శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - May 25, 2020 , 00:38:20

‘తారక’ మంత్రం!

‘తారక’ మంత్రం!

‘ఆదివారం10 గంటలకు 10 నిమిషాల’ కార్యక్రమానికి విశేష స్పందన

 డెంగీ ముప్పు నుంచి బయటపడేందుకు వినూత్న కార్యక్రమం

 మూడు వారాలుగా జోరుగా పాల్గొంటున్న  ప్రముఖులు

 పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన

 దోమల నివారణకు నగర, పురపాలక సంఘాల్లోనూ చర్యలు షురూ 

సీజనల్‌ వ్యాధులను నివారించేందుకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తున్నది. ప్రముఖులంతా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వరుసగా మూడో ఆదివారం సైతం ప్రజాప్రతినిధులు తమ నివాస ప్రాంతాల్లో పరిసరాలను శుభ్రం చేశారు. మరోవైపు ఉన్నతాధికారులు మంత్రి కేటీఆర్‌ పిలుపును అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారు. కార్యాలయాల్లోని చెత్తను తొలగిస్తున్నారు. కరోనా వంటి కష్టకాలంలో దోమలను నివారించడమే డెంగీకి చక్కని మందు అని వారంతా ఎలుగెత్తి చాటుతున్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో, మంత్రి ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లో ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. 

-నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


సీజనల్‌ వ్యాధుల నివారణకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన పిలుపునకు అపూర్వ స్పందన లభిస్తున్నది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో ప్రముఖులంతా క్రమం తప్పకుండా పాల్గొంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులందరూ ప్రారంభం రోజు నుంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముచ్చటగా మూడో ఆదివారమూ ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు జోరుగా తమ నివాస ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రం చేస్తూ కనిపించారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగంలోని ఉన్నతాధికారులు సైతం మంత్రి కేటీఆర్‌ పిలుపును అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారు. తమ క్యాంపు కార్యాలయాల్లో చెత్తను స్వయంగా తొలగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా వంటి కష్టకాలంలో దోమలను నివారించుకోవడమే డెంగీ నివారణకు మార్గమని వారంతా ఎలుగెత్తి చాటుతున్నారు.  

పొంచి ఉన్న డెంగీ ముప్పు

కరోనా వైరస్‌తో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు డెంగీ సమస్య మరింత కలవరపెడుతున్నది. రెండింటి ప్రాథమిక లక్షణం జ్వరమే అయినప్పటికీ శరీర ఉష్ణోగ్రత పెరగ్గానే ఏ వైరస్సో తెలియక బాధితులు గందరగోళానికి గురవుతున్నారు. కరోనా భయంతో డయల్‌ 104ను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలకు పట్టుబడుతున్నారు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేటు దవాఖానలు పరీక్షల పేరిట అందినకాడికి దండుకుంటున్నాయి. జూన్‌లో పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. దోమకాటుతో వచ్చే డెంగీ వ్యాధితో కొందరి ప్రాణాలు పోతుంటే ఎంతో మంది మృత్యువు అంచుల వరకు వెళ్లి కోలుకొని బయట పడుతున్నారు. ఈ క్రమంలో ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. వర్షకాలం వస్తే చాలు జిల్లా వాసులు ఏటా వేలాది మంది డెంగీతో దవాఖానల పాలవుతున్నారు. ఇప్పటి నుంచే ప్రజలు, పాలకులు, అధికారులు అప్రమత్తం కాకుంటే వచ్చే వర్షకాలంలో డెం గీ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లేనని స్ప ష్టం అవుతున్నది. 

దోమలు ప్రబలకుండా చూడాలి

దోమలు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే డెంగీ నివారణ సాధ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాల్లో మూడేండ్లుగా ప్రబలుతున్న దీని నియంత్రణ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సవాలుగా మారింది. వచ్చే పదేండ్లలోగా దేశంలో దోమలు లేకుండా చేయాలన్నది ప్రభుత్వాల లక్ష్యం. దోమల జీవితకాలం కేవలం నెల రోజుల్లోపే. ఎనాఫిలిస్‌ దోమ 2 నుంచి 3 కిలో మీటర్లు సంచరిస్తుంది. డెంగీకి కారకమయ్యే ఎడిస్‌ ఈజిప్టి అనే దోమ అర కిలో మీటర్‌ దూరం వరకు సంచరిస్తుంది. మురుగు కాల్వల్లో పూడిక తీసి, బ్లీచింగ్‌ చల్లాలి. నిర్ణయించిన సమయంలో ఫాగింగ్‌ చేయించాలి. చెరువులు, బావులు, పెద్ద నీటి మడుగుల్లో గంబూషియా చేప పిల్లలను వదలడంతో దోమలను నాశనం చేయొచ్చు. చెరువులు, కాలువల్లో పెరిగే గుర్రపు డెక్కను సమూలంగా తొలగించాలి. ఇంటి ఆవరణలో పనికి రాని వస్తువులు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పాత సామగ్రిలో నీరు నిల్వ లేకుండా చూడాలి. ఇండ్లల్లో నీరు నింపుకునే పాత్రలను వారానికోసారి ఖాళీ చేసి ఆరబెట్టుకుంటే దోమలు దరి చేరవు.

ప్రజల్లో పెరుగుతున్న అవగాహన

కేటీఆర్‌ పిలుపును అందుకున్న ప్రముఖులందరూ తూ.చ తప్పకుండా గడిచిన మూడు వారాలుగా ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. తాము నివాసం ఉంటున్న ప్రాంతాల్లో చెత్తా చెదారాన్ని పూర్తిగా తొలగించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి హైదరాబాద్‌లో స్వయంగా ఈ కార్యక్రమంలో హుషారుగా పాల్గొంటున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సైతం తమ స్వగ్రామం వేల్పూర్‌లో జోరుగా కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పటివరకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం చురుగ్గా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొని ఆదర్శంగా నిలుస్తుండడంతో ప్రజల్లోనూ మార్పు కనిపిస్తున్నది. పురపాలక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమంతో నగరపాలక సంస్థ, పురపాలక సంస్థల పరిధిలోనూ దోమల నివారణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల ముందస్తు ఏర్పాట్లకు సమాయత్తం అవుతున్నారు.