బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Jun 11, 2020 , 02:37:54

మందకు దన్ను.. చేనుకు చేవ

మందకు దన్ను.. చేనుకు చేవ

lగోవులతో గిరిజనుల వలస

lపంట పొలాల్లో ఆవాసం

lరోజుల తరబడి అక్కడే జీవనం

గోవులే వారి ప్రాణం.. అవే వారి జీవనాధారం.. వాటిని రక్షించుకుంటూ..  ఆదాయాన్ని పొందుతున్నారు జుక్కల్‌ మండల గిరిజనులు. దీపావళి పండుగ కాగానే ఇండ్లకు తాళాలు వేసి పిల్లా పాపలతో వలసబాట పడతారు. పొలాలు సారవంతం అయ్యేందుకు రైతులు ఆవుల మందులకు ఆశ్రయమిస్తారు. గిరిజనులు పొలాల్లో ఆవుల మందను ఉంచుతారు. వాటితోపాటు వారూ అక్కడే గుడారాలు వేసుకొని ఉంటారు. ఇలా రోజుల తరబడి వలస జీవనం సాగిస్తారు. వర్షాలు ప్రారంభం కాగానే తిరిగి తమ ఇండ్లకు చేరుకుంటారు.

బీర్కూర్‌ : గోమాతను కన్నతల్లిలా చూస్తారు ఆ గిరిజనులు. వాటిని బతికించుకునేందుకు ఊళ్లకు ఊళ్లు దాటి వెళ్తారు. ప్రతి ఏడు దీపావళి కాగానే కుటుంబంతో కలిసి వలసబాట పడతారు. ఎవరైనా రైతులు ఆవుల మందులను తమ పొలాల్లో ఉంచేందుకు అనుమతిస్తే అక్కడికి వెళ్తారు. ఆవులను పొలాల్లో కూర్చోబెట్టి రోజుకు రూ.500 తీసుకుంటారు. ఆవుల ద్వారా వచ్చే పాలను అమ్ముకుంటూ అక్కడే జీవనం సాగిస్తారు. పాలతోపాటు పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముతారు. జుక్కల్‌ మండలం నుంచి గోవులను తీసుకొని గిరిజనులు బీర్కూర్‌ మండలంతోపాటు ఇతర మండలాలకు వలస వస్తుంటారు. జుక్కల్‌ మండలం పోచారం తండాకు చెందిన కాశీరాం నాయక్‌తోపాటు మరో నలుగురు 450 గోవులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీపావళి పండుగ కావడమే ఆలస్యం తమ గోవులకు గుట్టల్లో మేత లేక, తాగేందుకు నీరు లేక వలస వస్తుంటారు. వర్షాలు ప్రారంభం కాగానే తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోతారు.

పంటకు ఎరువు..

ఆవుల మందను పంట పొలాల్లో ఉంచడం ద్వారా సేంద్రియ ఎరువు లభిస్తుంది. గోవుల మూత్రం, పేడ భూమిని సారవంతం చేస్తుంది. రసాయనిక ఎరువులు వాడి భూములు సౌడుగా మారితే ఆవుల మూత్రం, పేడతో ఆ భూమి మళ్లీ సారవంతమై పంటలకు మేలు చేస్తుంది. 


logo