శుక్రవారం 10 జూలై 2020
Nizamabad - Jun 04, 2020 , 02:08:48

టీఆర్‌ఎస్‌లోకి వలసలు

టీఆర్‌ఎస్‌లోకి వలసలు

కామారెడ్డి జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌తో పాటు భిక్కనూరు జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకుల చేరిక

పార్టీలోకి ఆహ్వానించిన విప్‌ గంప గోవర్ధన్‌

కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్‌!

కామారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికి దిక్సూచిలా మారుతున్నదని  ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విప్‌ నివాసంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లా పరిషత్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌, దోమకొండ జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌, భిక్కనూర్‌ జడ్పీటీసీ తాటిపాముల పద్మ, నాగభూషణంగౌడ్‌తోపాటు దోమకొండ, బీబీపేట మండలాలకు చెందిన ఇద్దరు సర్పంచు లు, ఇద్దరు ఎంపీటీసీలు, సుమారు 50 మంది కాంగ్రెస్‌ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో కామారెడ్డి గడ్డకు ప్రత్యేక స్థానం ఉందని, గోదావరి నీటితో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల రైతుల కాళ్లు కడుగుతామని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఖాళీ!

కామారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటికే గులాబీజెండా రెపరెపలాడుతుండగా, దోమకొండ, భిక్కనూర్‌ మండలాల నుంచి కాంగ్రెస్‌ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు,  పలువురు నాయకులు బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరడం కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చింది. ఆ పార్టీ దాదాపు ఖాళీ అయినట్టేనని నాయకులు పేర్కొంటున్నారు. 


logo