గురువారం 02 జూలై 2020
Nizamabad - May 28, 2020 , 06:33:17

మడులు మురిసేలా..

మడులు మురిసేలా..

  • నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో 
  • వాగులపై పది చెక్‌డ్యాంల నిర్మాణం 
  • రూ.51కోట్లు మంజూరు
  • స్థలాల గుర్తింపు.. టెండర్ల ప్రక్రియపూర్తి 
  • సద్వినియోగంకానున్న స్థానిక నీటి వనరులు 
  • పెరగనున్న భూగర్భ జలమట్టం 
  • నీటి వనరుల సద్వినియోగమే లక్ష్యం: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

నిజామాబాద్‌ రూరల్‌: వానకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ప్రవహిస్తున్న వాగులు, వాటిపై చెక్‌డ్యాంల నిర్మాణంపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. పంటలకు నీటిని మళ్లించడంతోపాటు భూగర్భ జలాలు పెరుగుతాయని భావించి ఏఏ వాగులపై చెక్‌డ్యాం నిర్మించే అవకాశాలు ఉన్నాయి? అవసరమైన నిధులు తదితర అంశాలవారీగా నివేదికలను సిద్ధం చేయాలని ఎనిమిది నెలల క్రితం ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. ఆ నివేదికలను ప్రభుత్వానికి అందజేసిన ఎమ్మెల్యే 10 చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. 

స్పందించిన  ప్రభుత్వం  ఈ ఏడాది మార్చిలో రూ.51 కోట్లు మంజూరుచేసింది. నియోజకవర్గంలోని సిరికొండ, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల్లోని వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణానికి స్థలాల టెండర్ల ప్రక్రియసైతం పూర్తయ్యింది. తమ కండ్ల ముందు నుంచే కిందికి వెళ్లిపోతున్న నీటిని వ్యవసాయభూముల్లోకి మళ్లించడంతోపాటు, భూగర్భ జలమట్టం పెరగడానికి ఎంతో దోహదం చేసే చెక్‌డ్యాంల నిర్మాణ పనులు చేపట్టనుండడంతో రైతులు సంబురపడుతున్నారు. 

చెక్‌డ్యాంలు నిర్మించేది ఇక్కడే..

రూ.4.15 కోట్ల వ్యయంతో నిజామాబాద్‌రూరల్‌ మండలం పాల్దా గ్రామశివారులోని పూలాంగ్‌ వాగుపై, రూ.4.50 కోట్లతో ఆకుల కొండూర్‌ వద్ద పూలాంగ్‌వాగుపై, రూ.8.79 కోట్లతో సిరికొండ మండలం చిన్నవాల్గోట్‌ గ్రామ శివారులోని పెద్దవాగుపై, రూ.4.1 కోట్లతో కొండూర్‌ శివారులోని కప్పలవాగుపై చెక్‌డ్యాంలు నిర్మించనున్నారు. రూ.4.38 కోట్లతో ధర్పల్లి మండలంలోని రామడుగు శివారులోని పెద్దవాగుపై, రూ.6.70 కోట్లతో మైలారం పెద్దవాగుపై, రూ.4.8కోట్లతో డిచ్‌పల్లి మండలం సుద్దులం శివారులో వాగుపై, రూ.5.65 కోట్లతో కొరట్‌పల్లి-సుద్దులం గ్రామాల మధ్య పెద్దవాగుపై, రూ.2.70 కోట్లతో రాంపూర్‌లోని బుగ్గ వాగుపై, రూ.5.36 కోట్లతో జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్‌ గ్రామ శివారులోని పెద్దవాగుపై చెక్‌డ్యాంలను నిర్మించనున్నారు.

నీటివనరుల సద్వినియోగమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

నీటి వనరుల సద్వినియోగం సీఎం కేసీఆర్‌ లక్ష్యం. ఇందులో భాగంగానే వాగుల ద్వారా వృథాగా పోయే నీటిని నిల్వ ఉంచేందుకు చెక్‌డ్యాంల నిర్మాణానికి పుష్కలంగా నిధులు మంజూరు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.12వేల కోట్లు మంజూరు చేయగా, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి రూ.51కోట్లు మంజూరయ్యాయి. సాగునీటివనరులను సద్వినియోగం చేయడంలో సీఎం కేసీఆర్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

- బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే


logo