మంగళవారం 26 మే 2020
Nizamabad - May 22, 2020 , 01:55:38

వరి సిరులు..!

వరి సిరులు..!

 ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

 ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిజామాబాద్‌,  కామారెడ్డికి ఆరో స్థానం  

 పంట అమ్ముకున్న రైతులకు నాలుగైదు రోజుల్లోనే నగదు జమ

ప్రైవేటు వ్యక్తుల మోసాలకు చెక్‌..అన్నదాతకు దక్కుతున్న ‘మద్దతు’

యాసంగి పంటలంటే గతంలో ఎంతో నిర్లక్ష్యం.

రైతుల్లోనూ ఎడతెగని నిరాశ. సాగునీటికి తోడు కరెంట్‌ కటకటతో పంటలు వేయాలంటేనే భయం. అలాంటి దుస్థితి నుంచి టీఆర్‌ఎస్‌ సర్కారు అమలు చేసిన సంస్కరణలతో రాష్ట్రం అంతటా పచ్చ తోరణమైంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పుష్కలంగా నీటి లభ్యత ఉండడం, మిషన్‌ కాకతీయతో చెరువులన్నీ నిండుకుండల్లా మారడంతో యాసంగిలో బీడు భూములు కనిపించకుండా పోయాయి. దీనికి తోడు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం కొనుగోలు చేసి అన్నదాతలకు కొండంత అండగా నిలిచింది. నిజామాబాద్‌ జిల్లా 4.64లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలువగా... కామారెడ్డి జిల్లా 2లక్షల 93వేల 545 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణతో ఆరో స్థానంలో నిలిచింది.  

-కామారెడ్డి, నమస్తే తెలంగాణ

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వరి సాగు భారీగా ఉంటుంది. గడిచిన యాసంగిలోనూ భారీగా పంటలు సాగు చేయడంతో గ్రామ గ్రామాన సిరుల పంట కురుస్తున్నది. ధాన్యాగారమైన ఉభయ జిల్లాలు రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు వహించడం ద్వారా ప్రక్రియ అంతా సులువుగా సాగింది. 20వ తేదీ వరకు రాష్ట్రంలో ధాన్యం సేకరణలో ఆయా జిల్లాల పరిస్థితిని గమనిస్తే నిజామాబాద్‌ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 4.64లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 93వేల 545 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడం ద్వారా ఆరో స్థానంలో నిలిచింది.  

మూడు లక్షల 5వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 98శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 317 కేంద్రాలను ప్రారంభించారు. 25 ఐకేపీ కేంద్రాల్లో 22,196 మెట్రిక్‌ టన్నులు, 292 పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా 2.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 72వేల 130 మంది రైతుల నుంచి రూ.546 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ఇప్పటికే సేకరించగా.. 92 శాతం మేర చెల్లింపులు పూర్తయ్యాయి.

దళారుల దందాకు చెక్‌..

ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కే అవకాశం ఉన్నప్పటికీ రైతులను గతంలో దళారులు మాయ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వ్యాపారులు, ఇతర మధ్యవర్తులు రైతుల పేరిట ధాన్యాన్ని విక్రయించకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానం చేసి రైతు ఖాతాల్లోనే చెల్లింపులు జరిగేలా చూస్తున్నారు. కేవలం 48 గంటల్లోనే రైతులు విక్రయించిన పంటకు మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తున్నది. గరిష్ఠంగా నాలుగైదు రోజుల్లోపే నగదు రైతుకు చేతికి అందుతుండడం విశేషం.

కరోనా కష్టకాలంలోనూ.. 

ఓ వైపు ప్రపంచాన్ని  కరోనా వైరస్‌ వణికిస్తున్న సమయంలోనూ రాష్ట్రంలో జోరుగా పంట కొనుగోళ్లు జరిగాయి. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రైతుల చెంతకే వెళ్లి ధాన్యాన్ని సేకరించారు. ఏటా కొనుగోలు కేంద్రాల వద్ద జరిగే చిన్నపాటి ఆందోళనలు కూడా ఈసారి ఎక్కడా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. బీహార్‌ వలస కూలీల కొరత కనిపించినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలతో స్థానిక యువతను ధాన్యం సేకరణకు వాడుకున్నారు. వెనువెంటనే ధాన్యాన్ని తూకం వేయడం, తరలించడం వంటివి చకచకా పూర్తి చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. భౌతిక దూరం పాటించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్కులు ధరిస్తేనే కొనుగోళ్లు జరిగేలా నిబంధన పెట్టి ప్రశాంతంగా ధాన్యాన్ని సేకరించారు. ఇంతటి కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చూపిన చొరవ, శ్రద్ధాసక్తులతో రైతు లోకమంతా జేజేలు పలుకుతున్నది.

98శాతం ధాన్యం సేకరణ పూర్తి...

కామారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపునకు చేరింది. 98శాతం మేర పంట ఉత్పత్తులను సకాలంలో సేకరించాం. కలెక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి ఆదేశాల మేరకు వేగవంతంగా ప్రక్రియను చేపట్టాం. రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకున్నాం. కొద్ది రోజుల్లోనే 100శాతం సేకరణ కూడా పూర్తవుతుంది. 3.05లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.98 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాం.

- జితేంద్ర ప్రసాద్‌, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌

రైతులకు రూ.475.27 కోట్లు చెల్లింపు : మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా గురువారం వరకు 39,958 మంది రైతులకు రూ. 475.27 కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 84శాతం మేర ధాన్యం సేకరించామని, మిగతా ధాన్యాన్ని త్వరగా సేకరించాలని అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణ పూర్తయిన 105 కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 5.55 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయ గా.. మొత్తం 355 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వర కు 4.64 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించామ ని, సేకరించిన ధాన్యంలో 4.40 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు పంపించామని పేర్కొన్నారు. దీంట్లో 4.29 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు అన్‌లోడ్‌ చేసుకున్నారని వెల్లడించారు.


logo