బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Jun 08, 2020 , 03:18:20

ఇందూరుకు హరితోత్సవం

ఇందూరుకు హరితోత్సవం

ఆర్మూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. జిల్లాలో ఐదు విడుతలుగా నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, అటవీ ప్రాంతాలు హరితశోభను సంతరించుకున్నాయి. జీపీలతోపాటు, ఉపాధి హామీ, అటవీశాఖ స్థలాల్లోనూ నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు.  

ఈ నెల 20 నుంచి మొక్కలు నాటే కార్యక్రమం 

జిల్లాలో ఈ నెల 20వ తేదీన హరితహారం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో 62 లక్షల పైచిలుకు మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు అనువైన స్థలాలను గుర్తించారు. జిల్లాకు సరిపడా లక్ష్యం కన్నా 46 లక్షల మొక్కలను అదనంగా పెంచారు. జిల్లాలోని 530 గ్రామాల్లో 108 లక్షల 33వేల మొక్కలను అధికారులు పెంచి నాటేందుకు సిద్ధంగా ఉంచారు. 

30 శాఖలు భాగస్వామ్యం

జిల్లాలోని 30 ప్రభుత్వ శాఖల ద్వారా హరితహారంలో లక్ష్యం చేరుకునేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. జిల్లాకు చెందిన 30 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 62 లక్షల 8వేల 2 వందల 47 మొక్కలను నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

అడవుల పెంపే లక్ష్యం

రాష్ట్రంలో అడవులను పెంచాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఐదేండ్లుగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని బృహత్తరంగా చేపడుతున్నది. వానలు పడాలే.. కోతులు వాపస్‌ పోవాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశం. కేసీఆర్‌ అడవులను 33 శాతానికి పెంచాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హరితహారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం బాగుంది.

-ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ 


logo