గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - May 31, 2020 , 03:43:53

మత్తు వదలరా

మత్తు వదలరా

ఖలీల్‌వాడి :సిగరెట్‌ తాగడం ఒక ఫ్యాషన్‌గా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దీనికి బానిసవుతున్నారు. వారు అనారోగ్యం బారిన పడడంతోపాటు పక్కవారినీ బలి తీసుకుంటున్నారు. సిగరెట్‌ తాగే వారికన్నా పక్కన ఉండే వారికే ఎక్కువ రోగాలు చుట్టుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగ తాగకుండా రోగాలు తెచ్చుకునేవారిని పాసివ్‌ స్మోకర్స్‌ అంటారు. పొగ తాగేవారికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 13 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులకు బానిసై మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు సూచిస్తున్నాయి. దాదాపు 6 నిమిషాలకు ఒకరు బలవుతున్నారు. వీరిలో 50 నుంచి 60 లక్షల మంది పాసివ్‌ స్మోకర్స్‌ కావడం గమనార్హం. అమెరికాలో ఏటా 5 నుంచి 6 లక్షల మంది మృతిచెందుతుండగా, చైనాలో 12 లక్షల మంది, భారతదేశంలో 10 లక్షల మంది మరణిస్తున్నారంటే పొగాకు ఏవిధంగా ప్రజల ప్రాణాలను తోడేస్తుందో ఊహించవచ్చు. మనదేశంలో చనిపోతున్న పొగరాయుళ్లలో 20 శాతం మంది పురుషులు కాగా, 5 శాతం మంది స్త్రీలు ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 20వ శతాబ్దంలో వంద మిలియన్‌ మరణాలు కేవలం పొగాకు ఉత్పత్తులతోనే సంభవించే ప్రమాదముంది. హుక్కా, బీడీ, సిగరెట్‌, సిగార్‌, పైప్‌ స్మోకింగ్‌, ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌, గుట్కా, తంబాకు, పాన్‌ మసాలా, జర్దా, తోట వంటి వాటితో మరణాలు సంభవించే అవకాశముంది. పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా వాటి ద్వారా కలిగే వ్యాధులు, రోగాల కారణంగా ప్రజలు వైద్యానికి వెచ్చిస్తున్న మొత్తం అందుకు పదింతలు ఎక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులను నిషేధించలేక వాటి ద్వారా కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడంలేదు. 

బానిసలుగా మార్చేస్తున్న ‘నికోటిన్‌' 

పొగాకులో ఉండే నికోటిన్‌ పొగ పీల్చిన ఐదు నిమిషాల్లోనే రక్తంలో కలిసిపోయి, క్షణాల్లోనే మెదడుకు చేరుతుంది. వెనువెంటనే మెదడు డొపమైన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా పొగ తాగే వారు, గుట్కా నమిలే వారు మత్తు అనుభూతికి లోనవుతారు. తద్వారా వారు అవి లేకుండా గడపలేని స్థితికి చేరుకుంటారు. పొగాకు పీల్చడం, నమలడంతో నికోటిన్‌తోపాటు 4వేల రకాల విషకారకాలు, 43 రకాల క్యాన్సర్‌ కారకాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

అనేక అనర్థాలు

పొగాకు ఉత్పత్తుల వాడకంతో మెదడు పక్షవాతం, తలనొప్పి, తలతిరగడం, నిద్రలేమి, భయంకరమైన కలలు, నోరు-గొంతు అల్సర్లు, పుండ్లు, క్యాన్సర్లు 50 శాతం అధికం అవుతాయి. బ్రాంకైటిస్‌, సీవోపీడీ ఊపిరితిత్తుల క్యాన్సర్లు, అన్నవాహిక - జీర్ణాశయం అజీర్ణం, అల్సర్‌, కడుపులో మంట, జీర్ణాశయ క్యాన్సర్‌, క్లోమగ్రంథి పని అస్తవ్యస్తం, క్లోమగ్రంథి క్యాన్సర్‌, మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు, మూత్రాశయ క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌, సంతానలోపం, అబార్షన్లు, సర్వైకల్‌ క్యాన్సర్‌, ప్రధానంగా కార్బన్‌మోనాక్సైడ్‌, మెథనాల్‌, ఆర్మినిక్‌టోలిన్‌, కాడ్మియం, బ్యూటిన్‌ లాంటివి మనిషి ఆరోగ్యాన్ని పాడు చేయడంలో ముందు ఉన్నాయి.  


logo