గురువారం 28 మే 2020
Nizamabad - May 23, 2020 , 02:17:13

ఇందూరులో మళ్లీ కరోనా కలకలం

ఇందూరులో మళ్లీ కరోనా కలకలం

ముంబై నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్‌

గాంధీ దవాఖానకు తరలించిన అధికారులు

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు చేరిన వారి నుంచి పొంచి ఉన్న ముప్పు 

హోం క్వారంటైన్‌లో 4,300 మంది 

నిరంతర పర్యవేక్షణ..  వైరస్‌ లక్షణాలు కనిపిస్తే టెస్టులు 

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ : నిజామాబాద్‌ జిల్లాలో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూడడం కలకలం రేగింది. లాక్‌డౌన్‌ సడలింపులతో జిల్లాకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సడలింపులతో ఇతర ప్రాం తాల నుంచి వస్తున్న వారి నుంచి కొత్తగా ముప్పు ఎదురవుతున్నది. తాజాగా ముంబ యి నుంచి ఇందల్వాయికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఒక్కసారి గా జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అధికారు లు వెంటనే అతన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించడంతో పాటు అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ చేశారు. 

మహారాష్ట్ర నుంచి వచ్చేవారితో ముప్పు..!

మహారాష్ట్రలోని ముంబయితో పాటు ఇతర ప్రాం తాల నుంచి ఇక్కడి వస్తున్న జిల్లావాసులను సరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి పంపుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు లేకపోతేనే పంపించేస్తున్నారు. కానీ, కొందరిలో వైరస్‌ వచ్చిచేరినా.. రోగ లక్షణాలు వెంటనే బయట పడడం లేదు. దీంతో ప్రభుత్వం వీరిని కచ్చితంగా 14రోజు ల హోం క్వారంటైన్‌ చేయాలని, వారిని  ఏఎన్‌ఎం లు, ఆశ కార్యకర్తలతో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది. ఇందల్వాయిలో ఇలా క్వారంటైన్‌ చేసిన వారిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ తేలింది. మొదట వైరస్‌ లక్షణాలతో జిల్లాకేంద్ర దవాఖానలో చేర్పించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించారు. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ దవాఖానకు తరలించారు. దీంతో జిల్లాలో మళ్లీ కొత్తగా ఓ పాజిటివ్‌ కేసు వెలుగుచూసింది. గతంలో జిల్లాలో మొత్తం 61 మంది కరోనా పాజిటివ్‌తో గాంధీ దవాఖానలో చికిత్స పొందారు. వారంతా కోలుకొని క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. నిజామాబాద్‌ జిల్లావ్యాప్తం గా మే 1 నుంచి ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో పనిచేసి జిల్లాకు తిరిగి వచ్చిన 4,300మందిని హోం క్వారంటైన్‌ చేశారు. ఆశ కార్యకర్తలు రోజుకు రెండుసార్లు వీరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పది మంది ఆశ కార్యకర్తలకు ఓ ఏఎన్‌ఎంను ఇన్‌చార్జిగా నియమించారు. ధాన్యం కొనుగోళ్లలో బిజీగా ఉన్న ఎంపీడీవోలను ఆ విధులను తప్పించారు. వారికి కరోనా పర్యవేక్షణ బాధ్యతలను  కలెక్టర్‌ అప్పగించారు. ఇంటింటి సర్వే ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

హైరిస్క్‌ వారి గుర్తింపు...

చిన్నపిల్లలు, వయస్సు మీద పడినవారు, ధీర్ఘకాలిక రోగగ్రస్తులు.. ఇలాంటి కేటగిరీలను హైరిస్క్‌ జాబి తా కింద తీసుకొని సర్వేలో వేరుగా వివరాలు పొం దుపరిచారు.హైరిస్క్‌ జాబితాలో 2.50లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరూ బయటకు రావద్దని చెబుతున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జిల్లావాసులతో ముప్పు పొంచి ఉంది. దుబాయ్‌ నుంచి వస్తున్న జిల్లావాసి ఒకరికి ఎయిర్‌పోర్టులో టెస్ట్‌ చేయగా.. పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. ఇతన్ని కూడా గాంధీ దవాఖానకు పంపారు. దీంతో జిల్లాలో తాజాగా రెండు పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. లాక్‌డౌన్‌కు ముందు నుంచి జిల్లాలో ఉన్న వారు క్షేమమే అని భావించినా.. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వారితోనే ముప్పు వాటిల్లుతోంది. వీరితోనే మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. వీరిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జిల్లా యంత్రాంగం సైతం హోం క్వారంటైన్‌ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. చుట్టుపక్కల వారి ఫోన్‌ నెంబర్లను సేకరించి.. హోం క్వారంటైన్‌లో ఉంటున్నారా? లేదా? అని ఆరాతీస్తున్నది. కాగా, ఇప్పటికే హోం క్వారంటైన్‌ చేసిన 4,300 మందిలో ఎవరికి ఎప్పుడు రోగ లక్షణాలు బయటపడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 

