మంగళవారం 27 అక్టోబర్ 2020
Nizamabad - Jun 09, 2020 , 02:39:27

వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

నమస్తే తెలంగాణ యంత్రాంగం : సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీ చైర్మర్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మాక్లూర్‌లో కొనసాగు తున్న పారిశుద్ధ్య పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామంలోని నర్సరీలను పరిశీ లించి ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వాటర్‌ ట్యాంకులు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌, కార్యదర్శి, పంచాయతీ సిబ్బందికి  డీపీవో జయసుధ సూచించారు. భీమ్‌గల్‌లోని ఏడు, 12వ వార్డులో అదనపు కలెక్టర్‌ శ్రీలత మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీతో కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. మురికి కాలువల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని, పట్టణంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయించాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగాధర్‌కు సూచించారు. పట్టణంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్‌ వెంట కౌన్సిలర్లు గంగాధర్‌, కైరున్నీసా బేగం, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమ్‌గల్‌ మండలం చేంగల్‌, బడా భీమ్‌గల్‌ గ్రామాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. మోర్తాడ్‌ మండలం సుంకెట్‌, గాండ్లపేట్‌ గ్రామాలను అదనపు కలెక్టర్‌ సందర్శించారు. గాండ్లపేట్‌లో మహిళలతో మాట్లాడుతూ.. బ్యాంకు రుణాలను ఉపాధికల్పనకు ఉపయోగించాలని చెప్పారు.  కమ్మర్‌పల్లి  మండలం హాసాకొత్తూర్‌, కోనాసముందర్‌ గ్రామాల్లోని వీధుల్లో పారిశుద్ధ్య పనులను, డంపింగ్‌ యార్డు, కంపోస్టు షెడ్డు, హరితహారంలో నాటిన మొక్కలను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. వేల్పూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఎంపీడీవో కరుణాకర్‌ పరిశీలించారు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని సర్పంచ్‌ భానుప్రసాద్‌ పిచికారీ చేయించారు. చందూర్‌ మండలంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత పవన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు చురుగ్గా కొనసాగాయన్నారు. ఆర్మూర్‌ పట్టణంలో ని 2వ వార్డులో కౌన్సిలర్‌ ఖాందేష్‌ సంగీత పనులను పరిశీలించారు. ఎడపల్లి మండలం జానకంపేట్‌, నెహ్రూనగర్‌ గ్రామాల్లో విజిలెన్స్‌ కమిటీ అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రణీత బృందం పర్యటించి  పనులను పరిశీలించారు. రాష్ట్ర కమిటీకి నివేదిక పంపడానికి తనిఖీలు చేపట్టామన్నారు. కోటగిరి మండలంలో ఎంపీడీవో మహ్మద్‌ అతారుద్దీన్‌ పర్యటించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రెంజల్‌ మండలం కందకుర్తి, నీలా గ్రామాల్లో పల్లెప్రగతి పనుల పురోగతిపై కమిషనర్‌ ఆదేశాల మేరకు పారిశుద్ధ్యం, రోడ్లు, మురికి కాలువలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా విజిలెన్స్‌ అధికారి నారాయణ పరిశీలించారు. పనులకు సంబంధించిన వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషన్‌కు నివేధిస్తామని తెలిపారు. నవీపేటలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను సర్పంచ్‌ శ్రీనివాస్‌ పరిశీలించారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను ఎప్పకప్పుడు శుభ్రం చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. బోధన్‌ మండల నాగన్‌పల్లిలో కొనసాగుతున్న పనులను బోధన్‌ ఎంపీడీవో సుదర్శన్‌నాయక్‌, నందిపేట్‌ మండలంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఎంపీవో కిరణ్‌ పరిశీలించారు.


logo