శుక్రవారం 03 జూలై 2020
Nizamabad - Jun 06, 2020 , 02:01:37

డబుల్‌ ఆనందం

డబుల్‌ ఆనందం

పేదల సొంతింటి కల సాకారం

రామ్‌గంగానగర్‌లో సామూహిక గృహప్రవేశాలు

పాల్గొన్న మంత్రి వేముల, స్పీకర్‌ పోచారం

ఆనందం.. ‘డబుల్‌' అయ్యింది వారి సొంతింటి కల సాకారమైంది. కోటగిరి మండలంలోని సోంపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్‌గంగానగర్‌లో 40 మంది డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల లబ్ధిదారులు శుక్రవారం సామూహిక గృహప్రవేశాలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. అనంతరం కొల్లూర్‌లో రూ.7.50 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.  -కోటగిరి

కోటగిరి : పూరిగుడిసెలు.. రేకుల ఇండ్లు.. అద్దె ఇండ్లలో కాలం వెళ్లదీసిన పేదల సొంతింటి కల సాకారమైంది. దశాబ్దాలుగా పడరాని పాట్లు పడ్డ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వం అందించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లల్లోకి సంబురంగా అడుగుపెట్టారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం సోంపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్‌గంగానగర్‌లో రూ.2.51 కోట్లతో 40 డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులు శుక్రవారం సామూహిక గృహప్రవేశాలు చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. గృహ నిర్మాణ, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. అనంతరం కొల్లూర్‌లో రూ.7.50 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీక అని, దసరా నాటికి లక్ష ఇండ్లు పూర్తి చేసి పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఇండ్లు మంజూరు కాగా దసరా నాటికి లక్ష ఇండ్లు పేదలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారని గుర్తు చేశారు. పేదలకు గృహాలు అందివ్వడం ఆనందంగా ఉందన్నారు. గృహప్రవేశాలు చేసే సమయంలో లబ్ధిదారుల కండ్లల్లో ఆనందం చూస్తే సంతోషం కలుగుతున్నదన్నారు.  

పేదవాడి సొంతింటి  కలను నిజం చేస్తాం.. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ నియోజకరవర్గ పరిధిలోని 106 గ్రామాల్లో అన్ని వసతులతో రూ.500 కోట్లతో 5000 ఇండ్లు నిర్మిస్తున్నామని స్పీకర్‌ పోచారం తెలిపారు. మెజారిటీ ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో నియోజకరవర్గ పరిధిలో మరో పది వేల ఇండ్లు నిర్మించి ప్రతి పేద కుటుంబానికి అందజేస్తామన్నారు. ‘చేతులెత్తి మొక్కుతున్నా పేదవాడికి కేటాయించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పేరుతో నాయకులు డబ్బులు తీసుకోవద్దు.. అలా ఎవరైనా తీసుకున్నట్లు తన దృష్టికి వస్తే పోలీసు కేసు పెట్టి పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తా’ అని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి కేటాయించిన కోల్డ్‌స్టోరేజ్‌తో కూడిన గోదాంను రామ్‌గంగానగర్‌ గ్రామ సమీపంలో నిర్మించడానికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు. అనంతరం 49 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, ఎంపీపీ వల్లేపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ నీరడి గంగాధర్‌, కొల్లూర్‌ కిశోర్‌, ఎజాజ్‌ఖాన్‌, జడ్పీ కో-ఆప్షన్‌ సిరాజ్‌, ఆర్డీవో గోపిరాం, డీపీవో జయసుధ, డీఏవో గోవింద్‌, తహసీల్దార్‌ విఠల్‌, సీడీపీవో వినోద పాల్గొన్నారు.


logo