శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Jun 09, 2020 , 02:34:55

స్పెషల్‌డ్రైవ్‌ సక్సెస్‌

స్పెషల్‌డ్రైవ్‌ సక్సెస్‌

nఎనిమిది రోజులపాటు కొనసాగిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

nగ్రామాల్లో ఏండ్లుగా తిష్ఠవేసిన సమస్యలకు పరిష్కారం

nసీజనల్‌ వ్యాధులకు చెక్‌

nఇదే స్ఫూర్తితో నిరంతరం కొనసాగింపు

నిజామాబాద్‌ సిటీ: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తగా ఎనిమిదిరోజుల పాటు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్సెస్‌ అయ్యాయి. ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ సోమవారం ముగిసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొని దోమలు వృద్ధిచెందకుండా, వర్షపునీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. సీఎం కేసీఆర్‌ కలలుగంటున్న గ్రామస్వరాజ్యాన్ని సాధించడంలో భాగంగా ప్రభుత్వం ఎనిమిది రోజులపాటు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా కొనసాగాయి. 

పల్లెప్రగతి స్ఫూర్తితో.. 

సీఎం కేసీఆర్‌ పల్లెలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిద్దాలనే ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారి పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండుసార్లు చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అరికట్టేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమా లు నిర్వహించారు. జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని 530 గ్రామపంచాయతీల పరిధిలో  ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.  ఓ వైపు కరోనా ముప్పు పొంచి ఉందని, మరో వైపు సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అధికారులు, ప్రజాప్రతినిధులు చైతన్యవంతులను చేశారు. 

అందరి సహకారంతో సక్సెస్‌

ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమం అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. 

- జయసుధ, డీపీవో, నిజామాబాద్‌

కార్యక్రమం సాగిందిలా..

జిల్లా కలెక్టర్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలస్థాయిలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగాయి. మొదటి రోజున మురికికాలువలు శుభ్రం చేయగా, రెండోరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించారు. మూడోరోజు వీధులు, ప్రభుత్వ స్థలాల్లోని పిచ్చిమొక్కలను తొలగించారు. నాల్గో రోజు గుంతలను పూడ్చివేశారు. ఐదో రోజు డ్రైడేగా పాటించి ఆరోరోజు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్త కుప్పలను తొలగించారు. ఏడోరోజు ఇంటింటికి ఇంకుడు గుంతల తవ్వకం పనులు చేపట్టారు. ఎనిమిదో రోజు గ్రామాల్లో మొక్కలు నాటారు.