శనివారం 06 జూన్ 2020
Nizamabad - May 10, 2020 , 02:39:14

ప్రతి ఆదివారం.. పది నిమిషాలు..

ప్రతి ఆదివారం.. పది నిమిషాలు..

  • ఇండ్లను, పరిసరాలను శుభ్రపర్చుకోవాలి
  • సీజనల్‌ వ్యాధుల నివారణకు నూతన కార్యక్రమం
  • వీడియోకాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ/నిర్మల్‌ అర్బన్‌/ఎదులాపురం/భైంసా : సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాల పాటు ప్రజలు తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రపర్చుకోవాలని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయా జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో మంత్రి కేటీఆర్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. చికున్‌గున్యా, డెంగీ తదితర సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేయాలనుకునే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మున్సిపల్‌ చైర్మన్లు, ఎమ్మెల్యేలను క్యాంపెయిన్‌లో భాగస్వాములను చేయాలన్నారు. నిలిచిన నీటిని పారబోయాలని, దోమల లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం మన బాధ్యత.. 

శానిటేషన్‌ విషయంలో రాష్ర్టానికి మంచి పేరు వచ్చిందని, దాన్ని కాపాడుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా వైరస్‌వ్యాప్తి నివారణ చర్యల్లో ముందుండి సేవలందించిన పారిశుద్ధ్యకార్మికులను గౌరవించడం అందరి కనీస బాధ్యత అన్నారు. కరోనాతో మరికొంత కాలం కలిసి బతకాల్సిందేనని, వైరస్‌వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని సూచించా రు. మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. విశాఖ ప్రమాద ఘటన దృష్ట్యా పరిశ్రమల విషయంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పెంపుపై అధికారులు కలిసి పని చేయాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో నిజామాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్లు  బీఎస్‌ లత, భాస్కర్‌రావు,  ఎం.డేవిడ్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్లు జితేశ్‌ వీ పాటిల్‌, మారుతీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo