సోమవారం 18 జనవరి 2021
Nizamabad - May 21, 2020 , 01:37:06

‘మహా’ ముప్పు..!

‘మహా’ ముప్పు..!

  • సరిహద్దున మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వలస కార్మికులు 
  • తండోపతండాలుగా తరలివస్తుండడంతో యంత్రాంగం హైరానా..! 
  • సాలూరా చెక్‌పోస్ట్‌ వద్ద వైద్య పరీక్షల అనంతరం ప్రవేశానికి అనుమతి 
  • మహారాష్ట్రలో కరోనా కల్లోలంతో సరిహద్దు గ్రామాల్లో ఆందోళన 
  • గోదావరి, మంజీర నదుల గుండా దొడ్డిదారుల్లో ప్రవేశిస్తున్న వలస కార్మికులు 

కరోనా కరాళ నృత్యం చేస్తున్న మహారాష్ట్ర నుంచి నిత్యం వేలాది మంది వలస కార్మికులు సరిహద్దును దాటి జిల్లాలోకి ప్రవేశిస్తుండడంతో అధికార యంత్రాంగం హైరానా పడుతున్నది. వారి ద్వారా ఎక్కడ వైరస్‌ వ్యాప్తి చెందుతుందోనని ఆందోళనకు గురవుతున్నది. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని సాలూరా సమగ్ర తనిఖీ కేంద్రం (చెక్‌పోస్ట్‌), సలాబత్‌పూర్‌ చెక్‌పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి నిత్యం వేలాదిగా వస్తున్న వలస కార్మికులతో అక్కడ సందడి నెలకొంటున్నది. వాహనాల్లో, కాలినడకన వస్తున్న వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, అనుమతి పత్రాలను పరిశీలించడం అధికారులకు కష్టంగా మారింది. ఈ తతంగం పూర్తికావడానికి గంటల కొద్దీ సమయం పడుతుండడంతో వలస కార్మికులకు చెక్‌పోస్టుల వద్ద నిరీక్షణ తప్పడం లేదు. వలస వచ్చే వారి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. ఏమాత్రం అజాగ్రత్త వహించినా వలస వచ్చే వారితో ముప్పు తప్పదని భావించిన యంత్రాంగం సరిహద్దులో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నది.

-కామారెడ్డి, నమస్తే తెలంగాణ/బోధన్‌ 

 కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర నుంచి నిత్యం వేలాది మంది వలస కార్మికులు సరిహద్దును దాటి నిజామాబాద్‌ జిల్లాలోకి ప్రవేశిస్తుండడంతో అధికార యంత్రాంగం హైరానా చెందుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బోధన్‌ మండలంలోని సాలూరా చెక్‌పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న వేలాది మంది వలస కార్మికులతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాహనాల్లో కిక్కిరిసి వస్తున్న వలస కార్మికుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో తెలియక అధికారులు, చెక్‌పోస్ట్‌ వద్ద విధుల్లో ఉంటున్న సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఓపక్క మానవీయ కోణం, మరోపక్క కరోనా భయం.. ఫలితంగా అధికారులు, సిబ్బంది ఒక రకమైన ఉద్విగ్నతకు గురవుతున్నారు. కాలినడకన కూడా పిల్లాపాపలతో నిత్యం అనేకమంది  జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు.  వేలాదిగా వస్తున్న వలస జనానికి నిత్యం వైద్య పరీక్షలు నిర్వహించడం, అనుమతిపత్రాలు పరిశీలించడం అధికారులకు కష్టంగా మారింది. ఈ తతంగం పూర్తికావడానికి గంటల కొద్దీ సమయం పడుతుండడంతో వలస కార్మికులకు చెక్‌పోస్ట్‌ వద్ద నిరీక్షణ తప్పడం లేదు. దీంతో వలస కార్మికులు అక్కడే వంటలు చేసుకుని తింటున్నారు. 

సాలూరా గుండా అనేక రాష్ట్రాలకు..

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో మహారాష్ట్ర నుంచి వేలాదిమంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు బయలుదేరారు. అంతర్రాష్ట్ర రహదారి కావడంతో నాందేడ్‌ జిల్లా నుంచి సాలూరా వద్ద నిజామాబాద్‌ జిల్లాలోకి వీరంతా పెద్దఎత్తున ప్రవేశిస్తున్నారు. తెలంగాణకు వచ్చే వారికంటే ఇతర రాష్ర్టాలకు వెళ్లేందుకే ఇక్కడి నుంచి ఎక్కువగా జనం ప్రవేశిస్తున్నారు. మహారాష్ట్రలోని పర్భణి, ఔరంగాబాద్‌, జాల్నా, నాందేడ్‌, లాతూర్‌ తదితర జిల్లాల నుంచి వీరు వస్తున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తదితర రాష్ర్టాలకు వెళ్లేవారు ఉన్నారు.  

దొడ్డిదారుల గుండా జిల్లాలోకి..

మరోపక్క అనుమతి పత్రాలు లేని అనేకమంది వలస కార్మికులు, జిల్లాలోని అనేక ప్రాంతాలతో బంధుత్వాలు కలిగిన మహారాష్ట్రీయులు కూడా సరిహద్దులు దాటుతున్నారు. మంజీర నదిని దాటి కొంతమంది బోధన్‌ మండలంలోకి ప్రవేశిస్తుండగా, కందకుర్తి వద్ద గోదావరి నదిని దాటుతూ ప్రతిరోజూ వందలాది మంది వస్తున్నారు. సాలూరా  మాదిరిగానే కందకుర్తి వద్ద చెక్‌పోస్టును ఏర్పా టు చేశారు. ఇక్కడా మహారాష్ట్ర నుంచి వచ్చేవారు అనుమ తి పత్రాలు చూపించి ప్రవేశిస్తున్నారు. అయితే, అనుమతి పత్రాలు లేకుండా విచ్చలవిడిగా మంజీర, గోదావరి నదులను కాలినడకన దాటుతున్న వారితో సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాలూరా వద్ద మంజీర నదిలో, కందకుర్తి వద్ద గోదావరి నదిలో ప్రస్తుతం నీళ్లులేకపోవడంతో వలస కూలీలు ఇసుకలో కాలినడకన రాగలుగుతున్నారు.