మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - May 09, 2020 , 01:49:42

సడలింపుల సందడి!

సడలింపుల సందడి!

  • ప్రభుత్వ కార్యాలయాలు కళకళ.. రిజిస్ట్రేషన్ల జోరు
  • నిర్మాణాల ప్రారంభంతో కూలీలకు ఊపిరి

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ప్రతినిధులు/నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో వ్యాపార, వాణిజ్య రంగాలన్నీ స్తంభించిపోయాయి. నిర్మాణరంగం నిలిచిపోయింది. దీంతో కూలీలకు ఉపాధి కరువై ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తీసుకు న్న చర్యలతో నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలు రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌లోకి వచ్చేశాయి. ఇదే సమయంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కీలక సడలింపులు చేసింది. ఇది పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో ఊరటనిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో నిబంధనలను అనుసరించి, భౌతికదూరం పాటిస్తూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. దుకాణాలను సరి-బేసి విధానంలో తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. నిర్మాణ రంగంలో కదలిక రాగానే.. కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది. సిమెంట్‌, పైపులు తదితర సామగ్రి తరలించేందుకు రిక్షా కార్మికులకు పనిదొరికింది. వానాకాలం సమీపిస్తుండడంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. మెకానిక్‌ షాపుల వద్ద ట్రాక్టర్లను రిపేరు చేయించారు. ఎలక్ట్రికల్‌ షాపుల్లో సైతం ప్రజలు తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. వాహన, భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నా యి. గ్రామాల్లో ధాన్యం సేకరణ, ఉపాధి హామీ పనులు, రేషన్‌ బియ్యం పంపిణీ, బ్యాంకుల ద్వారా నగదు లావాదేవీలు ఆ టంకాలు లేకుండా కొనసాగుతున్నాయి. సాయంత్రం 6గంటల తర్వాత కర్ఫ్యూ కొనసాగుతున్నది.