శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Jun 08, 2020 , 03:18:16

హంగర్గాలో ఇండ్ల పండుగ

హంగర్గాలో ఇండ్ల పండుగ

  • సాకారమైన పేదల సొంతింటి కల..
  • 30 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ప్రారంభం
  • గృహ ప్రవేశాలు చేయించిన స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి 

కోటగిరి : రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలకు సొంతింటి కల సాకారమైంది.. జీవితాంతం కష్టపడ్డా ఇంటిని నిర్మించుకోలేని వారికి సొంత గూడు దొరికింది. పైసా పైసా కూడబెట్టినా పెరుగుతున్న ధరలతో ఇంటిని కట్టుకుంటామన్న నమ్మకం సన్నగిల్లుతున్న వేళ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు వరంలా మారింది. సొంతింటి కల సాకారం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు హంగర్గా వాసులు. కోటగిరి మండలంలోని హంగర్గాలో 30 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్‌ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారని, అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టించి ఇస్తామని, పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని అన్నారు. గ్రామంలో రూ.1.51 కోట్లతో 30 ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.4 లక్షలు వెచ్చిస్తున్నామని, వంద శాతం సబ్సిడీపై లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో రూ.500 కోట్లతో 5 వేల ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎండిపోయిందని, భవిష్యత్తులో మంజీరా నది ద్వారా నీళ్లు వస్తాయన్న నమ్మకం లేదని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి మళ్లిస్తున్నామని తెలిపారు. సీఎం సహకారంతో నియోజకవర్గంలో మరో పది వేల ఇండ్లు నిర్మించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, స్థానిక సర్పంచ్‌ సునీత, ఎంపీపీ వల్లెపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్‌ పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ నీరడి గంగాధర్‌, వైస్‌ ఎంపీపీ మర్కెల్‌ గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు సిరాజ్‌, ఎంపీటీసీ ఉమ, ఆర్డీవో గోపీరాం, తహసీల్దార్‌ విఠల్‌, హౌసింగ్‌ ఏఈ నాగేశ్వరావు, ఎంపీడీవో మహ్మద్‌ అతారుద్దీన్‌ పాల్గొన్నారు. 

‘కంటతడి పెట్టిన స్పీకర్‌ పోచారం’

‘ప్రభుత్వం ఇంత ఖర్చు చేసి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. అయినా కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నరు. కాంట్రాక్టర్‌ కట్టినా, లబ్ధిదారులు కట్టుకున్నా రూ.5.4 లక్షలు ఇస్తున్నాం. ఇల్లు కట్టాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నరు. కానీ కొందరు ఆగమాగం మాట్లాడుతున్నరు..’ అని స్పీకర్‌ పోచారం కంటతడి పెట్టారు. ఒక్కో ఇల్లు కట్టాలంటే ఎన్నో ఇబ్బందులు, బాధలు ఉంటాయని, కొందరు లేనిపోని మాటలు అంటుంటే చాలా బాధ కలిగిస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. 

పోచారం సారు మంచి మనిషి..

పోచారం సారు మంచి మనిషి. గరీబోళ్ల బాధలన్నీ తెలుసు ఆయనకు.. పేదల కోసం ఎంతో శ్రమిస్తున్నరు. ఇల్లు ఇచ్చిన కేసీఆర్‌ సారు మాకు దేవుడు.. మా కుటుంబమంతా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటుంది. 50 ఏండ్ల నుంచి పెంకుటింట్లో ఉండేటోళ్లం. గిప్పుడు కేసీఆర్‌, పోచారం సార్లు డబుల్‌బెడ్‌రూం ఇల్లు కట్టిచ్చిండ్రు..

- ముత్యాల గంగామణి, లబ్ధిదారు, హంగర్గా

మనసున్న మారాజులు ..

పేద ప్రజల బతుకుల గురించి ఆలోచించే మనసున్న మారాజులు కేసీఆర్‌, పోచారం శీనన్న. ఏండ్ల తరబడి కిరాయి ఇండ్లల్లో బతికినం. ఎవ్వరూ పట్టించుకోలె. తెలంగాణ ప్రభుత్వంలో మా సొంతింటి కల నెరవేరింది. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టిచ్చిండ్రు. కేసీఆర్‌, పోచారం శ్రీనివాసరెడ్డి సార్లకు రుణపడి ఉంటాం.

- అనసూయ, లబ్ధ్దిదారు, హంగర్గా

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..

తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం.. అది ఇప్పుడు నిజమైంది. ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇచ్చింది. మిషన్‌ భగరీథ నీళ్లు, నిరంతర విద్యుత్‌ సరఫరా, డ్రైనేజీ నిర్మాణం ఇలా ఎన్నో సౌకర్యాలు కల్పించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు న్యాయం చేసింది. జీవితాంతం రుణపడి ఉంటాం.                               

-హన్మవ్వ లబ్ధిదారు, హంగర్గా