ఆదివారం 31 మే 2020
Nizamabad - May 06, 2020 , 02:50:18

గ్రీన్‌జోన్‌ దిశగా ఇందూరు..

గ్రీన్‌జోన్‌ దిశగా ఇందూరు..

  • మిగిలింది మరో 11 మంది మాత్రమే..

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నిజామాబాద్‌ జిల్లా గ్రీన్‌జోన్‌ వైపు అడుగులు వేస్తున్నది. జిల్లాలో మొత్తం 61 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 50 మంది గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 11 మంది మాత్రమే గాంధీ దవాఖానలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరు పూర్తిస్థాయిలో కోలుకొని డిశ్చార్జి అయితే జిల్లాను గ్రీన్‌జోన్‌గా ప్రకటించే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటికే కంటైన్మెంట్‌ క్లస్టర్లు దాదాపుగా ఎత్తివేశారు. నాందేవ్‌వాడ, మోస్రాల్లో మాత్రమే రెండు కంటైన్మెంట్‌ క్లస్టర్లు కొనసాగుతున్నాయి. 21 క్వారంటైన్‌ సెంటర్లు ఖాళీ అయ్యాయి. గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన వారు మాత్రం హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. వీరిపై వైద్యబృందం నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నది. మరోవైపు కంటైన్మెంట్‌ క్లస్టర్లలో నిబంధనలు సడలించిన వైద్య ఆరోగ్యశాఖ.. వీటి పరిధిలో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నది. దాదాపు రెండు వారాలుగా ఒక్క పాజిటివ్‌ కేసు  నమోదు కాకపోవడం జిల్లాలో కరోనా నియంత్రణలో ఉందనడానికి నిదర్శనంగా అధికారులు భావిస్తున్నారు.

పలువురికి హోం క్వారంటైన్‌..  

ఖానాపూర్‌/విద్యానగర్‌ (రామారెడ్డి)/ లింగంపేట (తాడ్వాయి) : కరోనా సోకిన వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న పలువురికి వైద్య అధికారులు మంగళవారం హోం క్వారంటైన్‌ విధించారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పట్టణం ఇంద్రానగర్‌కు చెందిన వ్యక్తి జగిత్యాలలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. అదే దవాఖానలో తాజాగా కరోనా పాజిటివ్‌ కేసు బయటపడినట్లు వైద్యశాఖ గుర్తించింది. ఇంద్రానగర్‌కు చెందిన వ్యక్తి కాలుకు గాయం కావడంతో ఏప్రిల్‌ 25న ఆ దవాఖానలో వైద్యం చేయించుకున్నాడు. పెంబి పీహెచ్‌సీ హెచ్‌ఈవో కన్నయ్య, ఏఎన్‌ఎం పార్వతి, ఆశవర్కర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 28 రోజులపాటు హోం క్వారంటైన్‌ విధించారు. కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లికి చెందిన వ్యక్తి మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఆయనను హోం క్వారంటైన్‌లో ఉండాలని రామారెడ్డి ఎస్సై రాజు సూచించారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారు ఆరుబయట తిరుగొద్దని తాడ్వాయి ఎస్సై కృష్ణమూర్తి సూచించారు. తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి, చిట్యాల గ్రామాలకు బెంగళూరు నుంచి వచ్చిన వారికి వైద్యశాఖ అధికారులు హోం క్వారంటైన్‌ విధించారు. మంగళవారం వారి ఆరోగ్యస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  


logo