గురువారం 28 మే 2020
Nizamabad - May 07, 2020 , 01:24:47

ముమ్మరంగా ధాన్యం సేకరణ

ముమ్మరంగా ధాన్యం సేకరణ

  • రైతులు ఇబ్బందులు పడొద్దనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
  • మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు  కరోనా వైరస్‌ నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకూడదనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నదని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇందుకోసం 355 కొనుగోలు కేంద్రాలకు అనుమతులు వచ్చాయని తెలిపారు. బుధవారం 343 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, 2.64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు పంపించామని వివరించారు. ఇందులో 2.55 మెట్రిక్‌ టన్నుల (96.47 శాతం) ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు అన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. బుధవారం వరకు రూ. 172 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని, కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా సేకరించిన ధాన్యంలో నిజామాబాద్‌ రూరల్‌లో 96.24 శాతం, బాల్కొండలో 91.41 శాతం, ఆర్మూర్‌లో 95.27 శాతం, బోధన్‌లో 97.87 శాతం, బాన్సువాడలో వంద శాతం రైస్‌మిల్లర్ల దగ్గర అన్‌లోడ్‌ అయినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఎవరో చెప్పే మాయమాటలను నమ్మి రైతులు అధైర్య పడొద్దని భరోసానిచ్చారు.


logo