శనివారం 06 జూన్ 2020
Nizamabad - May 10, 2020 , 02:39:14

కరోనాపై పోరులో నారీమణులు

కరోనాపై పోరులో నారీమణులు

  • ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు

కామారెడ్డి, నమస్తే తెలంగాణ / బాన్సువాడ :  ప్రస్తు తం ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెట్టిస్తున్న వైరస్‌ కరోనా. ఈ వైరస్‌ సోకిన రోగులకు చికిత్స అం దించడానికి వైద్యులే కాకుండా సిబ్బంది ఒకింత భ యాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఆ మహమ్మారి బారినపడే అవకాశం ఉండడంతో వైద్యులతో పాటు సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యులు పీపీఈ కిట్ల ఆసరాగా కరోనా రోగులకు సేవలందిస్తుండగా.. క్షేత్రస్థాయిలో ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మాత్రం  అవేవీ లేకుండానే ప్రాణాలు పణంగా పెట్టి కరోనా నియంత్రణకు కృషిచేస్తున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో తిరగాలంటే ఎవరికైనా భయం ఉంటుంది. కానీ, ఇంటింటి సర్వే, క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల కదలికలు, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వారి ప్రాణాలను లెక్కచేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. కరోనా నియంత్రణకు ప్రభు త్వ దవాఖానల్లో, క్షేత్రస్థాయిలో పారామెడికల్‌ సిబ్బం ది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. రేయింబవళ్లు బాధ్యతాయుతంగా పనిచేస్తూ, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనా సోకిన వ్యక్తులతో మాట్లాడడం దగ్గరి నుంచీ  ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్న వారికి వైద్యసేవలు అందించడం, ఇతర వివరాలు సేకరించడంలో నర్సు లు కీలకపాత్ర పోషిస్తున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో, హోం క్వారంటైన్‌లో ఉన్న అనుమానితులకు నిరుపమాన సేవలు అందించడం లో వీరు చూపిస్తున్న తెగువ మెచ్చుకోదగినది.  అనుమానితుల బీపీ, పల్స్‌ ప్రతిక్షణం పరిశీలిస్తూ వారి పరిస్థితిని నర్సులే ఎప్పటికప్పుడు వైద్యుల దృష్టికి తీసుకెళ్తున్నారు. 

ఆ క్షణం నుంచి..

ఎక్కడైనా కరోనా పాజిటివ్‌ కేసు బయటపడితే అక్కడి నుంచి అసలు తంతు ప్రారంభమవుతుంది. సదరు వ్యక్తిని దవాఖానకు తరలించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు(నర్సులు) రంగంలోకి దిగుతారు. వీరికి ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు సహాయం అందిస్తారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరా లు, వైద్య పరీక్షల సమాచారం, ఫోన్‌నెంబర్లు  గంటల వ్యవధిలో సేకరించి ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఇలా వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తున్నారు. 

వివరాల సేకరణ కత్తిమీది సామే..

కేవలం పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లోనే కాకుం డా సాధారణ ప్రాంతాల్లోనూ వైద్య సిబ్బంది పర్యటించి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుంటే వారి పూర్తి సమాచారం సేకరించి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో సర్వే చేయడం కత్తిమీద సాముగా మారిందని సిబ్బంది చెబుతున్నారు. సర్వేకు వెళ్లినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో సర్వే నిర్వహించే ప్రాంతానికి చేరుకునేందుకు రవాణా సౌకర్యం లేక పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గ్రామం లేదా కాలనీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు  ఇంటింటికీ కాలినడకన వెళ్లి వివరాలు సేకరించారు. 

రెడ్‌జోన్‌లో విధులు నిర్వర్తించాం.. 

రోజూ ఉదయం 8గంటలకు ఇంటి నుంచి బయలుదేరి సాయంత్రం వరకు ఇండ్లు తిరుగుతాం. కొందరు గేటు కూడా తీయరు. ఇంకొందరు లోనికి రానివ్వరు. ఎందుకు సతాయిస్తారని మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కరోనా మహమ్మారి కట్టడికి మావంతుగా ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నాం. 

- అంజలి, కాంట్రాక్టు ఏఎన్‌ఏం, బాన్సువాడ

సమన్వయం కీలకమే..  

కరోనా సమయంలో పిట్లంలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేసే నాకు బాన్సువాడ రెడ్‌జోన్‌లో డ్యూటీ వేశారు. నిత్యం కిందిస్థాయిలో ఉన్న ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంల సమన్వయంతో ఒక పద్ధతి ప్రకారం పనిచేశాం. పక్కాగా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి చేరవేశాం.  

- డాక్టర్‌ మమత, ఇన్‌చార్జి మెడికల్‌ ఆఫీసర్‌, పిట్లం


logo