గురువారం 28 మే 2020
Nizamabad - May 09, 2020 , 01:49:52

విద్యా సంవత్సరం ప్రారంభం ఎప్పుడో..?

విద్యా సంవత్సరం ప్రారంభం ఎప్పుడో..?

  • సర్వత్రా కొనసాగుతున్న చర్చ 
  • త్వరలో ‘పది’ పరీక్షలు ప్రారంభం 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో 2020-2021విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభవుతుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చి యథావిధిగా జూన్‌ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందా? లేదా ప్రత్యేక పరిస్థితుల్లో జూలై లేదా ఆగస్టు నెలల్లో ప్రారంభమవుతుందా? అనేదానిపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో చర్చసాగుతున్నది. ప్రతి ఏడాది పాఠశాలస్థాయిలో విద్యాసంవత్సరం క్యాలెండర్‌ జూన్‌లో ప్రారంభమై ఏప్రిల్‌లో ముగు స్తుంది. రాష్ట్రంలో మార్చి 2వ తేదీన కరోనా కేసు వెలుగుచూడడంతో ప్రభుత్వం పాఠశాలలను మూసివేసింది. ఈ నేపథ్యం లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-2 పరీక్షలు ఉంటా యా? ఉండవా? అనే ఉత్కంఠ నెలకొనగా.. పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడం, ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా లక్షా 30 వేల 534 మంది విద్యార్థులు ప్రమోట్‌కానున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్‌ చేయడంతో ఉత్కంఠకు తెరపడగా.. విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందనే చర్చసాగుతున్నది. 

‘పది’ విద్యార్థులకు పరీక్షలు.. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులతో పదో తరగతి పరీక్షలు మధ్యలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పదోతరగతి విద్యార్థులు పరీక్షల భయంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నుంచి తేరుకుంటున్న వేళ ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తిరిగి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రిపరేషన్‌ పూర్తిచేసుకొని పరీక్షలకు రెడీ అయిన వారంతా మరోమారు రివిజన్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 12,751 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాస్తున్నారు. 2020-2021 విద్యాసంవత్సరానికి 9వ తరగతి నుంచి నేరుగా పదో తరగతికి ప్రమోట్‌ అవుతున్న విద్యార్థులు 13,137 మంది ఉన్నారు. 2019-2020 విద్యా సంవత్సరంలో15,447 మంది ఒకటో తరగతి చదివారు.


logo