ఆదివారం 12 జూలై 2020
Nizamabad - May 30, 2020 , 00:04:11

గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌కు చేరడంపై హర్షం

గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌కు చేరడంపై హర్షం

  • సాగర్‌ ఆయకట్టుకు‘కొండ’ంత జీవం  
  • మంచి రోజులు వచ్చాయంటున్న అన్నదాతలు

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా శుక్రవారం గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌కు చేరడంపై ఉమ్మడి జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు నీరు చేరనుండడంతో ఇక సాగునీటికి ఢోకా ఉండదని అంటున్నారు. సింగూరు ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచీ నిజాంసాగర్‌కు గడ్డుకాలం వచ్చిందని..  ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంత రైతులు రెండు పంటలు వేసుకునే రోజులు వచ్చాయంటూ ఆనందం   చేస్తున్నారు. భగీరథ ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అన్నదాతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

- నిజాంసాగర్‌ రూరల్‌/బీర్కూర్‌

ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం.. 

తెలంగాణ ప్రాంతమంతా పచ్చని పొలాలతో సస్యశ్యామలమవడం ఖాయం. కాళేశ్వరం నీరు కొండపోచమ్మసాగర్‌ వద్దకు వచ్చిందంటే అక్కడి నుంచి మల్లన్న సాగర్‌ చేరుకొని హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌లోనికి వస్తాయి. అప్పుడు నిజాంసాగర్‌ ఆయకట్టు రైతుల కష్టాలు తీరినట్లే. బీడు భూములు సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.

- మిద్దింటి హన్మాండ్లు, రైతు, బీర్కూర్‌.

నిజాంసాగర్‌ రూరల్‌ : సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మహోన్నత ఘట్టం శుక్రవారం ఆవిష్కృతం అయ్యింది. సీఎం కేసీఆర్‌ దంపతులు గోదావరి జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి శుక్రవారం విడుదల చేశారు. మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ నుంచి వచ్చిన నీటిని నిల్వ చేయడానికి 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ నిర్మాణం ప్రారంభించారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ నుంచి హల్దీవాగు గ్రావిటీ కెనాల్‌ ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీటిని మళ్లించనున్నారు. దీంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు పునర్జీవం వస్తుందని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో సాగర్‌ ఆయకట్టు రైతులు తాము సాగు చేస్తున్న పంటలు చేతికి అందుతాయో లేదో అంటూ ప్రతియేడూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద మొత్తం రెండు లక్షల 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ అయిన సింగూరు ప్రాజెక్టులో సైతం నీటి నిలువ లేక బండరాళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం నీటి కోసం సింగూరు వైపు లేదా ఆకాశం వైపు ఎదురుచూపులు చూస్తున్న రైతన్నలకు ఇక సాగు నీటి కష్టాలు దూరం కానున్నాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు త్వరలో పునర్జీవం రానుందని ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం నీరు త్వరలో నిజాంసాగర్‌లోకి రానున్నాయని ఇక ఆయకట్టు కింద వందశాతం పంటలను వానకాలం, యాసంగి రెండు సీజన్లలో సాగు చేసుకోవచ్చు అంటే సంబురపడుతున్నారు. త్వరలోనే కాళేశ్వరం నీరు నిజాంసాగర్‌ చేరుతున్నదని, తమ కండ్ల ముందు పచ్చని పంట పొలాలు దర్శనమిస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ మంచిరోజులే..

కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్‌లోనికి వచ్చి చేరితే ఆయకట్టు రైతులకు మంచిరోజులు వచ్చినట్లే. ఈ ప్రాంత రైతుల ఏండ్ల కల నెరవేరినట్లవుతుంది. సింగూరు ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి నిజాంసాగర్‌కు గడ్డుకాలం వచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంత రైతులు రెండు పంటలు వేసుకునే రోజులు వచ్చాయ్‌.

- యామ సాయిలు, రైతు, బీర్కూర్‌

రుణపడి ఉంటాం..

