సోమవారం 13 జూలై 2020
Nizamabad - May 28, 2020 , 06:29:21

కళకళలాడిన పసుపు మార్కెట్‌

కళకళలాడిన పసుపు మార్కెట్‌

  • పునఃప్రారంభమైన పసుపు కొనుగోళ్లు
  • ఆరువేల క్వింటాళ్లు విక్రయించిన రైతులు 
  • 3లక్షల క్వింటాళ్ల పసుపు రావొచ్చని అంచనా..
  • కరోనా నేపథ్యంలో ప్రతిరైతుకూ థర్మల్‌ స్క్రీనింగ్‌
  • ఒకే గేటు నుంచి రాకపోకలు

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ ఆదేశాల మేరకు పసుపు కొనుగోళ్లు పునఃప్రారంభం కావడంతో జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డు బుధవారం రైతులతో కళకళలాడింది. కొనుగోళ్లు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా సందడి నెలకొంది. మొదటి రోజు రైతులు ఆరు వేల క్వింటాళ్ల పసుపును విక్రయించారు. క్వింటాల్‌ పసుపు రూ.4500 నుంచి రూ.5500 ధర పలికింది. కరోనావైరస్‌వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రైతులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తరువాతే మార్కెట్‌యార్డులోకి అనుమతించారు.   ప్రధాన గేటు-1 తెరిచి రైతులు తీసుకువచ్చిన పసుసు, నువ్వులు ఇతర పంట దిగుబడులను విక్రయించుకునేందుకు అనుమతించారు. సాయం త్రం 4గంటల వరకు మార్కెట్‌యార్డుకు పసుపు తీసుకురావాలని, మరుసటి రోజు ఉదయం 11గంటలకు బిడ్డింగ్‌ నిర్వహించి మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు సూచిస్తున్నారు. కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు సాయత్రం ఆరుగంటల లోపు తమ స్వగ్రామాలకు చేరుకోవాలని, మార్కెట్‌యార్డులోని రైతువసతిగృహంలో ఉండడానికి వీలుండదని స్పష్టం చేశారు. నిజామాబాద్‌, నిర్మల్‌, మెట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి మూడు లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఊపిరిపీల్చుకున్న రైతులు!

ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో పసుపు క్రయవిక్రయాలు జోరుగాసాగుతాయి! ఈ ఏడాది కరోనావైరస్‌ వ్యాప్తి కారణంగా మార్చి 18 నుంచి మార్కెట్‌యార్డును మూసివేయడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో కొందరు రైతులు కోల్డ్‌ స్టోరేజీల్లో సుమారు 2500 క్వింటాళ్లు, మరికొందరు తమ వద్దే సుమారు 2లక్షల క్వింటాళ్ల పసుపును నిల్వ చేశారు. కరోనా వైరస్‌వ్యాప్తి కారణంగా ఎంతోకష్టపడి పండించిన పంట ఎలా విక్రయించాలని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు కొనుగోళ్లు ప్రారంభం కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. 

భరోసా ఇచ్చిన మంత్రి వేముల

లాక్‌డౌన్‌ కారణంగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోయి దిక్కుతోచనిస్థితిలో ఉన్న రైతులకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆందోళన చెందొద్దని, రెండుమూడు రోజుల్లో మార్కెట్‌యార్డును పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇందులోభాగంగా  రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్‌కు వివరించారు. సీఎం ఆదేశాలతో మార్కెట్‌యార్డు పునఃప్రారంభమైంది.logo