బుధవారం 08 జూలై 2020
Nizamabad - May 31, 2020 , 03:43:55

స్వచ్ఛ పల్లెల దిశగా..

స్వచ్ఛ పల్లెల దిశగా..

నిజామాబాద్‌ సిటీ :

గ్రామాలను స్వచ్ఛ పల్లెలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది. ఇప్పటికే రెండు విడుతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు తదితర అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నది. రానున్న వానకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఎనిమిది రోజులపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 

రేపటి నుంచి ప్రారంభం

నిజామాబాద్‌ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో సోమవారం నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. మండల స్థాయిలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి పర్యవేక్షకులుగా ఉంటారు.  

ఎనిమిది రోజుల కార్యక్రమాలు ఇవే.. 

1వ తేదీన మురికి కాలువలను శుభ్రం చేయడం, వార్డుల వారీగా సఫాయి సిబ్బంది, ఎంగేజ్‌ చేసుకున్న కూలీలతో రెండు రోజుల్లో పూర్తి చేయాలి. 2వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలి. 3వ తేదీన వీధులు, ప్రభుత్వ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించాలి. 4వ తేదీన గుంతలను పూడ్చివేయాలి. 5న డ్రై డేగా పాటించాలి. 6న ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్త కుప్పలను తొలగించాలి. 7న ఇంటింటికీ ఇంకుడు గుంతల తవ్వకం పనులు ప్రారంభించి వారంలో పూర్తి చేయాలి. 8వ తేదీన మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వాలి. 

పకడ్బందీగా పనులు : నిజామాబాద్‌ కలెక్టర్‌

ఇందూరు : జిల్లాలో జూన్‌1 నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ప్రతి గ్రామపంచాయతీలో 5 బస్తాల బ్లీచింగ్‌ పౌడర్‌ నిల్వ ఉంచుకోవాలని తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం 5 గంటల లోపు గ్రామాల్లో చేపట్టనున్న పనులకు సంబంధించి ముందస్తు ప్రణాళికను www.epanchayat.telangana.gov.in లో అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు.


logo