గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jun 07, 2020 , 00:39:51

చివరి ఆయకట్టూ మురిసేలా..

చివరి ఆయకట్టూ మురిసేలా..

నిజాంసాగర్‌ చివరి ఆయకట్టు రైతులకు ఇక తిప్పలు తప్పనున్నాయి.  నిజాంకాలంలో నిర్మించిన నిజాంసాగర్‌ ఉపకాలువలు ఉనికి కోల్పోయాయి. సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కాల్వల ఆధునీకరణకు పుష్కలంగా నిధులు కేటాయిస్తున్నది. నవీపేటలో శిథిలావస్థకు చేరిన ఉపకాలువల ఆధునీకరణకు రూ.9.20 కోట్లు విడుదల చేసింది. వచ్చే వానకాలం నాటికి పనులు పూర్తి చేసి సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన  పనులు చేపడుతున్నారు. పనులన్నీ పూర్తయితే నవీపేట మండలంలోని 15,800 ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని జలాల్‌పూర్‌ శివారులో డీ50/3 ఉపకాలువ సీసీ లైనింగ్‌ పనులకు త్వరలో మోక్షం లభించనున్నది. పనులకు సంబంధించిన ప్రతిపాదనలు  పంపారు. త్వరలో ప్రభుత్వం నుంచి మంజూరు లభించగానే పనులను ప్రారంభిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. 

- నవీపేట/నిజామాబాద్‌ రూరల్‌

ముమ్మరంగా నిజాంసాగర్‌ ఉప కాలువల ఆధునీకరణ పనులు 

నవీపేట మండలంలో సస్యశ్యామలం కానున్న వేల ఎకరాలు 

ప్రస్తుతం అలీసాగర్‌ లిప్టు ద్వారానే నీటి విడుదల

జలాల్‌పూర్‌ డీ50/3 ఉపకాలువ పనులకు త్వరలో మోక్షం 

రూ.50 లక్షలతో ప్రతిపాదనలు .. 

హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు 

నవీపేట: తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి   విశేషంగా కృషి చేస్తున్నది. ఇందు లో భాగంగా సాగునీటి తిప్పలు తీర్చేందుకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నారు. నవీపేట మండలంలో చివరి ఆయకట్టుకు నిజాంసాగర్‌ నీరు చేరే విధంగా చేపట్టిన ఉప కాలువల ఆధునీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.9.20 కోట్లు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే నిజాంసాగర్‌ ఉపకాలువల సిమెంట్‌ గైడ్‌వాల్స్‌ పనులు నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో ముమ్మరంగా సాగుతున్నాయి.  పనులు పూర్తయితే మండలంలోని మోకన్‌పల్లి, కమలాపూర్‌, దర్యాపూర్‌, ఫత్తేనగర్‌, నవీపేట, పొతంగల్‌, హన్మాన్‌ఫారం, జన్నేపల్లి, సిరన్‌పల్లి, శాఖాపూర్‌, బినోలా, జగ్గారావుఫారం, మల్కాపూర్‌ గ్రామాల్లోని సుమారు 15,800 ఎకరాలకు సాగునీరు అందనుంది. నిజాంసాగర్‌ డీ/50/4, ఉప కాలువలతో పాటు డీ50/6 దర్యాపూర్‌, ఫత్తేనగర్‌, నవీపేట డీ50/7, డీ50/9, పొతంగల్‌ డీ50/12, హన్మాన్‌ఫారం, జన్నేపల్లి డీ50/13, డీ 50/14, జగ్గారావుఫారం, మల్కాపూర్‌ డీ50/3, శాఖాపూర్‌, సిరన్‌పల్లి, బినోలా డీ50/15 ఉప కాలువల గైడ్‌వాల్స్‌ సిమెంట్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. వచ్చే వానకాలం వరకు రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అధికారులు పనులను వేగవంతంగా చేయిస్తున్నారు.  

అలీసాగర్‌ లిప్టు, సాగర్‌ కాలువల ద్వారా సాగునీరు.. 

మండలంలోని కోస్లీ గోదావరి నది వద్ద ఏర్పాటు చేసిన అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతం మండలంలోని 12 గ్రామాలకు నిజాంసాగర్‌ డీ50 ఉప కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందనుంది. శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్పీ నిండుకుండలా మారడంతో  ఇక నుంచి శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌తో మండలంలోని అలీసాగర్‌ లిప్టు ద్వారా పలు గ్రామాల్లోని వందలాది ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. 

రైతాంగం హర్షం

నవీపేట మండలంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఉప కాలువలకు గైడ్‌ వాల్స్‌ నిర్మాణ పనులు జోరుగా సాగుతుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. నీటిపారుదల శాఖ ఈఈ బన్సీలాల్‌ పర్యవేక్షణలో డిప్యూటీ ఈఈ వెంకటరమణ, ఏఈ  శ్రీనివాస్‌ సంబంధిత గుత్తేదారుడితో పనులను వేగవంతం చేశారు.  కాలువల నిర్మాణంతో సాగర్‌ చివరి ఆయకట్టుకు సాగునీరు చేరి పంటలు పండుతాయనే నమ్మకం రైతుల్లో వచ్చింది. దీంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిర్ణీత సమయంలో ఉప కాలువల పనులు పూర్తి

నవీపేట మండలంలో 12 గ్రామాల్లో ఉప కాలువల గైడ్‌ వాల్స్‌ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభు త్వం రూ.9.20 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం నీటి పారుదల శాఖ ఈఈ బన్సీలాల్‌ పర్యవేక్షణలో పనులు వేగవంతం చేశాం. సాధ్యమైనంత త్వరలో పనులను పూర్తి చేసి అలీసాగర్‌ ఎత్తిపోతల ద్వారా నిజాంసాగర్‌ ఆయకట్టు గ్రామాలకు నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.

- వెంకటరమణ, డిప్యూటీ ఈఈ, బోధన్‌


logo