బుధవారం 03 జూన్ 2020
Nizamabad - May 18, 2020 , 02:05:07

పరిశుభ్రత కోసం పది నిమిషాలు

పరిశుభ్రత కోసం పది నిమిషాలు

రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన ‘పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఆదివారం పది నిమిషాలు’ అనే పిలుపునకు విశేష స్పందన లభిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందులో భాగస్వాములవుతున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో సతీమణి నీరజారెడ్డితో కలిసి పరిసరాలను శుభ్రంచేశారు.  స్పీకర్‌ పోచారం  హైదరాబాద్‌లోని తన నివాసంలో పూలకుండీల్లోని చెత్తాచెదారం, నిల్వ నీటిని తొలగించారు. 

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నిజా మాబాద్‌ జిల్లాలో ఆదివారం ఉదయం ‘10 గంటలకు 10 నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రముఖులు పరిశుభ్రతా పనులు చేపట్టారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో పూల కుండీల్లోని చెత్తాచెదారాన్ని తొలగించి మొక్కలకు నీళ్లు పట్టారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన అధికారిక నివాసంలో సతీమణి నీరజారెడ్డితో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిసరాలను శుభ్రం చేశారు. మొక్కలకు నీళ్లు పట్టారు. కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌కుమార్‌ తన క్యాంప్‌ ఆఫీస్‌లోని ఫౌంటేన్‌లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. 

నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి తన క్యాంపు కార్యాలయ పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి శుభ్రం చేశారు. నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు తన స్వగృహంలో పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి మొక్కలకు నీరు పట్టారు. బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతి శరత్‌రెడ్డి దంపతులు తమ స్వగృహంలో పాత టైర్లలో నిల్వ ఉన్న నీటిని, కూలర్లలో నీటిని తొలగించారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ పట్టణంలోని 7వ వార్డులో నిల్వ నీటిని తీయించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. భీమ్‌గల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ 6వ వార్డులో మురికి కాలువలో ఆయిల్‌ బాల్స్‌ వేశారు. నాగిరెడ్డిపేట జడ్పీటీసీ సభ్యుడు మనోహర్‌రెడ్డి తన ఇంటి పరిసరాలను శుభ్రం చేసి మొక్కలకు నీరుపోశారు.  


logo