శనివారం 06 జూన్ 2020
Nizamabad - May 19, 2020 , 02:52:45

రైట్‌.. రైట్‌

రైట్‌.. రైట్‌

నేటి ఉదయం నుంచే ఆర్టీసీ సేవలు ప్రారంభం

నిబంధనలతో అనుమతించిన ప్రభుత్వం

అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతిలేదు

ప్రయాణికులు మాస్క్‌ ధరించడం తప్పనిసరి

భౌతిక దూరం పాటించాల్సిందే..

నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో 669 బస్సులు, 2,895 సిబ్బంది 

అన్ని ఏర్పాట్లు చేశాం: ఆర్టీసీ ఆర్‌ఎం

నిజామాబాద్‌ అర్బన్‌/కామారెడ్డి/బాన్సువాడ: కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే క్రమంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో ప్రజారవాణాకు బ్రేక్‌పడిన సంగతి తెలిసిందే. 56 రోజులుగా డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. ఇన్ని రోజులుగా బస్సులు తిప్పకపోవడంతో సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌ చేస్తూ బస్సులను కండీషన్‌లో ఉంచేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్సులు తిరగక పోవడంతో నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో పనిచేస్తున్న 2,895 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇండ్లకే పరిమితమయ్యారు. కానీ, ఆర్టీసీ డిపోల్లో మెయింటేనెన్స్‌ సిబ్బంది 50 మంది మాత్రం యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు నిత్యం బస్సుల్లోని బ్యాటరీలు పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రీసింగ్‌ చేస్తున్నారు. సమస్యలున్న బస్సులకు రిపేర్లు చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించడంతో మంగళవారం నుంచి బస్సులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. గత నెలలో నిజామాబాద్‌ డిపో -1 పరిధిలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ బస్సు ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో 80 శాతం మేర దగ్ధమైంది. దీంతో అప్రమత్తమైన డిపో మేనేజర్లు తగిన చర్యలకు ఆదేశించారు. అన్ని బస్సులు కండీషన్‌లో ఉండేలా మెయింటేనెన్స్‌ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. నిజామాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలోకి వచ్చే నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 669 బస్సులు ఉన్నాయి. అందులో నిజామాబాద్‌ పరిధిలో అద్దె బస్సులు 127, కామారెడ్డి పరిధిలో 58 బస్సులు ఉన్నాయి. నిజామాబాద్‌లో ఆర్టీసీకి చెందిన బస్సులు 295, కామారెడ్డి జిల్లాలో 127 ఉన్నాయి.  

సిద్ధమైన ఆర్టీసీ

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో 58 రోజులుగా డిపోలకే పరిమితమైన బస్సులు మంగళవారం నుంచి రోడ్డెక్కనున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 654 బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. కరోనా నేపథ్యంలో రవాణా శాఖకు సంబంధించిన వాహనాలు నడవకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం సీఎం కేసీఆర్‌ మంగళవారం నుంచి బస్సులు యథావిధిగా నడపాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి అన్ని రూట్లలో బస్సులను నడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

బస్సులన్నీ కండీషన్‌లో ఉన్నాయి..

నిజామాబాద్‌, కామారెడ్డి పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో మెయింటేనెన్స్‌ సిబ్బంది లాక్‌డౌన్‌ కాలంలోనూ విధులకు హాజరవుతున్నారు. అన్ని డిపోల్లోనూ బస్సులు రన్నింగ్‌ కండీషన్‌లో ఉన్నాయి. గ్రీసింగ్‌, వైరింగ్‌, బ్యాటరీల చార్జింగ్‌ తదితర పనులు మెయింటేనెన్స్‌ సిబ్బంది  చేపడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా బస్సులు తిప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. 

-సోలోమాన్‌, నిజామాబాద్‌ ఆర్టీసీ ఆర్‌ఎం  


logo