శనివారం 30 మే 2020
Nizamabad - May 15, 2020 , 02:09:20

కర్షకుల కోసం కార్గో సర్వీసులు

కర్షకుల కోసం కార్గో సర్వీసులు

  • ఎరువుల తరలింపునకు ఆర్టీసీ కార్గో బస్సులు
  • ధాన్యం తరలింపుతో తీవ్రమైన లారీల కొరత
  • కామారెడ్డి జిల్లాలో వినియోగంలోకి ప్రత్యేక బస్సులు

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: నష్టాల్లో కూ రుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ(టీఎస్‌ ఆర్టీసీ)ను గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఆర్టీసీ కార్గో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. కొంత కాలంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే చక్కర్లు కొడుతున్న ఎర్రబస్సులు ఇప్పుడు ఏకంగా జిల్లాల్లోనూ రోడ్డెక్కి సందడి చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాకు కార్గో బస్సులను కలెక్టర్‌ శరత్‌ ప్రత్యేకంగా హైదరాబాద్‌ రీజియన్‌ నుంచి తెప్పించారు. వీటిని స్థానికంగా ఎరువుల తరలింపునకు వినియోగిస్తున్నారు. యాసంగి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఈ దశలో సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు, అక్కడి నుంచి గోదాములకు తరలించేందుకు గాను లారీలు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ధాన్యం దిగుబడులు భారీగా రావడంతో లారీల కొరత అంతటా ఏర్పడింది. దీనికి ప్రత్యామ్నాయంగా   ప్ర భుత్వ యంత్రాంగం ఆర్టీసీ కార్గో సేవలను వినియో గించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే సిద్ధం చేసిన కార్గో బస్సులను జిల్లాకు తెప్పించి వాటి ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌)లకు మార్క్‌ఫెడ్‌ అధికారులు తరలిస్తున్నారు.

జిల్లాకు 15 ఆర్టీసీ కార్గో బస్సులు...

వానాకాలం పంట సీజన్‌ ప్రారంభానికి సిద్ధమవుతు న్న వేళ తెలంగాణ ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం ముందస్తుగానే ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సకాలంలో రైతుల చేతికి ఎరువులు, విత్తనా లు అందేవి కావు. సీఎం కేసీఆర్‌ పాలనలో గడిచిన ఆరేండ్లుగా ఏనాడూ ఎరువులు, విత్తనాల సరఫరాలో ఇసుమంతైనా జాప్యం లేకుండా పంపిణీ జరుగుతున్నది. వ్యవసాయ, సహకార శాఖలు సమన్వయంతో తీసుకునే ముందస్తు చర్యలతో సత్ఫలితాలు వస్తున్నా యి. ఇందులో భాగంగా జిల్లాకు ఇప్పటికే చేరిన ఎరువుల బస్తాలన్నీ ప్రైవేటు గోదాముల్లో నిల్వ ఉన్నాయి. వీటిని సొసైటీలకు తరలించేందుకు వాహనాలు  లే కపోవడంతో ఇక్కట్లు ఎదురయ్యాయి. ఆర్టీసీ రూపొందించిన కార్గో బస్సులను ఇందుకు వాడుకోవాలనే ఆలోచన రావడంతో వాటి ద్వారా ఎరువులను చకచకా తరలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా లో వరి సాగుకు సంబంధించి 63,219 క్వింటాళ్ల విత్తనాలు, 26,985 క్వింటాళ్లు సోయా, 11,048 క్వింటాళ్లు పెసర్లు, 7,084 క్వింటాళ్లు మొక్కజొన్న, 478 క్వింటాళ్లు పత్తి, 520 క్వింటాళ్లు కందులు, 467 క్వింటాళ్ల మినుములు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధం చేసింది. ఎరువు ల విషయానికొస్తే యూరియా 45,129 మెట్రిక్‌ ట న్నులు, డీఏపీ 10,428 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 7,030 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 17, 075 మెట్రిక్‌ టన్నులు సిద్ధం చేశారు. వీటిని 15 ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా ఒక్కో బస్సుల్లో 9 టన్నుల మేర ఎరువులను తరలిస్తున్నారు.

కష్టకాలంలో ఆర్టీసీ అండగా...

లాక్‌డౌన్‌ అమలు సమయంలో ఎక్కడి వాహనాలు అక్కడే తుప్పు పట్టే స్థితికి చేరుకున్నాయి. దాదాపుగా 40 రోజులపాటు ఎటూ కదలకుండా ఉన్న భారీ వాహనాలకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది. పంట ఉత్పత్తులను తరలించేందుకు, నిత్యావసరాలను ఆయా ప్రాంతాలకు చేర్చేందుకు పెద్దఎత్తున వాహనాలు ఉపయోగిస్తుండడంతో క్షేత్ర స్థాయిలో లారీల కొరత ఏర్పడింది. ధాన్యం బస్తాలను రైస్‌మిల్లులకు తరలించేందుకు గాను రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగి కనిపించిన వాహనాలను పట్టుకెళ్లి వాడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలో నుంచి పుట్టిన ఆర్టీసీ కార్గో సేవలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి.

కార్గో బస్సుల్లో ధాన్యం తరలింపు

నిజామాబాద్‌ అర్బన్‌: ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనానికి వచ్చే అధ్యాపకుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులను, ధాన్యం కొనుగోళ్లకు ఆర్టీసీ కార్గో బస్సుల వినియోగిస్తున్నామని ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమాన్‌ తెలిపారు. సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజేషన్‌, మాస్కులు ధరించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డిపోల్లో అవసరమైన మేరకు సిబ్బందితో పని చేయిస్తున్నట్లు వివరించారు.


logo