గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - May 29, 2020 , 02:08:02

నిజాంసాగర్‌కు కొండంత అండ

నిజాంసాగర్‌కు  కొండంత అండ

  • మేడిగడ్డ నుంచి అర కిలోమీటర్‌ ఎత్తుకు గోదావరి జలాలు
  • దిశను మార్చుకుని కొండపోచమ్మసాగర్‌లోకి పరుగులు
  • ఏడాది కాలంలో హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు కాళేశ్వరం నీళ్లు
  • చురుగ్గా సాగుతున్న 18 కిలో మీటర్ల కాలువల తవ్వకాలు

నిజాంసాగర్‌ను కాళేశ్వర జలాలు త్వరలోనే తాకనున్నాయి. సీఎం కేసీఆర్‌ తలపెట్టిన భగీరథ ప్రయత్నంలో కీలక ఘట్టం  నేడు కొండ పోచమ్మ సాగర్‌ వద్ద ఆవిష్కృతం కానున్నది.  గోదారమ్మ తన దిశను మార్చుకుని పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించనుంది. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల వద్ద ప్రారంభమయ్యే గోదావరి జలాల ప్రయాణం 624 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మలోకి అరకిలో మీటర్‌ ఎత్తుకు ఎగిసి పడబోతున్నది.  కొండపోచమ్మ సాగర్‌ వరకు కాళేశ్వరం జలాలు రావడంతో నిజాంసాగర్‌ ఆయకట్టు పరిధిలోని రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తే ఏడాదిలో నిజాంసాగర్‌కు హల్దీవాగు ద్వారా గోదావరి జలాలు తరలిరానున్నాయి. ప్యాకేజీ-18 ద్వారా ఇప్పటికే కాలువల నిర్మాణం వేగంగా సాగుతున్నది.  నిజాంసాగర్‌కు నీళ్లు వచ్చి చేరితే లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.  

 నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఏటా కొన్ని లక్ష ల క్యూసెక్కుల వర్షపు నీరు గోదావరి నది వెంట సముద్రం లో కలుస్తున్నాయి. తలాపున జీవనది ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ర్టానికి జల సందడి తీసుకువచ్చిన దాఖలాలు గతంలో ఏనాడూ లేదు. స్వరాష్ట్రంలో ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండడంతో  తెలంగాణ ప్రజల గోసను తీర్చడం కోసం భగీరథ ప్రయత్నానికి పూనుకున్నారు. కేసీఆర్‌ తలపెట్టిన కాళేశ్వర ప్రాజెక్టు సరిగ్గా మూడేండ్లలో రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసుకుని ఎన్నో అడ్డంకులు దాటుకుని దశాబ్దాలుగా ఎ దురు చూస్తున్న లక్షలాది బీడు భూములకు పారుతున్నది. ఇందుకోసం గోదారమ్మ తన దిశను మార్చుకుంది. పల్లం నుంచి ఎత్తుకు ప్రవాహాన్ని మళ్లించింది. మెట్ట భూములను తడిపేందుకు ఎండిన చెరువులను నింపి రైతన్నల పొలాల్లో సిరులు పండించేందుకు వందల కిలోమీటర్లు దాటుకుని వ స్తున్నది. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల వద్ద ప్రారంభమయ్యే గోదావరి జలాల ప్రయాణం 624 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మలోకి అర కిలో మీటర్‌ ఎత్తుకు ఎగిసి పడబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు కీలకమైన ఘట్టానికి తెర లేవనుంది. అద్భుత దృశ్య కావ్యం కొండపోచమ్మ సాగర్‌ వద్ద నేడు ఆవిష్కృతం కానుంది.

నిజాంసాగర్‌కు గోదావరి పరుగులు ఇలా...

