శనివారం 30 మే 2020
Nizamabad - May 22, 2020 , 01:56:14

‘సాగు’ మథనం!

‘సాగు’ మథనం!

నియంత్రిత వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష 

విభిన్న పంటల సాగుతో రైతులకే ప్రయోజనమన్న సీఎం 

నాలుగైదు రోజుల్లో క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు 

రైతులు ఇష్టమొచ్చినట్లుగా పంటలు పండించి తగిన 

మద్దతు ధర దక్కక నష్టపోతున్నారు. దీనికితోడు సరైన మార్కెటింగ్‌ వ్యవస్థ లేకపోవడం, డిమాండ్‌ ఉన్న పంటలు పండించక పోవడంతో సాగు నష్టదాయకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ఈ వానకాలం సీజన్‌ నుంచి రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేసి రైతాంగానికి మేలు చేయాలని సంకల్పించింది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో గురువారం కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు, రైతుబంధు సమితి ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ఉభయ జిల్లాల నుంచి బాధ్యులు హాజరయ్యారు. నియంత్రిత సాగు విధానంపై తీసుకోవాల్సిన చర్యలు, రైతులను ఏ విధంగా సమాయత్తం చేయాలో ఈ సందర్భంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.  వానకాలం పంటల సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ ఇదివరకే రూపొందించింది. కాగా, సీఎం సూచనలకు అనుగుణంగా సాగు ప్రణాళికను మరోమారు రూపొందించనున్నారు.  

 -కామారెడ్డి, నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ

కామారెడ్డి, నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టబోతున్న నూతన విధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వానకాలం సీజన్‌ నుంచి ప్రారంభం కాబోతున్న నియంత్రిత పంటల సాగు విధానానికి రైతులను సన్నద్ధం చేసేందుకు మంత్రులు, జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో గురువారం జరిగిన ఈ సమావేశంలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై తీసుకోవాల్సిన చర్యలు, రైతులను ఏ విధంగా సమాయత్తం చేయాలనే అంశంపై చర్చించారు. ఇప్పటికే వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రజా ప్రతినిధులతో పలుమార్లు చర్చించిన సీఎం కేసీఆర్‌.. క్రోడీకరించిన అంశాలను కలెక్టర్లతోనూ చర్చించారు. రైతులను ఆదర్శవంతమైన సాగు విధానాల వైపు మళ్లించాల్సిన అవసరాన్ని సీఎం నొక్కి చెప్పినట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో సాగుభూమి వివరాలు, గడిచిన పంట కాలాల్లో రైతులు సాగుచేసిన విభిన్న పంటల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. నేల స్వభావాన్ని బట్టి, వాతావరణ మార్పులను అనుసరించి పండించాల్సిన పంటలపై సమగ్రంగా కలెక్టర్లకు  స్వయంగా సీఎం అవగాహన కల్పించినట్లు తెలిసింది.

మారనున్న వానకాలం ప్రణాళిక.. 

కామారెడ్డి జిల్లాలో వానకాలం పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ ఇదివరకే రూపొందించింది. ఏ పంటలు ఏ మేరకు సాగవుతాయో? పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపించింది. సీఎం కేసీఆర్‌ ఆలోచనలో భాగంగా చేపట్టబోతున్న నియంత్రిత సాగు విధానం నేపథ్యంలో సాగు ప్రణాళిక మరోమారు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వానకాలం సీజన్‌లో 4,95,700 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. 2.10లక్షల ఎకరాల్లో వరి, 90వేల ఎకరాల్లో మక్కజొన్న, 20వేల ఎకరాల్లో కందులు, 90వేల ఎకరాల్లో సోయా, 50వేల ఎకరాల్లో పత్తి, 17వేల ఎకరాల్లో చెరుకు, 200 ఎకరాల్లో పసుపు పంటలు సాగవుతాయని అంచనాలు సిద్ధమయ్యాయి. కొత్త విధానం మూలంగా ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళికలు పూర్తిగా తారుమారు కాబోతున్నాయి. నియంత్రిత సాగు విధానంపై  ప్రణాళిక రూపకల్పనలో మరోసారి వ్యవసాయశాఖ నిమగ్నమైంది. కొత్త విధానంలో మక్కజొన్న సాగును పూర్తిగా తగ్గించాలని, వరి పంటలో సన్న రకం మాత్రమే రైతులు ఎక్కువగా సాగుచేయాలని ప్రభుత్వం సూచించింది.  మక్కజొన్న విస్తీర్ణం భారీగా పడిపోనుంది. పప్పు దినుసులు, పత్తి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయాధికారులు  ప్రణాళికలు సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. 

ప్రణాళికల రూపకల్పన

నియంత్రిత సాగు విధానంలో ప్రభుత్వం చెబుతున్నట్లుగానే ప్రజావసరాలకు ఉపయోగపడే పంటలనే సాగుచేసేందుకు మానసికంగా రైతులు సిద్ధమవుతున్నారు. నూతన విధానంలో సాగుకు అనుకూల వాతావరణం, భూమి, నీటి పారుదల సౌకర్యం, మార్కెటింగ్‌, సాగులో ఎదురవుతున్న సవాళ్లను లెక్కలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ శరత్‌ నేతృత్వంలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక సమావేశాల ద్వారా ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ వానకాలం నుంచి అమలుచేయనున్న నియంత్రిత పద్ధతిలో సాగువిధానంపై అవగాహన కల్పించేందుకు నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాల ని సీఎం ఆదేశించారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్‌ కమిటీ, సింగిల్‌ విండో చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులను సదస్సులకు ఆహ్వానించాలని సీఎం చెప్పారు.

సగం సన్నాలు.. సగం దొడ్డురకాలు 

నిజామాబాద్‌ జిల్లాలో 3.56 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలని ఇప్పటికే అధికారులు యాక్షన్‌ప్లాన్‌ రూపొందించారు. కాగా, ఇంతమేర వరి సాగును కొనసాగిస్తూనే, ఇం దులో సగం విస్త్తీర్ణంలో సన్నరకాలు సాగుచేయాలని నిర్ణయించారు. 70వేల ఎకరాల్లో సోయా వేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.   మక్కజొన్న సాగును పూర్తిగా తగ్గించి, ఆ స్థానంలో సోయా పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ లెక్కన జిల్లాలో లక్ష ఎకరాల్లో సోయా సాగుచేయాల్సి ఉంటుంది. పసుపులో అంతర్‌ పంటగా మక్కజొన్న వేసుకోవచ్చన్నారు. మరో 25వేల ఎకరాల్లో పత్తి, కందులు, పెసర, మినుము, పసుపు వేసుకోవాలని సూచించారు. అధికారులు వారం పాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. కూరగాయలు, పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు.  ప్రజాప్రతినిధులు, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి నియంత్రిత సాగుపై అవగాహన కల్పిస్తారు. రైతుబంధు పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని, రైతు వేదికలను వచ్చే యాసంగి వరకు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. 


logo