మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - May 25, 2020 , 00:45:45

జోరుగా.. హుషారుగా..

జోరుగా.. హుషారుగా..

బాన్సువాడ రూరల్‌ / వేల్పూర్‌ / మోపాల్‌ / ఖలీల్‌వాడి / విద్యానగర్‌ / భీమ్‌గల్‌ / ఇందూరు : ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు హుషారుగా పాల్గొంటున్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లోని అధికారిక నివాసంలో మొక్కలకు నీళ్లు పట్టారు. పరిసరాలను శుభ్రం చేశారు. ఆయనతోపాటు కుటుంబీకులు చెత్తాచెదారాన్ని తొలగించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లోని తన ఇంటి వద్ద పరిసరాలను శుభ్రం చేశారు. ఇంటి ముందు ఉన్న చెత్తను తొలగించి, మొక్కలకు నీరు పట్టారు. డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి బాన్సువాడ పట్టణంలోని పదో వార్డులో చెత్తా చెదారాన్ని తొలగించారు. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీళ్లు పట్టారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, కౌన్సిలర్లు ఉన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ తన నివాసంలో చెత్తా చెదారాన్ని తొలగించారు. మొక్కలకు నీరు పట్టారు. నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతూ కిరణ్‌ నగరంలోని 44వ డివిజన్‌ వాసవి అపార్ట్‌మెంట్‌లో ప్రజలకు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించారు. టైర్లు, కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి శుభ్రం చేశారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వాటర్‌ ట్యాంకును శుభ్రపరిచారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో వాటర్‌ ఫౌంటేన్‌లోని నీటిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి తొలగించారు. 47వ వార్డు కౌన్సిలర్‌ గెరిగంటి స్వప్న లక్షీనారాయణ నిలిచి ఉన్న నీటిని తొలగించారు. భీమ్‌గల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ 3వ వార్డులో మురికి కాలువలో ఆయిల్‌ బాల్స్‌ వేశారు.  మున్సిపల్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ స్టిక్కర్లను అతికించారు. 


logo