గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jun 10, 2020 , 03:41:23

అడ్డా పైకి.. కూలీ

అడ్డా పైకి.. కూలీ

lరెండున్నర నెలల తరువాత రోడ్లపైకి..

lపనులు కల్పిస్తున్న మేస్త్రీలు, ఇండ్ల యజమానులు

lలాక్‌డౌన్‌లో ఆదుకున్న ఉచిత రేషన్‌ బియ్యం

ఇందూరు : వారంతా అడ్డా కూలీలు..ఎవరైనా పని ఇస్తేనే పూటగడిచేది. ప్రతిరోజూ వారు సద్దికట్టుకొని అడ్డామీదకు వచ్చి నిల్చుండడం, ఎవరైనా వచ్చి పని కోసం తీసుకెళ్లితేనే వారి గొంతులో ముద్దదిగే పరిస్థితి. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో అడ్డాకూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రెండున్నర నెలల కాలంలో పనులు లేక ఇంట్లోనే ఉండగా, ప్రభుత్వం అందించిన ఉచిత రేషన్‌ బియ్యం, రూ.15వందలు వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచాయి. ప్రస్తుతం ప్రభుత్వం లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో వారికి ఎట్టకేలకు పనిదొరికినట్లయ్యింది. అడ్డాల వద్ద ఉన్న కూలీలను చిన్న చిన్న పనుల నిమిత్తం మేస్త్రీలు, ఇతర ఇంటి పనుల కోసం తీసుకువెళ్తున్నారు. పెయింటింగ్‌, ప్లంబర్‌, వడ్రంగి, తోటపని, ఇంటి పని, మేస్త్రీలు, హమాలీ ఇతర పనుల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ పనులు దొరకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మాస్క్‌ ధరించడం, భౌతిక దూరంపై అవగాహన కరువు.. 

పని కోసం రోడ్డు మీదికి వచ్చిన కూలీలందరూ ఒకే దగ్గర గుమిగూడుతుండడం ఆందోళన కలిగించే అంశం. భౌతిక దూరం మాట దేవు డెరుగు.. పని దొరికితే చాలు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. అధికారులు చొరవ చూపి అడ్డా కూలీలకు కరోనాపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.