బుధవారం 03 జూన్ 2020
Nizamabad - May 12, 2020 , 01:56:42

విపత్తు వేళ.. అండగా వేముల

విపత్తు వేళ.. అండగా వేముల

  • నిరంతర సమీక్షలు, క్షేత్ర పర్యటనలు
  • జిల్లా ప్రజల్లో ధైర్యాన్ని నింపిన మంత్రి  ప్రశాంత్‌రెడ్డి
  • ప్రభుత్వ సిబ్బందికి భరోసా.. వలస కూలీలకు ఆసరా...

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: కరోనా విపత్తు వేళ జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నివిధాలా అండగా నిలిచారు. కరోనా వైరస్‌ కట్టడిలో సేవలందిస్తున్న అత్యవసర సిబ్బందిలోనూ ఆయన భరోసా నింపడంతోపాటు, వలస కూలీలకు ఆపద్బాంధవుడిలా మారారు. జిల్లాలో కరోనా తొలికేసు నమోదైన వెంటనే రంగంలోకి దిగిన మంత్రి.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వయంగా తాను కంటైన్మెంట్‌ ఏరియాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో కరోనా కట్టడిపై అధికారులతో తరుచూ సమీక్షలు నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి అండగా నిలిచారు. వైద్యులు, సిబ్బందికి పీపీఈ కిట్లు, ఇతర సామగ్రి కొరత లేకుండా చేశారు. వైద్య, రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల కిందిస్థాయి సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మీడియా సిబ్బందికి సైతం నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనాపై పోరు కోసం.. ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ద్వారా తన సొంత డబ్బులు రూ.15 లక్షలను జిల్లా కలెక్టర్లకు అందజేశారు. రేషన్‌ కార్డులు లేని పేదలకు అండగా నిలవాలన్న మంత్రి పిలుపు మేరకు.. పేదలకు జిల్లా టీఆర్‌ఎస్‌ శ్రేణులు, దాతలు పెద్దఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విరాళాలు అందజేశారు. కష్టకాలంలో ఆందోళన చెందుతున్న రైతులకు అండగా నిలిచి, పంటకొనుగోళ్లను వేముల ముందుండి పర్యవేక్షిస్తు న్నారు. ఫలితంగా జిల్లాలో రికార్డుస్థాయిలో పంట కొనుగోళ్లు జరిగాయి.

వలస కూలీలకు ఆపన్నహస్తం...

లాక్‌డౌన్‌తో ఇక్కడ ఉండలేక స్వస్థలాలకు వలసబాట పట్టిన వలస కూలీలు, కార్మికులకు తానున్నానని మంత్రి ప్రశాంత్‌రెడ్డి భరోసా కల్పించారు. అన్నం దొరకక కాలే కడపులతో ..రవాణా సౌకర్యం లేక చంటి పిల్లలను చంకనెత్తుకొని వందల కిలోమీటర్ల దూరం కాలినడకన పయనమైన వారిని అక్కున చేర్చుకున్నారు. వలస కూలీలకు అన్నం పెట్టి, ప్రత్యేక వాహనాల్లో వారిని తీసుకెళ్లి రాష్ట్ర సరిహద్దుల వద్ద దిగబెడుతున్నారు. 

వెయ్యి మందికి నిత్యాన్నదానం.. 

బాల్కొండ నియోజకవర్గంలో అత్యవసర సేవల సిబ్బందికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహాయ, సహకారాలు అంది స్తున్నారు. ఎనిమిది మండలాల పరిధిలో నిత్యం విధులు నిర్వహిస్తున్న వెయ్యి మంది సిబ్బందికి నెల రోజులుగా సొంత డబ్బులతో భోజన వసతి కల్పించారు. నియోజకవర్గంలో 1200మంది కిందిస్థాయి అత్యవసర సేవల సిబ్బందికి సరుకులు పంపిణీ చేశారు. 


logo