గురువారం 28 మే 2020
Nizamabad - May 19, 2020 , 02:46:57

కరోనా వేళ.. కనికరించరేల?

 కరోనా వేళ.. కనికరించరేల?

బీపీ పెంచుతున్న  ఓపీ ఫీజు

ప్రైవేట్‌ దవాఖానల్లో రెట్టింపైన కన్సల్టేషన్‌ ఫీజు

ఎవరి ఇష్టం వారిదే.. అడిగేవారేరి..?

కరోనావేళ నష్టాలు పూడ్చుకోవడానికి అంటున్న డాక్టర్లు

ఆపత్కాలంలో పేదలకు తిప్పలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌తో చేసేందుకు పనిలేక.. చేతిలో చిల్లిగవ్వలేక.. ఇబ్బందులు పడుతున్న వారికి ప్రైవేట్‌ దవాఖానల్లో ఓపీ ఫీజుతో బీపీ పెరుగుతున్నది. ఆపత్కాలంలో రెట్టింపు ఫీజు వసూలు చేస్తుండడం, పట్టించుకునే వారు లేకపోవడంతో రోగులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఇన్నిరోజులు దవాఖానలు మూసిఉంచడంతో అద్దె, జీతాలు చెల్లించలేకపోయామని, కన్సల్టేషన్‌ ఫీజులు పెంచుతామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)ను ప్రైవేట్‌ డాక్టర్లు కోరగా.. అసోసియేషన్‌ ప్రతినిధులు మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వనప్పటికీ, ఏకపక్షంగా ఫీజులు పెంచారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తుండడంతో రోగులపై ఆర్థిక భారం పడుతున్నది. వైద్యుల తీరుపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రెండు నెలలుగా చేసేందుకు పనిలేక, చేతిలో డబ్బులు లేక ఎందరో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగమొచ్చి పేదలు దవాఖానలకు వెళితే.. ప్రైవేట్‌లో ఔట్‌ పేషెంట్‌ ఫీజు విని బిక్కమొహం వేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గడంతో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు దవాఖానలు తెరుచుకున్నాయి. సుమారు 40రోజుల తరువాత అన్ని దవాఖానల్లో ఔట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ వైద్యసేవలందుతున్నాయి.

దవాఖానలకు కేంద్ర బిందువైన నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని ఖలీల్‌వాడి రోగులతో కిటకిటలాడుతున్నది. వైద్యం కోసం వచ్చే రోగులు, వారి సహాయకులు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు కొన్ని దవాఖానల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ సైతం చేస్తున్నారు. మాస్కులు ధరించి రావాలని బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మళ్లీ ప్రైవేటు వైద్యం గాడిలో పడింది. ఇదిలా ఉంటే.. డాక్టర్లు కన్సల్టేషన్‌ ఫీజు పెంచి రోగులపై మరింత భారాన్ని మోపారు. ఇన్ని రోజులు దవాఖానలు మూసి ఉండడంతో నష్టాలు పూడ్చుకునేందుకని కొంత మంది, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అని మరికొంత మంది ప్రైవేట్‌ వైద్యులు ఔట్‌ పేషెంట్‌ ఫీజును రెట్టింపు వసూలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తికి ముందు ఓపీ ఫీజు రూ.150 నుంచి రూ.200 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. పెంచిన ఫీజు వివరాలను మాత్రం ఏ ఒక్క దవాఖానలోనూ డిస్‌ప్లే (ప్రదర్శించడం) చేయడం లేదు. ఓపీ ఫీజు పెంపుపై నిజామాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేట్‌ దవాఖాన నిర్వాహకుడిని వివరణ కోరగా..

‘అవును పెంచాం.. పీపీఈ కిట్లు.. ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాటికి ఖర్చవుతుంది కదా... అవన్నీ ఎలా భరించాలి’ అని సమాధానమిచ్చాడు. అసలు ఈ సమయంలో మేం వైద్య సేవలందించడమే గొప్ప... అనే అర్థమొచ్చేలా ఘాటుగానే స్పందించడం విశేషం. ఫీజుల పెంపు వ్యవహారంపై ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రావును వివరణ కోరగా.. ఓపీ ఫీజు పెంచుతామని పలువురు వైద్యులు తమ వద్దకు వచ్చారని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఫీజులు పెంచినట్లుగా తమ  నోటీసుకు రాలేదన్నారు. ఫీజులు పెంచవద్దనే అధికారం తమకు లేదని, అది వారి విచక్షణకే చెల్లుతుందన్నారు. ఫీజులెంత తీసుకుంటారో వారిష్టం.. కానీ, ఆ వివరాలను బోర్డులో ప్రదర్శించాల్సిందేనని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ దవాఖానలో పెరుగుతున్న ఓపీ..

