శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Jun 11, 2020 , 02:37:52

నకిలీకి చెక్‌ పెట్టండిలా.

నకిలీకి చెక్‌ పెట్టండిలా.

lనాణ్యమైన విత్తనాలు, పురుగుమందులనే కొనాలి

lవిత్తనశుద్ధి తప్పని సరి చేయాలి

lవానకాలం సీజన్‌లో రైతులకు వ్యవసాయాధికారుల సూచన

నందిపేట్‌ రూరల్‌ : రైతులు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. వాతావరణం అనుకూలిస్తుందన్న ధీమాతో రైతులు సాగుపనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పంటలు వేసే ముందు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నకిలీల బెడద ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే పంట నష్టపోయే ప్రమాదం ఉంది. మోతాదుకు మించి ఎరువుల వాడకంతో దిగుబడి కన్నా నష్టమే అధికం. పురుగుమందుల విషయంలోనూ అవసరానికి తగ్గట్టుగానే పిచికారీ చేయాలని వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. 

విత్తన కొనుగోలులో జాగ్రత్తలు

lవ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్‌ పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి.

lసరిగ్గా సీలు వేసి ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాల బస్తాలనే కొనుగోలు చేయాలి.

lలూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి కొనుగోలు చేయకూడదు. గడువు దాటిన విత్తనాల జోలికి వెళ్లొద్దు.

lబస్తాపై విత్తన రకం, లాట్‌ నెంబర్‌, గడువు తేదీ వంటి విషయాలను గమనించి కొనుగోలు చేయాలి. బిల్లుపై డీలర్ల సంతకం తీసుకోవాలి. బిల్లుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకం నెంబర్‌, రైతు పేరు, గ్రామం పేరు, విక్రయదారుడి సంతకం, తేదీలు, నిఖర తూకం, గడువు తేదీలు, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి.

lహైబ్రిడ్‌ విత్తనాలు కొనేటప్పుడు రకం, స్వచ్ఛత, మొలకశాతం పరిగణలోకి తీసుకోవాలి.

lమొలకెత్తే దశలో, పూత దశలో లోపాలు కనిపిస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి.

lఅరువు పద్ధతిలో కొనుగోలు చేసినా బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తనాలు తీసుకున్న తరువాత వెంటనే మొలక శాతాన్ని తీసుకోవాలి. మొలక శాతం సక్రమంగా ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలి

పురుగుమందుల కొనుగోలులో.. 

lవ్యవసాయ, ఉద్యాన, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం లైసెన్సుడ్‌ దుకాణాల్లోనే క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయాలి. నిల్వ ఉన్న మందులను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దు.

lడబ్బాపై వజ్రాకారంలో పురుగుమందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం, స్వల్ప విష పూరితమైతే ఆకుపచ్చరంగు గుర్తులు ఉంటాయి. 

lమందు పేరు, రూపం, శాతం, పరిమాణం, జాగ్రత్తలు, విరుగుడు, తయారు చేసిన సంస్థ పేరు, గడువు తేదీ వివరాలను పరిశీలించాలి. సీలు సక్రమంగా లేని మందులను కొనుగోలు చేయొద్దు. లేబుల్‌ లేని మందు సీసాలు, డబ్బాలు, ప్యాకెట్లను కొనుగోలు చేయొద్దు.

lపురుగు మందులు రెండు, మూడు రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలను ధ్వసం చేసి గుంతల్లో పాతి పెట్టాలి.

ఎరువుల కొనుగోలు..   

lలైసెన్సులు కలిగిన దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి. వాటి బిల్లులు, ఖాళీ సంచులు పంట కాలం పూర్తయ్యే వరకు దాచుకోవాలి.

lమిషన్‌ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులనే వాడాలి. ఒక వేళ చేతి కుట్టు ఉంటే సీసం సీలు ఉందో లేదో చూసుకోవాలి.

lపోషకాల వివరాలు, ఉత్పత్తి చేసిన సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు కచ్చితంగా ఉండాలి.

lకొనుగోలు సమయంలో డీలర్‌ రసీదులో రైతు తప్పనిసరిగా సంతకం చేయాలి. 

lచిల్లుపడిన, చిరిగిన బస్తాలోని ఎరువులను కొనుగోలు చేయొద్దు. గడ్డకట్టిన ఎరువుల్లో నాణ్యత లోపిస్తుంది. వాటిని కొనుగోలు చేయొద్దు.

lగుళికల పరిమాణం, ఆకారంలో తేడా ఉంటే కల్తీ ఎరువుగా గుర్తించవచ్చు. 

వ్యవసాయాధికారులను సంప్రదించాలి

వానకాలం సీజన్‌లో పం టలు వేసే ముందు సలహాలు, సందేహాల కోసం రైతులు సమీపంలోని వ్యవసాయాధికారులను తప్పకుండా సంప్రదించాలి. ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని, రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. నకిలీ విత్తనాలు అంటగట్టాలని చూస్తే వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలి. 

-గుమ్ముల సాయికృష్ణ, మండల, వ్యవసాయాధికారి, నందిపేట్‌