ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Jun 01, 2020 , 03:59:26

పన్ను వసూళ్లలోకదలిక

 పన్ను వసూళ్లలోకదలిక

  • ‘కరోనా’ కారణంగా కలెక్షన్‌కు బ్రేక్‌
  • గత ఆర్థిక సంవత్సరంలో వసూలు లక్ష్యం రూ.29 కోట్లు..
  • వచ్చింది రూ.25 కోట్లు
  • మూడు నెలల తరువాత ప్రారంభమైన ‘స్పెషల్‌ డ్రైవ్‌' 

పల్లెల్లో పన్ను వసూళ్లలో కదలిక వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం చివరలో లాక్‌డౌన్‌ విధించడంతో పన్ను వసూళ్లకు బ్రేక్‌ పడింది. మూడు నెలల తర్వాత ప్రస్తుతం పన్ను వసూళ్లను అధికారులు ప్రారంభించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 86 శాతం పన్ను వసూలు కాగా మిగతా 14శాతం వసూలు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

నిజామాబాద్‌ సిటీ: కరోనా వైరస్‌వ్యాప్తి కారణంగా జిల్లాలో పన్ను వసూళ్లకు బ్రేక్‌ పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ, మార్చి చివరి వారం నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో వసూళ్ల ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిపథంలో దూసుకెళ్లాయి. అదే స్ఫూర్తితో పన్ను వసూళ్ల ప్రక్రియసైతం కొనసాగింది. గ్రామ పురోగతే లక్ష్యంగా ప్రజలు పన్ను చెల్లించేందుకు ముందుకు వచ్చారు. గత ఆర్థిక సంవత్సరంలో 86శాతం పన్ను వసూలు కాగా, మిగతా 14శాతం వసూలు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. సుమారు మూడు నెలల తరువాత పలు గ్రామాల్లో  వసూళ్లను ప్రారంభించారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా, గ్రామ పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో మూడు డివిజన్లు ఉన్నాయి. నిజామాబాద్‌ డివిజన్‌లో సిరికొండ, నిజామాబాద్‌ రూరల్‌, నవీపేట్‌, మోపాల్‌, ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మాక్ల్లూర్‌, బోధన్‌ డివిజన్‌లో బోధన్‌, చందూర్‌, కోటగిరి, మోస్రా, రెంజల్‌, రూద్రూ ర్‌, వర్ని, ఎడపల్లి, ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో ఆర్మూర్‌, బాల్కొండ, భీమ్‌గల్‌, జక్రాన్‌పల్లి, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్‌, ముప్కాల్‌, నందిపేట్‌, వేల్పూర్‌, ఏర్గట్ల మండలాలు ఉన్నాయి. 

గతేడాది పన్ను వసూళ్లు ఇలా..

2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.29 కోట్ల పన్ను వసూలు ప్రభుత్వ లక్ష్యం కాగా, రూ.25 కోట్లు వసూలు చేశారు. మిగతా రూ.4కోట్లను 2020-21 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయనున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో రూ.13,81,59,737 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.12,36,86,962 కోట్లు వసూలు చేశారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో రూ.6,07,07,792 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.5,05,33,350కోట్లు, నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో రూ.9,20,13,548 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.7,83, 89,926కోట్లు వసూలు చేశారు.

పన్ను వసూళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది

ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పన్ను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పన్ను చెల్లింపు ఆవశ్యకతపై ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించాం. కరోనా వైరస్‌ కారణంగా పన్ను వసూళ్లలో జాప్యం జరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు పన్ను చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. - జయసుధ, జిల్లా పంచాయతీరాజ్‌శాఖ అధికారిణి


logo