గురువారం 04 జూన్ 2020
Nizamabad - May 24, 2020 , 01:43:44

కవితమ్మ కృషి..ఆదుకున్న భృతి

కవితమ్మ కృషి..ఆదుకున్న భృతి

 కరోనా కష్టాల్లో  బీడీ కార్మికులకు భరోసా 

 నిజామాబాద్‌ జిల్లాలో 96,269 మంది లబ్ధిదారులు

 రాష్ట్ర వ్యాప్తంగా 4.07 లక్షల మందికి లబ్ధి

 ప్రతి నెలా రూ.82.21 కోట్ల చెల్లింపు

చెయ్యాడితే గానీ డొక్కాడని బీడీ కార్మికులకు ఆసరా పింఛన్‌ ఆదరువుగా మారింది. కరోనా కష్ట కాలంలో ఆదుకుంటున్నది. దీనంతటికీ మాజీ ఎంపీ కవిత పుణ్యమే అని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో పొగచూరిన బీడీ కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కవిత కృషిచేశారు. చాలీచాలని కూలితో బతుకు వెళ్లదీస్తున్న బీడీ కార్మికులకు జీవనభృతి ఇచ్చేలా తన తండ్రి కేసీఆర్‌ను ఒప్పించారు. తెలంగాణ వస్తే బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తామని 2014లో ఎన్నికల్లో ప్రకటన చేయించారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్‌ బీడీ కార్మికులకు ఆసరా పింఛన్‌ వర్తింపజేస్తున్నారు. అప్పటి కవిత ముందు చూపు ప్రస్తుతం బీడీ కార్మికులకు భరోసా నిస్తున్నది.

నిజామాబాద్‌ / నమస్తే తెలంగాణ


సీఎం కేసీఆర్‌ మానవీయ కోణంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కరోనా విపత్తు కాలంలో ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే అమలవుతున్న బీడీ కార్మికులకు జీవనభృతి పథకం ఆపత్కాలంలో అండగా మారింది. దీనస్థితిలో ఉన్న బీడీ కార్మికులకు జీవనభృతి ఇచ్చేలా తన తండ్రి కేసీఆర్‌ను ఒప్పించారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ వస్తే బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తామని 2014లో నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌లో కల్వకుంట్ల కవిత, ప్రస్తుత రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బీడీ కార్మికుల ఇబ్బందులు వివరించి కేసీఆర్‌తో జీవనభృతిని ప్రకటింపజేశారు.

రెండింతలైన జీవనభృతి

తొలుత బీడీ కార్మికులకు రూ.వెయ్యి జీనవభృతి అందింది. 2019 నుంచి ఈ జీవనభృతిని రూ.2,016కు పెంచి అందిస్తున్నారు. చేతినిండా పని లేకున్నా జీవనభృతి పథకం బీడీ కార్మికులను ఆదుకుంటూ వస్తున్నది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావంతో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో బీడీ కార్ఖానాలు 18 రోజులుగా బంద్‌లో ఉన్నాయి. ఫలితంగా కార్మికులు ఖాళీగా ఉంటూ ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఇలాంటి కష్ట కాలంలో దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు జీవనభృతి భరోసానిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 4,0,7,801 మంది బీడీ కార్మికులకు జీవనభృతి అందుతున్నది. నిజామాబాద్‌ జిల్లాలో 96,269 మంది బీడీ కార్మికులకు జీవనభృతి కల్పిస్తున్నారు. 

పది జిల్లాల్లో జీవనభృతి 

రాష్ట్ర వ్యాప్తంగా బీడీలు చుడుతూ ఇదే జీవనాధారంగా బతికే కార్మికులు చాలా మంది ఉన్నారు. అయితే నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా బీడీ కార్మికులుండడం గమనార్హం. ప్రభుత్వం అందిస్తున్న జీవనభృతితో రాష్ట్ర వ్యాప్తంగా 4,0,7,801 మంది బీడీ కార్మికులకు జీవనభృతి అందుతుండగా నిజామాబాద్‌ జిల్లాలో ఈ సంఖ్య 96,269 మంది వరకు ఉన్నది. వీరందరికీ ఈ ఆపత్కాలంలో జీవనభృతి రూపంలో అందుతున్న ఆసరా పింఛన్‌ కొండంత అండగా నిలుస్తున్నది. అత్యవసరాలకు పనికొస్తున్నది. కష్టకాలంలో ఊతకర్రలా ఆసరాగా నిలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్‌తో కలిపి పది జిల్లాల్లో అత్యధికంగా బీడీ కార్మికులు ఉన్నారు. ఈ జీవనభృతి ద్వారా లబ్ధిపొందుతున్న వారిలో నిజామాబాద్‌ టాప్‌లో ఉండగా.. జగిత్యాలలో 89,377 మంది జీవనభృతి అందుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలో నిర్మల్‌లో 62,909, సిరిసిల్ల జిల్లాలో 43,502, కామారెడ్డిలో 37,046, సిద్దిపేటలో 34,392, మెదక్‌ జిల్లాలో 9,639, కరీంనగర్‌ జిల్లాలో 9,368, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 7,069, ఆదిలాబాద్‌ జిల్లాలో 5,526 మంది బీడీ కార్మికులకు జీవనభృతి అందుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా జీవనభృతి కింద ప్రభుత్వం రూ.82.21 కోట్లను చెల్లిస్తున్నది. ఇందులో ఒక్క నిజామాబాద్‌ జిల్లాకు రూ.19.40 కోట్లను బీడీ కార్మికులు ప్రతి నెలా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రం మొత్తంలో 23.60 శాతం మంది లబ్ధిదారులు జిల్లాలోనే ఉన్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన మేలును ఈ కష్టకాలంలో బీడీలు చుట్టే అక్కలు యాది చేసుకుంటున్నారు. 

లాక్‌డౌన్‌లో ఎంతో ఆదుకుంటున్నది

బీడీ కార్మికులను జీవనభృతి ఆర్థికంగా ఆదుకుంటున్నది. 18 రోజులుగా లాక్‌డౌన్‌తో పనిలేకుండా పోయింది. ఇలాంటి సమయంలో బీడీ కార్మిక పింఛన్‌ మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. 

-శెట్ల శోభ, ముప్కాల్‌

కవితక్క కృషి ఫలితం

బీడీ కార్మికుల కోసం ఆలోచించి కల్వకుంట్ల కవిత ఆనాడు అందించిన కృషి ఫలితం ఇలాంటి సమయంలో ఎంతో తోడ్పడుతున్నది. బీడీ కార్మికులకు అన్ని వేళలా ఉపయోగపడుతున్న జీవనభృతి పథకాన్ని అందించినందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కవితక్కకు ధన్యవాదాలు. 

- సరోజ, పోచంపాడ్‌


logo