మేడిగడ్డ నుంచి తరలించిన గోదావరి జలాలు నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు సరికొత్త కళను తీసుకురాబోతున్నది. వరద నీరు రాకపోవడంతో బోసిపోతున్న చారిత్రక ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లతో సార్థకత చేకూరబోతున్నది. మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను ఎల్లంపల్లికి అక్కడి నుంచి మిడ్‌ మానేరుకు తరలిస్తారు. 25 కిలో మీటర్ల సొరంగ మార్గం ద్వారా జలాలు ప్రవేశించి సిద్ధిపేట జిల్లా సరిహద్దులోని అనంతగిరి రిజర్వాయర్‌ మీదుగా శ్రీరంగనాయకసాగర్‌లోకి చేరవేస్తారు. ఇక్కడి నుం చి గోదావరి జలాలను మల్లన్నసాగర్‌ మీదుగా కొండపోచమ్మసాగర్‌కు తరలించాల్సి ఉండ గా మల్లన్నసాగర్‌ వద్ద పను లు జరుగుతున్నందున ప్రత్యే క మార్గం ద్వారా కాళేశ్వరం నీటిని శ్రీరంగనాయకసాగర్‌ నుంచి కొండ పోచమ్మ సాగర్‌కు మళ్లిస్తున్నారు. కొండపోచమ్మ నుంచి ప్యాకేజీ 18 కిం ద కాలువల ద్వారా హల్దీ వా గు ద్వారా నిజాంసాగర్‌కు కా ళేశ్వరం జలాలు చేరుతాయి. ఈ పనులు పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆరు కిలో మీటర్ల మేర కాలువల తవ్వగా.. మరో 12కిలోమీటర్ల మేర కాలువ తీయాల్సి ఉంది. వచ్చే జూన్‌నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

నిజాంసాగర్‌కు వరప్రదాయినిగా...

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరప్రదాయినిగా మారనున్నది. ప్రస్తుతం అతి కష్టం మీద నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీళ్లు చేరుతున్నాయి. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 0.830 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. దీని కింద ఆయకట్టు 2.30 లక్షల ఎకరాలుండగా ఎగువ నుంచి వరద లేక  ఏండ్లు గా  నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండడం లేదు. నాలుగేండ్ల క్రితం 2017 సంవత్సరంలో  10 టీఎంసీల నీరు మాత్రమే చేరగా ఆ తర్వాత  జలకళ తప్పింది. గత వానకాలంలో వర్షా లు  సమృద్ధిగా కురవడంతో పోచారం ప్రాజెక్టు మత్తడి పోయడంతో నిజాంసాగర్‌లోకి కాసింత నీళ్లు వచ్చి చేరాయి.

2 టీఎంసీల మేర వరద నీరు చేరుకుంది. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరైన సింగితం, కళ్యాణి జలాశయాలు నిండడంతో ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందింది. కొండపోచమ్మ సాగర్‌ వర కు కాళేశ్వరం జలాలు రావడంతో నిజాంసాగర్‌ ఆయకట్టు పరిధిలోని రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ విజయవంతమైతే నిజాంసాగర్‌కు హల్దీవాగు ద్వారా గోదావరి జలాలు తరలిరానున్నాయి. నిజాంసాగర్‌కు నీళ్లు వచ్చి చేరితే లక్షలాది సాగు భూములు పచ్చబడనున్నాయి. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలకు నీరందించేందుకు ప్యాకేజీ 20, 21, 22 కింద పనులు చేపడుతున్నారు. వీటిలో ప్యాకేజీ 20,21 పనులు పూర్తిగా నిజామాబాద్‌ జిల్లాకు సాగునీటి అందించేందుకు చేపట్టబోతున్నది. వీటిలో ప్యాకేజీ 20 పూర్తిగా టన్నెల్‌ తవ్వకాలకు సంబంధించింది. నిజామాబాద్‌ జిల్లాలో ఆయకట్టుకు నీరందించేందుకు నిర్దేశించిన ప్యాకేజీ 21 పనులు వేగంగా సాగుతున్నాయి. 


logo