294 మందికి హోం క్వారంటైన్‌ 

కోటగిరి: ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి లాక్‌డౌన్‌తో కోటగిరి మండలానికి చేరుకున్న 294 మందిని ఇప్పటికే హోం క్వారంటైన్‌ చేశారు. కొత్తగా మరో 21 మంది మండలంలోని ఆయా గ్రామాలకు చేరుకోగా.. హెల్త్‌ సూపర్‌వైజర్‌ కృష్ణవేణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది శుక్రవారం ఇంటింటికీ తిరిగి వారి చేతులకు స్టాంపింగ్‌ వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఇండ్లకు ‘ఎవరూ రావద్దు’ అనే స్టిక్కర్‌ వేశారు. అనంతరం కరోనా వైరస్‌, సీజనల్‌ వ్యాధులపై సూపర్‌వైజర్లు జ్యోతి, సాయికుమారి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించారు. 

నల్లవెల్లిని సందర్శించిన అధికారుల బృందం

డిచ్‌పల్లి(ఇందల్వాయి): ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో శుక్రవారం   మండ ల అధికారుల బృందం గ్రామా న్ని సందర్శించింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 15 రోజుల క్రితం ముంబయి నుంచి గ్రామానికి రాగా.. అతన్ని గ్రామస్తులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరం తో బాధపడు తుండడం తో కుటుంబీకులు అతన్ని హైదరాబాద్‌కు తరలించారు.గురువారం సాయంత్రం గాంధీ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం తహసీల్దార్‌ రమేశ్‌, ఎంపీడీవో రాములునాయక్‌, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శివప్రసాద్‌రెడ్డి నల్లవెల్లిని సందర్శించి బాధితుడు ఎవరెవ్వరితో కలిసి తిరిగాడో వివరాలు సేకరించారు. కొద్దిరోజుల పాటు గ్రామస్తులందరూ హోం క్వారంటైన్‌లో ఉండాలని, బయటి వ్యక్తులను గ్రామంలోకి రానివ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.  

కఠినంగా కర్ఫ్యూ అమలు

నిజామాబాద్‌ సిటీ: జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూడడంతో పోలీసులు కర్ఫ్యూను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే ప్రజలు బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. సాయంత్రం 7గంటల తర్వాత బయటకు వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కర్ఫ్యూ నుంచి కేవలం మీడి యా ప్రతినిధులు, అత్యవసర సేవల సిబ్బందికి మాత్ర మే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. రాత్రి 7గంటల తర్వాత కర్ఫ్యూ అమలులో ఉండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశా రు. అనుమతి ఉన్నవారిని మాత్రమే వదిలేసి, మిగతా వారి వాహనాలకు జరిమానా విధించి హెచ్చరించి వదిలేస్తున్నారు. అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో తనిఖీలు చేస్తున్నారు.  ఆటోలు ముగ్గురు, టాక్సీ లో నలుగురు కంటే ఎక్కువగా ప్రయాణిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ, చాలా ప్రాంతాల్లో ఆటోవాలాలు నిబంధనలు పాటించకుండా ప్రయాణికులకు  తరలిస్తున్నారు. దీంతో కరోనా ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిత్యం సాయంత్రం ఆటోలు, కార్లను తనిఖీ చేస్తున్నారు. నిబంధనలను పాటించని వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు.

కర్ఫ్యూ  వేళ బయట తిరగొద్దు.. 

రాత్రి 7గంటల నుంచి ఉదయం 6వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. రాత్రివేళల్లో అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేస్తున్నాం.  

-శ్రీనివాస్‌, నిజామాబాద్‌ ఏసీపీ


logo