతున్నారు. కరోనా కారణంగా ఆఫీసుకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేదు. ఇంటి నుంచే ఆఫీస్‌ పనులు నిర్వహించి జీతం తీసుకోవడం ఆనందంగా ఉంది.-బానావత్‌ వినోద్‌కుమార్‌, సీనియర్‌ ఇంజినీర్‌, మీడియాటెక్‌, బెంగళూరు (భగవాండ్ల తండా, ధర్పల్లి మండలం)

హాయిగా పని చేసుకుంటున్నా..

కోటగిరి : కరోనా నేపథ్యంలో ఆఫీసులు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయాలని సూచిస్తున్నాయి. మా ఊళ్లోని ఉంటూ హాయిగా పని చేసుకుంటున్నా. ఇతర ప్రైవేటు ఉద్యోగులు ఆఫీసులు బంద్‌ ఉండడంతో పనులు లేక ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నా మేము మాత్రం ల్యాప్‌ టాప్‌ ద్వారా యథావిధిగా విధులు నిర్వహిస్తున్నాం. ఇంటి వద్దే ఉంటూ కుటుంబాన్ని చూసుకోవడం, అటు ఆఫీసు విధులు నిర్వహించడం కొత్తగా ఉంది. మూడు నెలలుగా గ్రామంలోనే ఉంటున్నా.-నీరడి మధుకర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, నోచూర్‌, మాదాపూర్‌, హైదరాబాద్‌ (ఎక్లాస్‌పూర్‌ గ్రామం, కోటగిరి మండలం)

ఉరుకులు పరుగుల జీవితం నుంచి..

 ఉరుకులు పరుగుల జీవితం నుంచి ప్రశాంత వాతావరణంలోకి మారడం ఆనందంగా ఉంది. తెల్లవారు నిద్రలేచింది మొదలు ఆఫీసుకు వెళ్లే వరకు హడావుడే ఉంటుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మా కంపెనీ ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశించింది. దీంతో ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నాం. ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటూనే విధులు నిర్వహించడం ఆనందంగా ఉంది. - సుప్రియ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, విప్రో, హైదరాబాద్‌ (నిజామాబాద్‌)logo