శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - May 03, 2020 , 02:40:35

పశుగ్రాసానికి లేదు ఢోకా!

పశుగ్రాసానికి లేదు ఢోకా!

  • సాగు విస్తీర్ణం పెరగడంతో పుష్కలంగా గడ్డి
  • కొరత లేకుండా అధికారుల చర్యలు
  • సబ్సిడీపై గడ్డి విత్తనాల పంపిణీ 

వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంస్కరణలతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో అంచనాలకు మించి ధాన్యం దిగుబడులు వచ్చాయి. ధాన్యం ఇబ్బడి ముబ్బడిగా రావడంతో పశుగ్రాసానికి సైతం ఢోకా లేకుండా పోయింది. దీనికి తోడు అధికారులు సైతం పశుగ్రాసం అందుబాటులోఉండేలా సబ్సిడీపై రైతులకు గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తున్నారు.  

నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, కామారెడ్డి జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 1.12 లక్షల ఆవులు, 1.81 లక్షల గేదె లు, 5.73 లక్షల గొర్రెలు, 1.67 లక్షల మేకలు ఉన్నాయి. వీటన్నింటికీ 3.44 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అవసరం ఉంది. అయితే, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పంటల విస్తీర్ణం భారీగా పెరగడంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తుండడంతో పశుగ్రాసం పెరిగింది. జిల్లాలో జూన్‌ వరకు 3.68 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర పశుగ్రాసం అందుబాటులోకి రానుందని కామారెడ్డి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జగన్నాథా చారి తెలిపారు. రైతులకు పచ్చిగడ్డి పెంపకానికి 40 మెట్రిక్‌ టన్నుల మేర విత్తనాలు సరఫరా చేశారు. పాడి పశువుల కోసం పీసీ-23 జొన్న జాతి గడ్డి రకాన్ని విస్తృతంగా సాగు చేసే విధంగా రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఇంకా ఆసక్తి గల రైతులకు గడ్డి విత్తనాలు పంపిణీ చేసేందుకు 10 మెట్రిక్‌ టన్నులను సిద్ధం చేసి ఉంచారు.

నిర్మల్‌ జిల్లాలో పుష్కలంగా.. 

నిర్మల్‌ జిల్లాలో 1,79,045 ఆవులు, 1,21,193 గేదెలు, 6,33,153 గొర్రెలు, 1,01,145 మేకలున్నాయి. వీటి కోసం అవసరమైన పశుగ్రాసం అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. జనవరి  నుంచి జూన్‌ వరకు 3.25 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అవసరముండగా.. ఇప్పటికే నిర్మల్‌ జిల్లా లో 3.40లక్షల మెట్రిక్‌ ట న్నుల పశుగ్రాసం అందుబాటులో ఉంది. మరో 50 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం విత్తనాలను 75 శాతం రాయితీపై పంపిణీ చేశారు. బర్రెలు, ఆ వులు ఉన్నవారు బోరుబావుల దగ్గర పచ్చిగడ్డి సాగు చే శారు. కొందరు రైతులు ఎడ్ల కోసం పచ్చిగడ్డిని నిరంతరం సాగు చేస్తూనే ఉన్నారు. జిల్లాలో జూలై నెలాఖరు వరకు సరిపోయేంత పశుగ్రాసం నిల్వలు ఉన్నాయని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి రమేశ్‌  తెలిపారు. 


logo