ప్రైవేట్‌ దవాఖానల్లో ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) ఫీజు రెట్టింపు చేయడంతో నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఓపీ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ దవాఖానకు ప్రతిరోజూ 500 నుంచి 600 మంది వరకు రోగులు వస్తున్నారు. కరోనా సమయంలో సైతం 300 నుంచి 350 మంది వరకు వచ్చేవారు. ప్రస్తుతం వైద్యంకోసం వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గతేడాది ఇదే సమయానికి 800 నుంచి 1200 మంది వరకు ఓపీ విభాగానికి వచ్చేవారు. చిన్నచిన్న వైద్య పరీక్షల కోసం పెద్ద దవాఖానకు రావొద్దని దవాఖాన బాధ్యులు సూచిస్తుండడంతో పేషెంట్ల సంఖ్య తగ్గింది. కానీ, ప్రైవేట్‌ దవాఖానలో ఓపీ ఫీజు రెట్టింపు వసూలు చేస్తుండడంతో ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది.  

ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే వందకుపైగా వివాహాలు

 ఇందూరు / ఎల్లారెడ్డి : లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 21 నుంచి వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. మే 3 నుంచి ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య పెండ్లిళ్లు చేసేందుకు అవకాశం కల్పించడం, సోమవారం మంచి ముహూర్తం ఉండడంతో ఒక్క రోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందకుపైగా జంటలు ఒక్కటయ్యాయి. వివాహ వేడుకను ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సాదాసీదాగా జరిపించేశారు. చాలా మంది తల్లిదండ్రులు మిగిలిన డబ్బులను సేవా కార్యక్రమాలకు వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. 

నిరాడంబరంగా వివాహం  

కరోనా కారణంగా వివాహాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు నెలలుగా లగ్గాలు వాయిదా వేసుకున్న వారు భౌతికదూరం పాటించి పెండ్లి చేయడం మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారు. ఫంక్షన్‌ హాళ్లు మూసి ఉండడంతో ఆలయాల్లో రెండు కుటుంబాల సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుకను ముగించేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వివాహ వేడుకల్లో 20 మందికి మించకుండా పాల్గొంటున్నారు. సోమవారం ఎల్లారెడ్డిలోని వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో సంగాయప్ప ఆధ్వర్యంలో ఎల్లారెడ్డికి చెందిన క్రాంతి కుమార్‌ వివాహం సుష్మతో జరిగింది. బంధు మిత్రులు మాస్కులు ధరించి వివాహ వేడుకలో పాల్గొన్నారు.  

  అవసరం మేర ఖర్చులు.. పొదుపుపై దృష్టి

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ : కరోనా ప్రతి ఒక్కరి జీవనశైలిలో మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులతో సంపాదనబాట పట్టారు. గతంలో మాదిరిగా కాకుండా ఆదాయం సగానికి తగ్గింది. అయినా సడలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. అల్ప ఆదాయవర్గాల వారు అవసరానికే ఖర్చు చేస్తూ.. పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఒక్కసారిగా బడ్జెట్‌ తారుమారుకావడంతో ఎటూపాలుపోని పరిస్థితి నెలకొన్నది. కనీసం ఇంటి కిరాయిలు చెల్లించే స్థోమతలేని వారెంతో మంది ఉన్నారు. దశలవారీగా లాక్‌డౌన్‌ సడలింపులతో మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ నెలాఖరు వరకు పరిస్థితులు ఎప్పటిలాగా మారి అందరూ పనుల్లో బిజీ అయ్యే అవకాశముంది. షాపింగ్‌ మాళ్లు, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాలను ‘సరి - బేసి’ పద్ధతిలో తెరుస్తున్నారు. అంటే చేతినిండా పని దొరకడం ఇప్పుడు గగనంగా మారింది. ఈ పరిస్థితులు మారాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రెండు నెలలుగా సంపాదన లేక ఇబ్బందులు పడ్డ ప్రజలు కొత్త జీవన విధానానికి శ్రీకారం చుడుతున్నారు. సంపాదనలో కొంత పొదుపు చేసుకోవడం, అవసరాల మేరకు ఖర్చు చేయడం, ఆర్భాటాలకు వెళ్లకపోవడం వంటివి అలవర్చుకుంటున్నారు.

పెరిగిన ప్రసవాల సంఖ్య

శక్కర్‌నగర్‌ : ఒక వైపు కరోనా పరిస్థితులు అతలాకుతలం చేసినా.. ప్రసవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య తగ్గవచ్చని, ప్రైవేటు దవాఖానలవైపు మొగ్గుచూపే అవకాశముందని అధికారులు అనుకున్నారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఊహించని విధంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని వసతులు కల్పించడంతోపాటు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో గర్భిణుల వివరాలు సేకరించి, వారు ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకునేలా హెల్ప్‌లైన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఒక్క బోధన్‌ ప్రభుత్వ దవాఖానలోనే ఊహించని విధంగా ప్రసవాల సంఖ్య పెరిగింది. లాక్‌డౌన్‌ విధించిన మార్చిలో 89 మందికి సాధారణ, 91 మంది గర్భిణులకు శస్త్రచికిత్స ద్వారా ప్రసవాలు చేశారు. ఏప్రిల్‌లో 217 మందికి ప్రసవాలు చేశారు. ఇందులో 82 మందికి సాధారణ, 135 మందికి శస్త్రచికిత్సలు చేశారు. ఈ నెలలో సోమవారం వరకు 132 మందికి ప్రసవాలు చేశారు. logo