గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jun 10, 2020 , 04:07:35

కోట్ల పంట!

కోట్ల పంట!

ధాన్యం @ రూ.1569 కోట్లు 

ఇదీ ఉమ్మడి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల విలువ 

ఆపత్కాలంలో అన్నదాతలకు అండగా నిలిచిన తెలంగాణ సర్కారు

లక్షా 59 వేల మంది రైతులకు లబ్ధి ప్రణాళికాబద్ధంగా  యంత్రాంగం..

 సమన్వయం చేసిన మంత్రి   

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ధాన్యం సేకరణ వందశాతం పూర్తయ్యింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలోనే పంట చేతికి రావడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ధాన్యం సేకరణకు అన్ని చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలిచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 672 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించారు. ధాన్యం తరలింపులో రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ కార్గో బస్సులను సైతం వినియోగించుకున్నారు. ధాన్యం సేకరించిన వారంరోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నిత్యం అధికారులను సమన్వయం చేయడంతో విపత్కర పరిస్థితుల్లోనూ ధాన్యం సేకరణ సజావుగా సాగింది.  

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయం.. దేశమంతా లాక్‌డౌన్‌ విధించిన విపత్కర కాలం. ఏ ఒక్కరూ బయట అడుగు పెట్టలేని పరిస్థితి.. మరోవైపు రైతులు పండించిన పంట చేతికి వచ్చింది.. ఆరుగాలం కష్టపడిన రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వేళ... సీఎం కేసీఆర్‌ కర్షకుల మేలుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కాలంలోనూ అన్నదాతల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నారు. పంట దిగుబడులను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూనే పంట ఉత్పత్తులను సేకరించాలని ఆదేశాలు ఇచ్చారు. మాస్కులు వాడకం, భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం వంటి చర్యలతో గ్రామాలకే కొనుగోలు కేంద్రాలు చేరేలా ఉపక్రమించారు. సీఎం ఆదేశాలతో వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార శాఖల అధికారులు సమన్వయంతో  ఏర్పాట్లు చేశారు. యావత్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా లాక్‌డౌన్‌ వంటి సమయంలోనూ సజావుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మరోమారు రైతు అనుకూల సర్కారుగా సీఎం కేసీఆర్‌ నిలిచారు.

ప్రణాళికాబద్ధంగా...

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రణాళికబద్ధంగా నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగం ముందుకు సాగింది. నిజామాబాద్‌ జిల్లాలో 576 గ్రామ పంచాయతీలుండగా ధాన్యం పండించిన ప్రతి పంచాయతీలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 354 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం సేకరించారు. కామారెడ్డి జిల్లాలో  526 గ్రామ పంచాయతీలకు గాను సమీప పంచాయతీలను కలుపుకుని 318 కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చా రు. లక్షల ఎకరాల్లో వరి సాగు కావడంతో దిగుబడి అంచనాలు ఈసారి భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగానే రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అప్రమత్తం అయ్యారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ తగు ఏర్పాట్లు చేశారు.  

కొనుగోళ్లలో మెరిసిన ఉభయ జిల్లాలు...

సీఎం కేసీఆర్‌ అందిస్తున్న ప్రోత్సాహంతో ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్‌లో రైతులు తమకున్న గుంట భూ మిని కూడా సాగు చేశారు. దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉండడం.. పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర కలిసి రావడం, కొనుగోలు కేంద్రాలూ విస్తారంగా ఏర్పాటు చేయడంతో అన్నదాతలకు వ్యవసాయం పండుగలా తలపించింది.  యాసంగి కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించారు. మొత్తం 672 కొనుగోలు కేంద్రాల్లో 8లక్షల 56వేల 513 మెట్రిక్‌ ట న్నుల ధాన్యాన్ని సేకరించారు.ఇందుకోసం రూ. 1,569 కోట్లు వెచ్చించారు. 1,59,696 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు.

కరోనా కాలంలోనూ...

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ సారి హమాలీల కొరత తీవ్రంగా ఎదురైంది. సుమారుగా 10వేల మంది హమాలీలు అవసరం ఉంటే రెండు జిల్లాల్లో సగానికి తక్కువ మందే పనులకు వచ్చా రు. ప్రతి సీజన్‌లో బీహార్‌ నుంచి వచ్చే వారు ఈసారి రాకపోవడంతో కొంత ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ హమాలీల కోసం తీవ్రంగా శ్రమించిన కలెక్టర్లు స్థానికంగానే కూలీలను సమకూర్చుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోతల సమయంలోనూ వేయికి పైగా వరికోత యంత్రాలను సమకూర్చడంలో అధికారులు సఫలమయ్యారు. గ్రామాల వారీగా రైతుల సంఖ్య, సాగైన విస్తీర్ణం లెక్కలు తీశారు. లాటరీ పద్ధతిలో టోకెన్లు తీసి ఏ రోజు ఏ రైతు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తేవాలో ఎంపిక చేసి ప్రక్రియను సజావుగా ముందుకు సాగేలా చూశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదేరోజు మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందుకు అవసరమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.   కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే ధాన్యాన్ని సేకరించారు.logo