సోమవారం 26 అక్టోబర్ 2020
Nizamabad - Jun 03, 2020 , 02:40:37

తండ్రిని హత్య చేసిన తనయుడికి జీవిత ఖైదు

తండ్రిని హత్య చేసిన తనయుడికి జీవిత ఖైదు

నిజామాబాద్‌ లీగల్‌:  తండ్రిని హత్య చేసిన తనయుడికి జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ సెషన్స్‌ జడ్జి పి.శ్రీసుధ మంగళవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దాదన్నగారి మధుసూదన్‌రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి చెందిన మంగళవారం రమేశ్‌ బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లి ఇటీవల వచ్చాడు. ఇక్కడ పని లేకుండా జులాయిగా తిరిగే అతడు మద్యానికి బానిసయ్యాడు. ప్రమాదంలో గాయపడిన తండ్రి పెద్ద గంగారామ్‌ను మద్యం తాగడం కోసం రమేశ్‌ డబ్బులు అడిగేవాడు. తనకు పెండ్లి చేయమని రోజూ గొడవ పడేవాడు. డిసెంబర్‌ 19, 2018న రాత్రి తొమ్మిది గంటల సమయంలో గొడవపడి కత్తితో తండ్రి ఎడమ మోచేతిపై, ఎడమ కణతపై, ఛాతిలో పొడిచాడు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. దీంతో ఆర్మూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.

నేర విచారణలో భాగంగా భార్య ఎల్లవ్వతో పాటు మొత్తం 11 మంది సాక్ష్యాలను నమోదు చేసిన సెషన్స్‌ కోర్టు ముద్దాయి రమేశ్‌పై హత్యానేరం రుజువైందని ప్రకటిస్తూ జీవితఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి శ్రీసుధ తీర్పు చెప్పారని తెలిపారు.


logo