ఆదివారం 05 జూలై 2020
Nizamabad - Jun 06, 2020 , 02:01:39

సల్లంగ సూడు.. గోదారమ్మా..

సల్లంగ సూడు.. గోదారమ్మా..

 త్రివేణి సంగమ క్షేత్రం.. భక్తజనసందోహం

ఘనంగా ఏరువాక పున్నమి

భక్తుల సరిగంగ స్నానాలు

సైకత శివలింగాలకు ప్రత్యేక పూజలు

తలనీలాల సమర్పణ

నామకరణ మహోత్సవాలు

రెంజల్‌ : భక్తుల సరిగంగ స్నానాలు.. సల్లంగ సూడు గోదారమ్మ అంటూ.. భక్తుల వేడుకోలు.. సైకత శివలింగాలకు ప్రత్యేక పూజలు.. తలనీలాల సమర్పణ.. నామకరణాల వేడుకలతో త్రివేణి సంగమ క్షేత్రం భక్తజన సందోహమైంది. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామ శివారులో గోదావరి, హరిదా, మంజీర నదులు ఒకే చోట కలిసే త్రివేణి సంగమ క్షేత్రానికి శుక్రవారం ఏరువాక (సత్యగంగ) పున్నమిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలకరి వర్షాలతో గోదావరిలో చేరిన నీటిలో భక్తులు స్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీతో పుష్కర ఘాట్లు కిటకిటలాడాయి. ఇసుకతో శివలింగాలను తయారు చేసి పూజలు నిర్వహించారు. గత ఏడాది నదిలో నీరు లేక పోవడంతో చెలిమెలు తోడి నీటిని తలపై చల్లుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు చేరడంతో ఈ ఏడాది గోదావరి నదిలోని పుష్కరఘాట్ల సమీపంలో నీరు నిల్వ ఉండడంతో భక్తులు అక్కడే స్నానాలు చేశారు. పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు పురాతన శివాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘సల్లంగ సూడు.. గోదారమ్మా..’ అంటూ భక్తులు మొక్కుకున్నారు. పిండి వంటలతో తయారు చేసిన నైవేద్యాన్ని తెప్పలో ఉంచి పారుతున్న నది నీటిలో వదిలారు. కోరిన కోరికలు తీర్చే తల్లి గోదావరిని ఇంటి దేవుడిగా కొలవడమే కాకుండా చిన్నారుల తలనీలాలు సమర్పించడం, గంగ పేరుతో నామకరణం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర దూర ప్రాంతాల నుంచి బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని బోధన్‌, నిజామాబాద్‌ -2 డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. నదిలో నీరు ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెంజల్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. logo