బుధవారం 03 జూన్ 2020
Nizamabad - May 20, 2020 , 02:47:38

తెలంగాణ సోనా.. పండిస్తే బంగారమే!

తెలంగాణ సోనా.. పండిస్తే బంగారమే!

అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉన్న తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌-15048) రకం వరి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. గతంలో జిల్లా రైతులు పెద్ద మొత్తంలో ఈ పంట సాగుచేసినప్పటికీ, సరైన అవగాహన లేకపోవడం, శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులను పాటించకపోవడంతో క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం నిజామాబాద్‌ రూరల్‌, మోర్తాడ్‌, నిజామాబాద్‌ నార్త్‌, డిచ్‌పల్లి, బాల్కొండ మండలాల్లో 1400 ఎకరాల వరకు ఈ రకం సాగవుతున్నది.  షుగర్‌ లెస్‌ వెరైటీ కావడంతో మార్కెట్‌లో దీనికి డిమాండ్‌ ఉంది. తెలంగాణ సోనాను ఎక్కువ మొత్తంలో సాగుచేసేలా రైతులను ప్రోత్సహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిర్ణీతకాలంలో నాట్లువేస్తే 125 రోజుల్లోనే పంట చేతికి రావడం, ఇతర సన్నరకాలతో పోలిస్తే సాగు కాలపరిమితి తక్కువగా ఉండడం, ఎరువులు వినియోగం పెద్దగా అవసరం లేకపోవడం.. రైతులకు కలిసివచ్చే అంశాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ:తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కు మంచి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో సాగువిస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. రైతులు తెలంగాణ సోనా సాగుచేసేలా వ్యవసాయాధికారులు జిల్లాలో రెండేండ్ల క్రితం  అవగాహన కల్పించారు. అధికారుల ప్రోత్సాహంతో అప్పట్లో సాగువిస్తీర్ణం పెరిగినప్పటికీ, క్రమంగా దీని సాగుకు రైతులు దూరమవుతూ వచ్చారు. సాగువిస్తీర్ణం తగ్గినప్పటికీ కారణాలపై అధికారులు దృష్టిసారించకపోవడంతో రైతులు యథావిధిగా వివిధ సన్నరకాలు, దొడ్డు ధాన్యం సాగువైపు మళ్లారు. దీంతో జిల్లాలో తెలంగాణ సోనా సాగువిస్తీర్ణం 1400 ఎకరాలకే పరిమితమైంది. నిజామాబాద్‌ రూరల్‌, మోర్తాడ్‌, నిజామాబాద్‌ నార్త్‌, డిచ్‌పల్లి, బాల్కొండ తదితర ప్రాంతాల్లో కొంతమేర సాగవుతున్నది. 

అవగాహన తప్పనిసరి..

మిగిలిన సన్నరకాలతో పోలిస్తే తెలంగాణ సోనా పంట కాలపరిమితి 125 రోజులే. మిగిలిన అన్ని పంటల సాగుకు 140 నుంచి 150 రోజులకుపైగా సమయం తీసుకుంటున్నారు. తెలంగాణ సోనా సాగుచేసే రైతులు జులై మొదటి వారం నుంచి 15లోపు నారుమడులు వేసుకోవాలి. నెల రోజుల వయస్సు ఉన్న నారును ఆగస్టు పది నుంచి 15వ తేదీ మధ్య నాట్లు వేయాలి. నిర్ణీతకాలంలో నాట్లు వేస్తే 125 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ఇతర సన్నరకాలతో పోలిస్తే కాలపరిమితి తక్కువగా ఉండడం, ఎరువులు తక్కువగా వినియోగించడం రైతులకు మేలు చేసే అంశం. కానీ రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో మిగతా రకాల ధాన్యంసాగు తరహాలోనే తెలంగాణ సోనాను సైతం సాగు చేస్తున్నారు. మే, జూన్‌ నెలల్లో పుటం వేసి నాట్లు వేయడంతో పంట కాల పరిమితి 150 రోజులకు పెరగడంతోపాటు ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో రైతులు తెలంగాణసోనాపై విముఖత చూపుతున్నారు. 

శాస్త్రవేత్తలు సూచించిన సాగు పద్ధతులపై కొందరు రైతులకు అవగాహన లేకపోవడం, మరి కొందరికి తెలిసినా అవలంభించకపోవడంతో తెలంగాణ సోనా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తున్నది. వానాకాలం సీజన్‌లో తెలంగాణ సోనాకు కాండం తొలుచు పురుగుతో ఇబ్బందులు వస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గుళికలు వాడడం, కోరాజిన్‌ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఎకరాకు 45 బస్తాల దిగుబడి వస్తుంది. కర్ణాటకలో తెలంగాణ సోనా రకానికి మంచి గుర్తింపు ఉంది. logo