మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Jun 07, 2020 , 00:50:50

ఏరువాక సాగారో..

ఏరువాక సాగారో..

మృగశిర కార్తె వచ్చేసింది.. అన్నదాతలు నాగలిపట్టి పొలాలు దున్నేందుకు సిద్ధమవుతున్నారు.. రైతన్నలు పొలంబాట పడుతున్నారు. పనిముట్లను శుభ్రం చేసి.. పసుపు, కుంకుమలతో ఎడ్లను పూజించి ‘సాగు’ పనులు ప్రారంభించడం ఆనవాయితీ. ఆదివారం మృగశిర కార్తె సందర్భంగా ఉమ్మడి జిల్లాలో అన్నదాతలు బిజీ అయ్యారు. చేపలు, మామిడి పండ్ల విక్రయాలు ఊపందుకున్నాయి.

నేడు మృగశిర కార్తె

రుతుపవనాల ఆగమనానికి సూచిక

సాగు పనులకు సిద్ధమవుతున్న అన్నదాతలు

చేపలు, మామిడి పండ్లకు పెరిగిన డిమాండ్‌

ఇందూరు/బాన్సువాడ రూరల్‌ : మృగశిర కార్తె (మిరుగం) వచ్చిందంటే సకల జనులకు ఊరట. రోహిణి కార్తెలో గ్రీష్మతాపంతో అల్లాడిన సర్వకోటి జీవులకు మృగశిర కార్తె గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. రుతుపవనాల రాకను మృగశిర కార్తె ఆహ్వానిస్తుంది. జింక తలను పోలి ఉండడంతో ఈ కార్తెను మృగశిర కార్తెగా పిలుస్తారు. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభమవుతుంది. రోహిణి నక్షత్రంలో భానుడి ప్రతాపంతో రోకళ్లు పగిలితే, మృగశిర కార్తెలో వాతావరణం చల్లబడుతుంది.  ఈ కార్తెలోనే రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయి. రైతులు దుక్కులు దున్ని వానకాలం సాగుకు సిద్ధ్దమవుతారు. మిరుగం రోజున చేపలు తినడం, మామిడి పండ్ల పానకం తయారు చేసి తాగడం జిల్లాలో ఆనవాయితీ. జిల్లాలో ఆదివారం మిరుగం పండుగను ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు.

రుతు పవనాల రాక.. 

మృగశిర కార్తె ప్రారంభమైందంటే వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రోహిణి కార్తెలో ప్రజలు ఎండలతో అల్లాడిపోగా మృగశిర కార్తెలో చల్లని వాతావరణంలో సేదతీరుతారు. నైరుతి రుతుపవనాల రాకతో తొలకరి వర్షాలకు వ్యవసాయ పనులు జోరందుకుంటాయి. రైతులు దుక్కులు దున్ని, పంట సాగులో బిజీబిజీగా గడుపుతారు. ఈ కార్తెలో సాగు చేస్తే పంటలు తెగుళ్లు, చీడపీడల బారిన పడకుండా అధిక దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం.

వాతావరణంలో మార్పులు 

మృగశిర కార్తె ఆరంభంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకాశం మబ్బుపట్టి గాలిలో తేమశాతం పెరగడంతో ప్రజలు అస్తమాకు గురవుతారు. అందుకే మృగశిర రోజున ప్రత్యేకంగా అస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తుంటారు. 

చేపలకు భలేగిరాకీ  

మృగశిర కార్తె వచ్చిందంటే చాలు చేపలకు అమాంతం గిరాకీ పెరుగుతుంది. రుతుపవనాల రాకను ఆహ్వానించి మృగశిర కార్తె ఆదివారం ఉదయంతో ప్రవేశిస్తుంది. మృగశిరకు ముల్లోకాలు చల్లబడతాయన్న సామెత ఉంది. గ్రీష్మ తాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవరాసులు తొలకరి జల్లులతో పులకించిపోతాయి. మృగశిర కార్తె రోజున ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేప ప్రసాదం తీసుకోవడం, చేపలు తినని వారు ఇంగువా బెల్లం తీసుకుంటారు. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చేప ప్రసాదం పంపిణీ చేయడంలేదు. మృగశిరకార్తె రోజున చేపలు తినడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇదే అదునుగా భావించి వ్యాపారులు చేపల రేటును అమాంతం పెంచి విక్రయిస్తారు. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి వంటి ముఖ్య కేంద్రాల్లో చేపల విక్రయానికి వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు.

చల్లబడిన వాతావరణం ..

మృగశిర కార్తె ఆరంభానికి ముందే జిల్లాలో వాతావరణం చల్లబడింది. మే నెలలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్‌ ఆరంభంలోనే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. మాచారెడ్డి, గాంధారి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బీర్కూర్‌ తదితర మండలాల్లో తొలకరి జల్లులు పలకరించాయి. మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం కాగానే వాతావరణంలో వస్తున్న మార్పులతో జిల్లాలో భిన్న వాతావరణం నెలకొన్నది. logo