ఆదివారం 31 మే 2020
Nizamabad - May 01, 2020 , 01:57:45

మరో ఏడాదిపాటు ఇక్కడే..

మరో ఏడాదిపాటు ఇక్కడే..

  • 77 మంది ఎఫ్‌ఎస్‌డీ ఉద్యోగులు జిల్లా దవాఖానలోనే..  
  • కీలక సమయంలో వారి సేవలు జీజీహెచ్‌లో కొనసాగాలని కోరిన మంత్రి 
  • సానుకూలంగా స్పందించిన సీఎం.. ప్రత్యేక జీవో విడుదల
  • కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: కరోనా విపత్తు వేళ జిల్లా కేంద్ర దవాఖానలో పనిచేస్తున్న 77 మంది వైద్య సిబ్బందికి ఫారిన్‌ సర్వీస్‌ డిప్యుటేషన్‌ (ఎఫ్‌ఎస్‌డీ) గడువు ఏప్రిల్‌ నెలాఖరుతో ముగియగా.. మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక్కడ ఎఫ్‌ఎస్‌డీతో పనిచేస్తున్న వారు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. కష్ట సమయంలో జీజీహెచ్‌లోనే వీరి సేవలు కొనసాగాలని సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిపారు. వైద్య ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్లిపోతే సేవల్లో ఇబ్బందులు ఏర్పడతాయనే విషయాన్ని వివరించానని పేర్కొన్నారు. తన విన్నపాన్ని మన్నించిన సీఎం ప్రత్యేక జీవో రూపంలో వీరిని ఏడాదిపాటు నిజామాబాద్‌ దవాఖానలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. 77 మందిలో 30 మంది స్టాఫ్‌ నర్సులు, ఐదుగురు మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు (ఎంపీహెచ్‌ఏ), 12 మంది పారా మెడికల్‌ సిబ్బంది, నలుగురు ఆఫీస్‌ స్టాఫ్‌, 26 మంది నాలుగో తరగతి ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. డిప్యుటేషన్‌ గడువు పొడిగించిన ప్రభుత్వానికి, మంత్రి ప్రశాంత్‌రెడ్డికి రుణపడి ఉంటామని తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. గంగాధర్‌ చెప్పారు.


logo