గురువారం 28 మే 2020
Nizamabad - May 13, 2020 , 02:41:11

జిల్లాకు కరోనా టెస్టింగ్‌ మిషన్‌

జిల్లాకు కరోనా టెస్టింగ్‌ మిషన్‌

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: కరోనా కట్టడి అవుతున్న క్రమంలో మరింత ముందు జాగ్రత్త కోసం జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు  తీసుకుంటున్నది. ఇప్పటివరకు సేకరించిన శాంపిళ్లను పరీక్షల కోసం హై దరాబాద్‌కు పంపించడం, ఆ రిపోర్టులు రావడానికి కొన్ని రోజులు వేచి చూసే పరిస్థితులు ఉండేవి. నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి అభ్యర్థన మేరకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవతో  జిల్లాకు ప్రత్యేకంగా కరోనా టెస్టింగ్‌ మిషన్‌ను ఏర్పాటు చేయించేందుకు మార్గం సుగమమైంది. వరంగల్‌ తర్వాత నిజామాబాద్‌ జిల్లాలోనే ఈ సౌకర్యం ఏర్పడనుంది. దీని ద్వారా ఒకేరోజు వందకు పైగా శాంపిళ్లను పరీక్షించి గంటల వ్యవధిలోనే రిపోర్టును ప్రకటించే అవకాశం ఉంది. దీంతో వ్యాధి లక్షణాలు కనిపించినా, ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే శాంపిళ్లు సేకరించి ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే అవకాశముంది. జిల్లా కేంద్రం నుంచి నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లను, ఒక మైక్రో బయాలజీ ప్రొఫెసర్‌ను దీని నిర్వహణ కోసం హైదరాబాద్‌లో శిక్షణకు పంపించారు. వారం  పాటు వీరికి శిక్షణ ఇస్తారు. అనంతరం సింగపూర్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్న కరోనా టెస్టింగ్‌ మిషన్‌ను పది రోజుల్లో జిల్లా కేంద్ర దవాఖానలోని డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 61 పాజిటి వ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో మొదటి నుంచి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కేసులు క్రమంగా తగ్గాయి. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే గాంధీ లో చికిత్స పొందుతున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసూ నమోదు కాకపోవడం శుభపరిణామం.  అ యినప్పటికీ అన్ని జాగ్రత్త లు తీసుకుంటూ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటున్నది.


logo