ఆదివారం 31 మే 2020
Nizamabad - May 09, 2020 , 01:49:49

‘ఉపాధి’ చూపుతున్న ఊరు

‘ఉపాధి’ చూపుతున్న ఊరు

  • భారీ సంఖ్యలో హాజరవుతున్న కూలీలు
  • శ్రమజీవులుగా మారుతున్న పట్టభద్రులు
  • పంచాయతీ కార్యదర్శులకు అదనపు బాధ్యతలు

కరోనాను కట్టడికి చేయడానికి విధించిన లాక్‌డౌన్‌ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. సర్వం మూతపడడంతో అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లాక్‌డౌన్‌ను గౌరవిస్తూ ప్రజలు ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఊరట లభిస్తున్నది.  లాక్‌డౌన్‌ను ఎంతో కట్టుదిట్టంగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఉపాధి హామీ పనులను ముమ్మరం చేసింది. దీంతో ఇండ్లకే పరిమితమైన గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి పనులు ఆసరాగా నిలుస్తున్నాయి.  పూట గడవాలంటే ఏదో ఒక పని చేయక తప్పని పరిస్థితుల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతుండడం వారికి ఊరటనిస్తుంది.

కామారెడ్డి జిల్లాలో

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/బీబీపేట: కామారెడ్డి జిల్లాలో ఉపాధి పనులు జోరందుకున్నాయి. గతం లో పనికి వచ్చేందుకు ఆసక్తి చూపని వారు సైతం తాజా పరిస్థితుల్లో పనులకు వస్తున్నారు. ఫలితంగా కూలీల హాజరులో జిల్లా ముందు వరుసలోకి దూసుకుపోయింది. ఈ ఏడాది కరోనా కారణంగా ప్రారంభంలో కూలీల హాజరు శాతం తక్కువగా ఉండగా.. తాత్కాలికంగా ఉపాధి కోల్పోయిన వారంతా పనుల్లో పాల్గొనడంతో హాజరు శాతం పెరుగుతున్నది. జిల్లా లో మొత్తం జాబ్‌ కార్డులు 2,11,141 ఉండగా ఇందులో రెగ్యులర్‌గా పనులకు వస్తున్న వారు లక్షా 28వేల మంది ఉన్నారు. ప్రస్తుతం లక్షా 80 వేల మంది పనులకు వస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ నెలాఖరులో జిల్లాలో సుమారుగా 80 వేల మంది పనులకు హాజరవ్వగా ఈ ఏడాది ఇదే సమయానికి లక్షా 80వేల మంది పాల్గొంటుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఉపాధి హామీలో కూలీలతో రహదారుల నిర్మాణ, కట్ట కాలువలు, చెరువుల పూడికతీత, హరితహారం  పనులు చేయిస్తున్నారు.  

నిజామాబాద్‌ జిల్లాలో..

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: లాక్‌డౌన్‌లో జిల్లా ప్రజలకు ఉపాధి పనులు ఆసరాగా నిలుస్తున్నాయి. జిల్లాలో ఉపాధి ప నులకు వెళ్తున్న కూలీల సంఖ్య ఈనెల మొద టి తారీఖున 86 వేలుగా ఉంది. మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి ఉపాధి హామీ పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈనెల 3న అధికా రులతో సమీక్ష నిర్వహించి.. జాబ్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని కలెక్టర్‌ ను ఆదేశించారు. లక్షా 30 వేల మందికి ఈ సీజన్‌లో పని కల్పించాలని ఆదేశించడంతో.. ఆ మేరకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు 1.16 లక్షల మం ది ఉపాధి పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లు లేకపోవడంతో కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా రా ష్ట్ర ప్రభుత్వం పనుల బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. పనులు మరిం త ఊపందుకోవడానికి, కూలీల సంఖ్య మ రింత పెరిగేలా అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో సీసీటీలు, భూగర్భజల వృద్ధికి ఉపయోగపడే పనులు, పూడికతీత పనులు, పర్క్యులేషన్‌ ట్యాంకుల నిర్మాణం తదితర పనులు జరుగుతున్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లాలో..

ఆదిలాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పిస్తున్నా రు. జిల్లా వ్యాప్తంగా  1,56,745 జాబ్‌కార్డు లు ఉండగా 3,30,386 మంది కూలీలు ఉ న్నారు. ఏటా వేసవిలో వ్యవసాయ పనులు లేనప్పుడు కూలీలు ఎక్కువ సంఖ్యలో ఉపాధి పనులు చేస్తారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్తగా జాబ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఉపా ధి కల్పిస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ 85 వేల మందికిపైగా ఉపాధి పనులు చేస్తున్నారని అధికారులు తెలిపారు. గత ఏడాది 40 నుంచి 50 వేల మంది ఉపా ధి హామీ పనులకు హాజరు కాగా.. ప్రస్తుతం ప్రతి రోజూ 85 వేల మందికి పైగా ఉపాధి పనులు చేస్తున్నారు.

నిర్మల్‌ జిల్లాలో..

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో ఉపాధిహామీ పథకంలో పనిచేసేవారి సంఖ్య గణనీయం గా పెరుగుతున్నది. జిల్లాలో 1,29,239 జాబ్‌కార్డులుండగా.. 2,29,195మంది కూలీలు ఉన్నారు. గతంలో రోజుకు లక్షా 10వేల మంది వరకు ఈ వేసవి సీజన్‌లో పని చేసేవారు. ఈ ఏడాది 75శాతం మందికి పని కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. దీంతో జిల్లాలో 1,71,896 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది మే 8న 1,09,471మందికి ఉపాధి కల్పించగా.. ఈ ఏడాది మే 8న 1,27,790మందికి ఉపాధి కల్పించారు. గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమకు ఇష్టమొచ్చిన వారికి ఉపాధి చూపేవారు. కొత్తగా కార్డులు ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో జాబ్‌కార్డులు ఉన్న అందరికీ పని చూపడంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కార్డులు ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 3వేల మందికి కార్డులు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న వారు స్వగ్రామాలకు చేరగా.. వారిలో అత్యధికంగా ఉపాధి పనులకు వెళ్తున్నారు. గతంలో రోజు కూలీ రూ. 211 ఉండగా.. ప్రస్తుతం రూ. 237 ఇస్తున్నారు. వేసవి భత్యం కింద 30శాతం అదనంగా ఇ స్తున్నారు. సోమవారం నాటికి రోజుకు 1.40లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.  

ఖాళీగా ఉండడం ఇష్టం లేక..

నేను ఎంబీఏ పూర్తి చేశాను. కష్టకాలంలో చదువుతో పని లేదు. లాక్‌డౌన్‌తో ఇంటి వద్ద ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఉపాధి హామీ పనులకు వస్తున్నాం.  ఇలాంటి ఆపత్కాలంలో కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అవుదామని ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నాం.

- చాకలి నవీన్‌, యాడారం, (కామారెడ్డి)

ఖర్చులకు సగవడుతున్నాయి 

కరోనా జేసుట్ల బయట పనులు లేకుండ పోయినయి. గిసుంటి టైములు ఉపాధి పనులు బాగా అక్కరకొస్తున్నయి. సర్కారు ఇస్తున్న రూ.15 వందలకు గీ పనులతోని అచ్చే డబ్బులు తోడై ఖర్చులకు సగవడుతున్నయి.

- చెన్నవోయిన సాయమ్మ, కమ్మర్‌పల్లి, (నిజామాబాద్‌)


logo