సీఎం కేసీఆర్‌ సారుకు నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులందరం రుణపడి ఉం టాం.  ఎన్నో ఏండ్ల ఈ ప్రాంత రైతుల కల నెరవేరుతున్నది. కొండపోచమ్మసాగ ర్‌ ప్రారంభించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ఇప్పటికే తెలంగాణలోని అధికభాగానికి కాళేశ్వరం నీ రు వచ్చిచేరింది. ఏడాదిలోగా అనుకున్న లక్ష్యం చేరుకుంటాం అన్న నమ్మకం ఉంది.

- గోండ్ల నడిపి గంగారాం, రైతు, బీర్కూర్‌

రైతులకు మంచి రోజులు..

రైతులకు మంచి రోజులు వచ్చినయి. ఎవుసం చేయాలంటే వేసిన పంట ఎండుతుందో పండుతుందో అని భయపడే పరిస్థితి దూరం కానుంది. రంగనాయకుని ప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా కొండపోచమ్మ సాగర్‌లోకి నేడు జలసిరులు వచ్చాయి.. త్వరలో హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల్లోకి రానున్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా పచ్చటి పంటలతో కళకళలాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. 

- గంగారెడ్డి, రైతు, కొమలంచ

కేసీఆర్‌ సారును దేవుడే పంపిండు.. 

రైతులు పడుతున్న కష్టాలను దూరం చేసేందుకే దేవుడు సీఎం కేసీఆర్‌ సార్‌ను పంపిండు. కొండ పోచమ్మసాగర్‌ కట్టడంతో సాగుకు ఇక లోటు ఉండదు. వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి. ప్రాజెక్టులు నిర్మిస్తారని అంటూ ప్రకటిస్తుండడంతో ఆ నిర్మించే ప్రాజెక్టులు మేమైతే చూడము.. మా పిల్లలు చూస్తారేమో అనుకున్నాం. అలాంటిది కండ్ల ముందే ప్రాజెక్టులు నిర్మించి జలసిరులు కురిపిస్తున్న కేసీఆర్‌ సారు సల్లంగుండాలే. 

- భద్రినాథ్‌, రైతు, మంగ్లూర్‌

జలకళను సంతరించుకోనున్నాయి..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. త్వరలో కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టులోకి రానున్నాయి. దీంతో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో సాగు నీటి ఇబ్బందులు లేకుండా రైతన్నలందరం సంతోషంగా పంటలు సాగు చేసుకుంటాం.

- ధ్యానబోయిన గంగారాం, రైతు, మాగి

రైతును రాజు చేస్తానన్న మాట నిజమే.. 

రైతును రాజు చేస్తానని ప్రతిన బూనిన సీఎం కేసీఆర్‌ ఆ మాటను నిజం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చినట్లుగానే తెలంగాణ రైతాంగం కోసం అపర భగీరథుడిలా పల్లం  నుంచి నీటిని ఎత్తులో ఉన్న ప్రాంతాలకు తీసుకొచ్చి సాగు నీరందించడం సామాన్య విషయం కాదు. రైతులు అప్పుతీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. 

- కొర్రి ప్రభాకర్‌ యాదవ్‌, రైతు, బీర్కూర్‌

బీడు భూములను తడపడానికే.. 

గోదావరి నది నుంచి అనవసరంగా సముద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల నీళ్లతో తెలంగాణ బీడు భూములను తడపడానికి సీఎం కేసీఆర్‌ మూడేండ్లుగా కష్టపడుతున్న తీరును కళ్లారా చూస్తున్నాం. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడినా.. మొక్కవోని దీక్షతో తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు మన కండ్ల ముందే జలసిరులు కురిపిస్తున్నది. కొండపోచమ్మ సాగర్‌ను ప్రారంభించిన కేసీఆర్‌ త్వరలో నిజాంసాగర్‌లోకి తెచ్చే ప్రయత్నం చేస్తుండడంతో రైతులంతా ఎంతో సంతోషపడుతున్నారు.

- బలరాం, రైతు, దూప్‌సింగ్‌తండా

logo